Advertisement

Advertisement


Home > Movies - Reviews

Aadikeshava Review: మూవీ రివ్యూ: ఆదికేశవ

Aadikeshava Review: మూవీ రివ్యూ: ఆదికేశవ

చిత్రం: ఆదికేశవ
రేటింగ్: 2/5
నటీనటులు: వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, సదా, తనికెళ్ల భరణి, రాధిక, సుదర్శన్ తదితరులు 
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
కెమెరా: డుడ్లే
ఎడిటర్: నవీన్ నూలి
నిర్మాతలు: నాగ వంశి, సాయి సౌజన్య
దర్శకత్వం: ఎన్. శ్రీకాంత్ రెడ్డి
విడుదల: నవంబర్ 24, 2023

తొలి చిత్రం "ఉప్పెన" తర్వాత ఆ స్థాయిలో హిట్టు కోసం పరితపిస్తున్న వైష్ణవ్ తేజ్ ఈ సారి శ్రీలీలతో జంటగట్టి "ఆదికేశవ" గా వచ్చాడు. చాలా వాయిదాల తర్వాత నేటికి ఈ చిత్రం తెరమీదకొచ్చింది. 

బాలు (వైష్ణవ్ తేజ్) ఒక కంపెనీలో సేల్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటాడు. ఆ కంపెనీ ఓనర్ కూతురు చిత్ర (శ్రీలీల) అతనిని ఇష్టపడుతుంది. 

అనుకోకుండా అతనికి ఒకరి చావు గురించి వర్తమానం అందుతుంది. అప్పటి వరకు తనకి తెలియని పెద్ద రహస్యం తెలుసుకుని షాక్ అవుతాడు. తన పేరు రుద్ర కాళేశ్వర్ రెడ్డి అని తెలుసుకుంటాడు. ఇంతకీ ఆ చావు ఎవరిది? దానికి, ఈ బాలుకి సంబంధం ఏంటి? అసలు ఆదికేశవ అనేవాడు ఎవరు? వీటికి జవాబులు చెప్పే కథనమే ఈ చిత్రం. 

కథగా చూసుకుంటే చాలా సింపుల్ ప్లాట్. చివరాఖరి క్లైమాక్స్ ట్విస్ట్ తప్పించి తక్కినదంతా చాలా సార్లు చూసేసిన సినిమాల ఫ్లేవర్‌లోనే ఉంది. ఇలాంటప్పుడు ఆదుకోవాల్సింది కొత్త తరహా కథనం. అదే పెద్ద లోపం ఈ చిత్రానికి. 

సన్నివేశ రూపకల్పన గానీ, సాంకేతికంగా చూసుకుంటే నేపథ్య సంగీతం కానీ సినిమాని డౌన్ చేసేసాయి. ఏదో షార్ట్ ఫిల్మ్ స్థాయి మ్యూజిక్ లాగానో, పదిహేనేళ్ల క్రితం ఒక అమెచ్యూర్ సంగీత దర్శకుడి స్టాండర్డ్ లోనో వినిపిస్తుంది తప్ప ఎక్కడా జీవీ ప్రకాష్ సంగీతంలా అనిపించదు. అసలు తానే చేసాడా లేక ఇంకెవరికైనా అప్పగించాడా అని డౌటొస్తుంది. ఏదైనా సీన్ ఎంగేజింగ్ గా లేదనుకున్నా, రెండు గంటల సినిమా కూడా డ్రాగ్ అవుతున్న ఫీలింగొచ్చినా దానికి ప్రధాన కారణం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కే. ఉన్నంతలో పాటలు మాత్రం బాగున్నాయి. 

"నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడ బుడ్డి..." లాంటి పాత పాటల మెడ్లీకి పిల్లలతో కలిసి స్టెప్పులు వేస్తూ హీరోయిన్ శ్రీలీల ఇంట్రడక్షన్ జరిగింది. చూడ్డానికి బాగానే ఉన్నా భయంకరమైన నాన్ సింక్ లో ఉంది ఆ ఇంట్రో. ఈ ఇంట్రోకి హాల్లో జనం ఈలలలేస్తారని దర్శకుడు ఊహించి ఉండొచ్చు. కానీ పిన్ డ్రాప్ సైలెంట్ గా చూసారంటే ఎంత నాన్-సింక్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

ఫస్టాఫ్ అంతా ఎక్కడా హుక్ లేకుండా లైటర్ వీన్ లో నడిపించాలనుకున్న ఆలోచన పూర్తిగా సఫలీకృతం కాలేదు. వింటేజ్ ఎక్స్ప్రెషన్స్, చిన్న డ్రామాకే ఏదో అయిపోయిందన్నట్టుగా మ్యూజిక్, ఓవర్ ఎమోషన్స్ ఔట్ డేటెడ్ గా అనిపిస్తాయి. తెర మీద సీన్లు వెళ్తూ ఉంటాయి తప్ప ప్రేక్షకుల మనసుల్లో సింక్ అవ్వవు. ఇంటర్వెల్ మాత్రం త్వరగా అయిపోయి ఊరటనిస్తుంది. 

అయితే సెకండాఫ్ అంతా ప్రెడిక్టెబుల్ గా సాగుతుంది. అప్పటి వరకు అర్బన్ లొకాలిటీలో స్టైల్ గా ఉన్న హీరో రూరల్ బ్యాక్ డ్రాపులో భయంకరమైన వయొలెంట్ ఫైట్స్ చేస్తాడు. ఊహించినట్టుగా కథ ముగుస్తుంది. లాస్ట్ సీన్లో ఒక చిన్న లైటర్ వీన్ ఎండింగ్.. అంతే. 

ఈ సినిమాలో వయొలెన్స్ మరీ ఘోరంగా ఉంది. కాల్చిన గునపాన్ని గొంతులో దింపడం, డ్రిల్లింగ్ మెషీన్ తో బాడీని డొల్చేయడం, తలకాయలు తెగ్గొట్టేయడం, సజీవదహానలు చేసేయడం లాంటివి మరీ అతిగా అనిపిస్తాయి. "ప్రేక్షకులకి కావాల్సింది ఆ అతే" అనుకుంటే చేసేదేం లేదు.. భరించడం తప్ప. 

ఇలాంటి రొటీన్ కథ, తేలిపోయే సన్నివేశాలు, కమర్షియల్ ఫార్ములా పేరుతో పాచిన పాత తరహా రైటింగ్ కలగలిసి ఈ సినిమాని చంపేసాయి. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే అది నిడివి మాత్రమే. దర్శకుడు నిర్ణయమో, ఎడిటర్ పనితనమో కానీ ..ఈ ఒక్క అంశం మాత్రం ప్రేక్షకుడిని కాపాడింది. 

వైష్ణవ్ తేజ్ ఎక్కడా నేచురల్ గా కనిపించలేదు. నటించాలి కాబట్టి నటించినట్టుగా ఉంది తప్ప డెప్త్ లేదు. దానికి తోడు సెకాండాఫులో అంతేసి యాక్షన్ సీన్లు అతనికి అస్సలు నప్పలేదు. 

శ్రీలీల చూడడానికి బాగుంది. చెప్పిన డ్యాన్స్ మూమెంట్స్ చేసింది. అంతే తప్ప తన పాత్రలో మెప్పించడానికి దర్శకుడు స్కోపే ఇవ్వలేదు. 

ఆఖరికి మళయాళ నటుడు జోజు జార్జ్ కూడా పాతచింతకాయ నటన ప్రదర్శించాడు. సదాది అతిధి పాత్రకంటే కాస్త పెద్ద పాత్ర. ఓపెనింగ్ హడావిడే తప్ప ఎక్కడా రిజిస్టర్ కాదు. రాధిక మాత్రం ఓకే. 

సుదర్శన్ చేసిన కామెడీ కూడా పరమ రొటీన్. మిగిలిన నటీనటులు ఓకే. తనికెళ్ల భరణికి రాయలసీమ యాస కొత్తగా ఉంది. 

సరిగ్గా చూస్తే అసలీ సినిమా 20 ఏళ్ల క్రితం రాసుకున్నదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పల్లెటూరిలో స్కూల్ లేక అక్కడి పిల్లలందరూ బాలకార్మికులుగా పనిచేసే సీన్ ఉంది ఇందులో. అసలిప్పుడు ప్రాధమిక పాఠశాల లేని పల్లెటూళ్లు ఎక్కడున్నాయి? 

అలాగే అర్ధం లేకుండా ఒక పెద్ద కంపెనీ ఓనర్ కూతురు, హీరోకి బాస్ అయిన శ్రీలీల ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంది తప్ప కారెక్కదు. 

ఇలాంటి అమెచ్యూర్ స్క్రీన్ ప్లే రైటింగ్ పక్కన పెడితే సినిమాకి సంబంధం లేని మేనమామ పాత్రకి సంబంధిందిన డైలాగ్ ఒకటి పెట్టారు చివర్లో. "నీది నీ మేనమామ పోలికరా.." అంటుంది రాధిక తన కొడుకుతో. ఆయనెక్కడున్నాడు అని అడిగితే, "జనానికి దగ్గరగా.. జనం కొసం" అంటూ ఏదో డైలాగ్ కొడుతుంది. అంటే పవన్ కళ్యాణ్ రిఫెరెన్స్ అన్నమాట. దీనికి కూడా ప్రేక్షకులు స్పందించలేదంటే అప్పటికే ఎంత నీరసపడ్డారో అర్ధం చేసుకోవచ్చు. 

ఎలా చూసుకున్నా ఈ "ఆదికేశవ" సినిమా షార్ట్ ఫిలిమ్స్ తీసే ఎమెచ్యూర్ దర్శకులు కూడా పెదవి విరిచేలా ఉంది. ఇంతోటి కంటెంట్ కి అంతేసి ఖర్చా అని నెవ్వెరబోయేట్టు ఉంది. రెండు గంటల అలసటని తీర్చుకోవడానికి "కేశవా! నారాయణా" అంటూ నిట్టూరుస్తూ కుర్చీల్లోంచి లేవాల్సొస్తుంది. 

బాటం లైన్: కేశవా! నారాయణా! వాసుదేవా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?