ఏపీలో వైసీపీ, టీడీపీ అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు. జనసేన పార్టీ స్థాయి ఏంటో పవన్‌కల్యాణ్‌కే తెలియదు. ఏపీలో ఎన్నికలకు వేళైంది. టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకున్నాయి. వైసీపీ మాత్రం ఒంటరిగానే బరిలో దిగుతోంది. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల్లో రెండు భిన్నమైన స్వభావాలు కనిపిస్తున్నాయి.
వైసీపీ శ్రేణుల్లో నిరుత్సాహం, టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అలాగే వైసీపీ నేతల్లో మరోసారి అధికారంపై ధీమా, టీడీపీ నేతల్లో భయం కనిపిస్తోంది. ఈ పరిస్థితి ఏంటో అంతుచిక్కడం లేదు. ఎలాగైనా మరోసారి తామే అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. కానీ టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకున్నప్పటికీ, ప్రధాన ప్రతిపక్షంలో అధికారంపై నమ్మకం కుదరకపోవడం గమనార్హం.
అధికారంలోకి వచ్చినా తమకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని వైసీపీ శ్రేణులు నిరుత్సాహంతో ఉన్నాయి. వైఎస్ జగన్‌ను సీఎం చేసుకుంటే తమ బతుకులు మారుతాయని వైసీపీ కార్యకర్తలు, నాయకులు కలలు కన్నారు. గత నాలుగున్నరేళ్లలో అధికార పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో బాగుపడిన వాళ్లు వేళ్లమీద లెక్క పెట్టేంత మంది కూడా లేరు. ఏ పార్టీ అధికారంలో వున్నా ఇదే జరుగుతుంది. అధికార పార్టీ అందరికీ న్యాయం చేయడం అసాధ్యం.
అయితే టీడీపీ అధికారంలో వున్నప్పుడు కార్యకర్తలు, గ్రామ స్థాయి నాయకులకు ఎంతోకొంత చేసింది. అయితే జన్మభూమి కమిటీలు, ఇసుక, మట్టి దోపిడీ, ఇతరత్రా అంశాలు ఆ పార్టీని నిలువునా ముంచాయి. టీడీపీ ఓటమికి సవాలక్ష కారణాలున్నాయి. టీడీపీ ఓటమి నుంచి ఆ పార్టీ ఇప్పటి వరకూ గుణపాఠాలు నేర్చుకున్న దాఖలాలు లేవు. ఇదే రీతిలో వైసీపీ ప్రభుత్వం కూడా వుంది.
అయితే వైసీపీ క్షేత్రస్థాయిలో అణచివేతకు పాల్పడుతోందనే వాదన బలంగా వుంది. అందుకే ఈ దఫా ఎలాగైనా అధికారంలోకి రావాలనే కసి టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. కానీ వైసీపీ శ్రేణుల్లో ఆ కసి, పట్టుదల కరువయ్యాయి. వైసీపీని అధికారంలోకి తెచ్చుకుని ఏం బాగుపడ్డామనే నిర్లిప్తత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆ నిరాశ, నిస్పృహలను పోగొట్టేందుకు వైసీపీ పెద్దలు ప్రయత్నించకపోతే పెద్ద ప్రమాదమే.
ఎందుకంటే ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకూ తీసుకురావాల్సింది గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలే. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల్ని నమ్ముకుని, క్షేత్రస్థాయిలో కేడర్‌ను వైసీపీ విస్మరించి, ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కోంటోంది. వాస్తవ పరిస్థితి ఇట్లా వుంటే, వైసీపీ నాయకులు మాత్రం అధికారంపై ధీమాతో ఉండడం విశేషం.
ప్రభుత్వ వ్యతిరేకత, అలాగే వైసీపీ శ్రేణులు యాక్టీవ్‌గా లేవనే మాట వినిపిస్తున్నా, టీడీపీ నేతల్లో మాత్రం విపరీతమైన భయం వుంది. టీడీపీ కార్యకర్తలే నాయకుల కంటే కొంచెం ధైర్యంగా వున్నారు. ఇదో విచిత్రమైన పరిస్థితి.