చంద్రబాబునాయుడు మొట్టమొదట ప్రకటించిన అభ్యర్థికి వ్యతిరేకంగా సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు పావులు కదుపుతున్నారు. సదరు సీనియర్ నాయకుడి ధోరణి చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. రెండేళ్ల క్రితం డోన్ టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించారు. అప్పటి నుంచి సుబ్బారెడ్డి భారీ మొత్తంలో ఖర్చు పెడుతూ పార్టీ శ్రేణుల్ని కాపాడుకుంటూ వస్తున్నారు.
ఇక్కడి నుంచి వైసీపీ తరపున ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మరోసారి బరిలో నిలబడనున్నారు. బలమైన బుగ్గనను ఎదుర్కోవాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన సుబ్బారెడ్డే సరైన అభ్యర్థి అని చంద్రబాబు భావించారు. అయితే డోన్‌లో మొదటి నుంచి రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్న కేఈ కుటుంబం, బాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ తాను డోన్ నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించి టీడీపీకి షాక్ ఇచ్చారు.
కుప్పంలో చంద్రబాబు, పులివెందులలో వైఎస్ జగన్ ఏ విధంగా పోటీ చేస్తారో, తాను కూడా డోన్ నుంచి అదే రకంగా బరిలో వుంటానని స్పష్టం చేశారు. 1996 ఉప ఎన్నికల్లో కేఈ ప్రభాకర్ డోన్ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 1999లో కూడా అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. 2004లో కాంగ్రెస్ నాయకురాలు కోట్ల సుజాతమ్మ చేతిలో ఆయన ఓడిపోయారు.
డోన్‌తో రాజకీయంగా బలమైన అనుబంధం ఉన్న తాను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టనని కేఈ చెప్పడం టీడీపీని ఆందోళనకు గురి చేస్తోంది. 2009లో చంద్రబాబు ఆదేశాల మేరకే పత్తికొండ నుంచి పోటీ చేసి గెలుపొందినట్టు కేఈ ప్రభాకర్ తాజాగా చెప్పడం విశేషం. అసలు తనకు కాకుండా డోన్‌లో మరొకరికి చంద్రబాబు ఏ విధంగా టికెట్ ఇస్తారని ఆయన ప్రశ్నించడం గమనార్హం.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో తాను ఐదు నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతానని కేఈ ప్రభాకర్ చెబుతున్నారు. ఎన్నికల సమయంలో కేఈ ప్రభాకర్ కామెంట్స్ డోన్ టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇలాగైతే వైసీపీ మరోసారి సులువుగా గట్టెక్కుతుందనే చర్చ జరుగుతోంది.