సీమ‌కు అన్యాయం చేసేలా టీటీడీ ఉద్యోగ నోటిఫికేష‌న్‌!

భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ఈవో ధ‌ర్మారెడ్డి నేతృత్వంలోని టీడీపీ పాల‌క మండ‌లి ఉద్యోగాల భ‌ర్తీకి నిర్ణ‌యించ‌డం స్వాగ‌తించాల్సిన ప‌రిణామం. అయితే ఉద్యోగాల భ‌ర్తీ జోన‌ల్ విధానంలో చేప‌ట్ట‌క‌పోవ‌డంతో రాయ‌ల‌సీమ స‌మాజానికి తీవ్ర న‌ష్టం జర‌గ‌నుంద‌నే ఆందోళ‌న…

భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ఈవో ధ‌ర్మారెడ్డి నేతృత్వంలోని టీడీపీ పాల‌క మండ‌లి ఉద్యోగాల భ‌ర్తీకి నిర్ణ‌యించ‌డం స్వాగ‌తించాల్సిన ప‌రిణామం. అయితే ఉద్యోగాల భ‌ర్తీ జోన‌ల్ విధానంలో చేప‌ట్ట‌క‌పోవ‌డంతో రాయ‌ల‌సీమ స‌మాజానికి తీవ్ర న‌ష్టం జర‌గ‌నుంద‌నే ఆందోళ‌న ఆ ప్రాంత పౌర స‌మాజంలో వుంది. ఈ మేర‌కు రాయ‌ల‌సీమ మేధావుల ఫోరం క‌న్వీన‌ర్ మాకిరెడ్డి పురుషోత్త‌మ్‌రెడ్డి నేతృత్వంలో న్యాయ‌పోరాటానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు.

గ‌తంలో టీటీడీ చైర్మ‌న్‌గా భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ఉన్న‌ప్పుడు ఉద్యోగాల భ‌ర్తీ జ‌రిగింది. తాజాగా మ‌రోసారి ఆయ‌న చైర్మ‌న్‌గా ఉండ‌గా 15 ఏళ్ల త‌ర్వాత‌ ఇంజ‌నీరింగ్ విభాగంలో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఈ ఉద్యోగాలు గ్రూప్‌-2 హోదా కిందికి వ‌స్తాయి. ఆర్టిక‌ల్ 372 డి రాష్ట్ర‌ప‌తి ఉత్త‌ర్వుల మేర‌కు జోన‌ల్ విధానంలో ఉద్యోగాల భ‌ర్తీ జ‌ర‌గాల‌ని, కానీ నోటిఫికేష‌న్‌లో ఆ విష‌యం లేద‌ని రాయ‌ల‌సీమ ఉద్య‌మ నాయ‌కుడు పురుషోత్త‌మ్‌రెడ్డి తెలిపారు.  

టీటీడీ వెలువ‌రించిన నోటిఫికేష‌న్ వ‌ల్ల సీమ ప్రాంత నిరుద్యోగుల‌కు ద‌క్కాల్సిన ఉద్యోగాల‌ను కోల్పోయే అవ‌కాశం వుంది. 2015లో టీటీడీ నేతృత్వంలోని ప‌ద్మావ‌తి మెడిక‌ల్ క‌ళాశాల అడ్మిష‌న్ల‌లో జోన‌ల్ విధానానికి విరుద్ధంగా నాటి టీడీపీ ప్ర‌భుత్వం జీవో నంబ‌ర్ 120 జారీ చేసింది. అప్ప‌ట్లో సీమ విద్యార్థులు భారీగా న‌ష్ట‌పోయారు. దీంతో రాయ‌ల‌సీమ విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌గా, 120 జీవోను కొట్టేసింది. అప్ప‌టి నుంచి జోన‌ల్ విధానంలోనే అడ్మిష‌న్లు జ‌రుగుతున్నాయి.

ఇదే సంద‌ర్భంలో సుప్రీంకోర్టు కీల‌క ఆదేశం ఇచ్చింది. ఆర్టికల్ 371 డి అమల్లో  ఉన్న రాష్ట్రంలో జోనల్ విధానానికి భిన్నంగా నిర్ణ‌యాలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వుండ‌ద‌ని తేల్చి చెప్పింది. స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తీర్పు ఇంత స్ప‌ష్టంగా ఉండ‌గా, దీన్ని ప‌ట్టించుకోకుండా భూమ‌న‌, ధ‌ర్మారెడ్డి ప‌ట్టించుకోకపోవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. 

భూమ‌న‌కు రాజ‌కీయ ఉద్యోగం, ధ‌ర్మాన‌కు ఈవో గిరి దొరికితే చాలు, ఇక సీమ నిరుద్యోగం ప‌ట్ట‌దా? అని ఆ ప్రాంత పౌర స‌మాజం నిల‌దీస్తోంది. సార్ గార్లు వినిపిస్తోందా సీమ నిరుద్యోగ ఘోష‌. ఇప్ప‌టికైనా మించిపోయింది లేదు. త‌ప్పును స‌రిదిద్ది సీమ‌కు చ‌ట్ట‌బ‌ద్ధంగా రావాల్సిన హ‌క్కుల్ని కాపాడాల్సిన బాధ్య‌త భూమ‌న‌, ధ‌ర్మారెడ్డిల‌పై వుంది.