సినిమా హీరోలందు నాన్ థియేటర్ హీరోలు వేరు. చాలా మంది అనుకుంటారు. ఈ హీరో సినిమాలు హిట్ కావడం లేదు అయినా ఎందుకు ఇంకా నిర్మాతలు వెంటబడి మరీ సినిమా తీస్తున్నారా? అని. దానికి సింగిల్ అండ్ సింపుల్ ఆన్సర్.. హిందీ డబ్బింగ్ రైట్స్.
గత కొన్నేళ్లుగా థియేటర్ హిట్‌లు సరిగ్గా లేకున్నా చాలా మంది హీరోలు కేవలం ఈ హిందీ మార్కెట్ ను చూపించుకుంటూ, మాంచి పారితోషికాలు అందుకుంటూ సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. నిర్మాతలు కూడా అది చూసే వెంటపడుతూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పట్లో ఆ పరిస్థితి వుండకపోవచ్చు.
మన సినిమాలకు థియేటర్ మార్కెట్ తరువాత తొలిసారి వచ్చిన అదనపు నాన్ థియేటర్ ఆదాయం శాటిలైట్ సేల్స్. చాలా ఏళ్ల క్రితం చాలా తెలివిగా ఈ శాటిలైట్ ఆదాయాన్ని చూపించి హీరోల రెమ్యూనిరేషన్ పెరిగేలా చేసారు. అది ఓ పెద్ద తెలివైన వ్యవహారం. మనకు అంటూ ఓ ఛానెల్ ఒకటి వుండేలా చూసుకోవడం. ఆ ఛానెల్ ద్వారా మంచ రేట్లకు ‘మన వాళ్ల’ సినిమాలు కొనిపించడం. ఆ ఆదాయాన్ని చూపించి హీరోల రెమ్యూనిరేషన్ పెరిగేలా చేయడం.
సరే, ఆ తరువాత వచ్చిన ఆదాయం హిందీ డబ్బింగ్. హిందీ చానెళ్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాక వాటికి కంటెంట్ విపరీతంగా అవసరం పడింది. మన మాస్ మసాలా రొట్ట సినిమాలు నార్త్ రూరల్ బెల్ట్ వాళ్లకి భలే నచ్చేసాయి. ఆ ఫైట్లు, లాజిక్ లెస్ సీన్లు ఇవన్నీ భలే ఆకట్టుకునేవి. దాంతో ఆ తరహా సినిమాలకు గిరాకీ పెరిగింది. ఇది ఎంత వరకు వెళ్లింది అంటే ఫైట్ అవసరం లేని సినిమాలకు కూడా హిందీ రైట్స్ కోసం ఎక్కడో ఒక దగ్గర ఓ ఫైట్ ఇరికించేంత వరకు. అవసరం అయితే ఇక్కడ థియేటర్ కాపీ లో ఫైట్ సీన్ లేకున్నా, హిందీ డబ్బింగ్ కు అమ్మిన కాపీలో ఫైట్ సీన్ వుండేది.
దీని వల్ల చాలా మంది హిట్ మొహం చూడని హీరోలు వరుస సినిమాలతో నెట్టుకువచ్చారు. ఇద్దరు మిడ్ రేంజ్ హీరోలు కేవలం ఈ డబ్బింగ్ మార్కెట్ చూపించే థియేటర్ లో ఒక్క హిట్ లేకపోయినా, ఇప్పటికీ హీరోలుగా సినిమాలు చేయగలుగుతున్నారు. ఓ సీనియర్ హీరో తన సినిమాలకు హిందీ డబ్బింగ్ మార్కెట్ వుందన్న కారణంగానే ఇరవై కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ డిమాండ్ చేస్తున్నారు.
ఓటిటి వచ్చిన తరువాత ఈ వ్యవహారం మరో టర్న్ తీసుకుంది. కోవిడ్ తరువాత ఓటిటి సంస్థలు డిజిటల్ కంటెంట్ కోసం ఎగబడ్డాయి. దాంతో ప్రతి సంస్థ తెగ సినిమాలు ప్లాన్ చేసేసాయి. పాతిక మంది హీరోలు వుంటే ఏ ఒక్క హీరో ఖాళీలేని పరిస్థితి. దాంతో చిన్న చితక వేషాలు వేసే వారికి కూడా డిమాండ్.
జస్ట్ అలా కనిపించి ఇలా వెళ్లిపోయే నటులకు కూడా రోజుకు ముఫై నుంచి యాభై వేలు రేటు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు అనిపించుకున్న వారికి రోజుకు మూడున్నర లక్షలు. హీరోల సంగతి చెప్పనక్కరలేదు. ఏడెనిమిది సినిమాలు ఫ్లాపులు, యావరేజ్ లు అనిపించుకున్న హీరోలకు కూడా రెమ్యూనిరేషన్ ఎనిమిది కోట్ల నుంచి పాతిక కోట్లకు పెరిగిన వైనం. మూడు కోట్ల మేరకు తీసుకునే మిడ్ రేంజ్ హీరోలు ఇవ్వాళ పది, పన్నెండు కోట్లు డిమాండ్ చేసే స్థితికి చెేరిపోయారు.
ఇప్పుడు సినిమాకు చల్ది కన్నా ఊరగాయ ఘనం అన్నట్లు తయారైంది. ఫ్లాపులు ఇస్తూ కూడా సినిమాలు అందుకుంటున్న హీరోల థియేటర్ మార్కెట్ ఇరవై పైసలు అనుకుంటే నాన్ థియేటర్ మార్కెట్ యాభై పైసలు అన్నట్లు తయారైంది. దీన్ని చూపించి రెమ్యూనిరేషన్లు పెంచుకుంటూ, సినిమాలు అందుకుంటూ వస్తున్నారు. రాను రాను ఇది ఎలా తయారైంది అంటే నాన్ థియేటర్ ఆదాయంలో సినిమా తీసేస్తే థియేటర్ మీద ఎంత వచ్చినా లాభమే అన్నట్లు తయారైంది. రాను రాను అది కాస్తా పోయి, డెఫిసిట్ అనేది మొదలైంది.
అసలు ఏం జరిగింది? ఎందుకిలా?
హిందీ డబ్బింగ్ రైట్స్ ఎందుకు తగ్గాయి. ఓటిటి లు ఎందుకు ఆగాయి. ఇక్కడ విషయం ఏమింటంటే ఇష్టం వచ్చిన రేట్లకు సినిమాలు కొన్నారు. కానీ చానెళ్లకు రిటర్న్ ఆ రేంజ్ లో లేదు. రెండో విషయం ఏమిటంటే కంటెంట్ పెరిగిపోయింది. రేట్లు ఎక్కువ చెప్పేస్తున్నారు. కానీ చానెళ్లు తమ రిటర్న్ చూసుకుంటే అంత సీన్ కనిపించడం లేదు.
ఇలాంటి టైమ్ లో చానెళ్ల అమ్మకాలు, విలీనాలు ఇలాంటివి అన్నీ మొదలయ్యాయి. దాంతో అన్నీ కొనుగోళ్లు తాత్కాలికంగా ఆపేసాయి. అదే టైమ్ లో ఓటిటి సంస్థల విలీనం అన్నది కూడా మొదలైంతది. జియో, హాట్ స్టార్, సోనీ ఇలాంటి సంస్థలు అన్నీ వివిధ పనుల్లో పడ్డాయి. జీ సంస్థ కూడా కరెక్షన్లు చేసుకుంటోంది.
రేట్లు ఎక్కువ చెబుతున్నారు. ఇవన్నీ కరెక్ట్ చేయాలని సంస్థలు అన్నీ డిసైడ్ అయ్యాయి. దాంతో కొనుగోళ్లు అమ్మకాలు కాస్త ఆగాయి. దాంతో గడబిడ మొదలైంది
కంటెంట్ కావాల్సిందే
హిందీ చానెళ్లకు కావచ్చు, ఓటిటి సంస్థలకు కావచ్చు కంటెంట్ అవసరమే. కానీ ఇప్పుడు ఇచ్చినట్లు భారీ రేట్ల కు కాదు. రీజనబుల్ రేట్లకు మాత్రమే కొంటారు. ఇదంతా జరగడానికి మరో నాలుగు నెలలు సమయం పడుతుంది. అంతవరకు టాలీవుడ్ కు కుదుపు తప్పదు. కానీ అంతా సెట్ అయినా రేట్లు మాత్రం ఇప్పుడు వున్న రేంజ్ లో వుండదు.
అందువల్ల జరగాల్సింది ఏమిటంటే హీరోలు దిగి రావాలి. నిర్మాతలు, దర్శకులు క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి. దాని వల్ల నిర్మాత సేఫ్ అవుతారు. థియేటర్ మార్కెట్ పుంజుకుంటుంది. అప్పుడు కేవలం నాన్ థియేటర్ మీద బేస్ అయ్యే బాధ తప్పుతుంది. సరైన సినిమాలే నిలబడతాయి. సరైన హీరోలే నిలబడతారు. అందువల్ల ఈ కుదుపు టాలీవుడ్ కు మంచిదే.