ఇప్పుడే జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలా.. !

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని సీబీఐకి లేని కోరిక‌, వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజులో క‌నిపిస్తోంది. నిత్యం జ‌గ‌న్‌ను తిట్టిపోసే ర‌ఘురామను ఒక రోజు ఏపీ సీఐడీ అధికారులు గుంటూరు తీసుకెళ్లి…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని సీబీఐకి లేని కోరిక‌, వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజులో క‌నిపిస్తోంది. నిత్యం జ‌గ‌న్‌ను తిట్టిపోసే ర‌ఘురామను ఒక రోజు ఏపీ సీఐడీ అధికారులు గుంటూరు తీసుకెళ్లి చిత‌క్కొట్టారు. ఆ కాళ‌రాత్రి ఎలాగోలా బ‌తికి బ‌య‌ట ప‌డ్డాన‌ని ప‌లు సంద‌ర్భాల్లో ర‌ఘురామ త‌న ఆవేద‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

సీఎం జ‌గ‌న్‌పై ప్ర‌తీకారం తీర్చుకోడానికి ర‌ఘురామ క‌సితో ఎదురు చూస్తున్నారు. ర‌ఘురామ త‌న ప్ర‌తీకారం తీరే వ‌ర‌కూ నిద్ర‌పోతారో లేదో కూడా తెలియ‌దు. నిత్యం ఏదో ఒక సాకుతో జ‌గ‌న్‌పై న్యాయ స్థానాల్లో కేసులు వేయ‌డం గ‌మ‌నార్హం. తాజాగా సుప్రీంకోర్టులో జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ ర‌ఘురామ వేసిన పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పిటిష‌న‌ర్‌ను సర్వోన్న‌త న్యాయ‌స్థానం కీల‌క‌మైన ప్ర‌శ్న అడిగింది.

ఇప్పుడే జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలా? అంటూ సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సంధించిన ప్ర‌శ్న‌ను ఎవ‌రైనా ఎలాగైనా అర్థం చేసుకోవ‌చ్చు. ఇందులో వ్యంగ్యం ఉంద‌నే వారి సంఖ్యే ఎక్కువ. ఈ ప్ర‌శ్న‌కు ఖంగుతిన్న పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది.. నోటీసులు ఇచ్చిన త‌ర్వాతే అని స‌మాధానం చెప్ప‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌, సీబీఐ స‌హా ప్ర‌తివాదులంద‌రికీ నోటీసులు ఇవ్వాల‌ని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.

పిటిష‌న్ ఎవ‌రు వేసినా నోటీసులు ఇవ్వ‌డం స‌హ‌జం. ర‌ఘురామ పిటిష‌న్‌పై అదే జ‌రుగుతోంది. అయితే ఇప్పుడే జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలా? అని సుప్రీం ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించ‌డం ద్వారా న్యాయ‌స్థానం ఆలోచ‌న‌పై ర‌క‌ర‌కాల చ‌ర్చ జ‌రుగుతోంది.