విశాఖ ఫిషింగ్ హార్బర్ బోట్ల దగ్గం వెనుక యూ ట్యూబర్ లోకల్ బాయ్ నాని పాత్రపై మొదట అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ యువకుడిని పోలీసులు తీసుకెళ్లి నాలుగు రోజుల పాటు అదుపులో పెట్టుకుని విచారించారు. అయితే అతని పాత్ర గురించి ఎలాంటి ఆధారాలు బయటపెట్టలేదు. ఈ నేపథ్యంలో అన్యాయంగా తనపై కేసు పెట్టారని, న్యాయం చేయాలంటూ అతను ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో అతను మీడియాతో మాట్లాడుతూ తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని వుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే కాపాడాలని యూట్యూబర్ వేడుకున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని అతను ఆవేదనతో చెప్పారు. అయితే తననే నిందితుడిగా పోలీసులు దుష్ప్రచారం చేశారని, తన బతుకు నాశనం చేశారని వాపోయారు.
బోట్లు దగ్ధం కావడానికి తానే కారణం అన్నట్టు సమాజం అనుమానించే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. హార్బర్‌లో ప్రమాదం జరిగే సమయానికి తాను మరో ప్లేస్‌లో స్నేహితులకు పార్టీ ఇచ్చినట్టు చెప్పారు. రాత్రి 11.45 గంటల సమయంలో బోట్లు తగల బడుతున్నట్లు ఫోన్ వచ్చిందని, వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా హార్బర్‌కు వెళ్లానన్నారు. తాను వెళ్ళే సమయానికి బోట్లు తగల బడుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు సాయం అందించేందుకు ప్రమాదాన్ని వీడియో తీశానే తప్ప, మరో ఉద్దేశం లేదన్నారు. వీడియో తీసి పోస్ట్ చేసిన తర్వాత పోలీసుల నుంచి తనకు ఫోన్ వచ్చిందన్నారు. బోట్లు తగల బెట్టానంటూ తనపై పోలీసులు చేయి చేసుకున్నారని అతను ఆరోపించారు. లాటీతో కొట్టారని చెప్పారు. న్యాయస్థానంలో పిటిషన్ వేయకపోతే పోలీసులు తనను అంతం చేసేవారని లోకల్ బాయ్ నాని ఆందోళన వ్యక్తం చేశారు.
తనతో పాటు మరో నలుగురు అమాయకులను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. దుర్ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ముఖ్యంగా గంగపుత్రులు ఈ వాస్తవాన్ని నమ్మాలని నాని విన్నవించడం గమనార్హం.