తెలంగాణలో బీజేపీతో పొత్తు కుదుర్చుకుని ఎన్నికల బరిలో జనసేనాని పవన్‌కల్యాణ్ దిగారు. 8 సీట్లలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో ముగ్గురు బీజేపీ అభ్యర్థులే వుండడం గమనార్హం. ఎన్నికల ప్రచారానికి వారం మాత్రమే గడువు వుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బుధ, గురువారాల్లో పవన్‌కల్యాణ్ ప్రచారానికి సిద్ధమయ్యారు.
22న వరంగల్, 23న కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో పవన్‌కల్యాణ్ ప్రచారం నిర్వహిస్తారని జనసేన ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ అధికార పార్టీని విమర్శించే దమ్ము పవన్‌కు ఉందా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీపై పవన్‌కల్యాణ్ ఇష్టానుసారం నోరు పారేసుకుంటుంటారు. చెప్పుతో కొడతా, తాట తీస్తా, బేడీలు వేసి నడిరోడ్డుపై ఈడ్చుకెళ్తా లాంటి హెచ్చరికలు పవన్ నుంచి అలవోకగా వస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏ సంఘటన జరిగినా, దానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన విమర్శిస్తుంటారు. ఏపీలో ప్రతిపక్ష పాత్ర బాగా నిర్వర్తిస్తున్నారని అనుకుందాం.
ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం, అధికారం కోసం పోటీ పడుతున్న బీజేపీ మిత్రపక్షంగా, ఏపీలో మాదిరిగానే అధికార పార్టీ బీఆర్ఎస్‌పై విమర్శలు చేసేందుకు పవన్ సాహసిస్తారా? అనే ప్రశ్న ఎదురవుతోంది. ఇటీవల ప్రధాని మోదీతో కలిసి ఎన్నికల ప్రచార సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సభలో బీఆర్ఎస్‌తో పాటు మరో ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్‌పై నోరు తెరిచిన పాపాన పోలేదు.
తాజాగా రెండు రోజుల ప్రచారానికి సిద్ధమైన పవన్‌కల్యాణ్… తెలంగాణలో కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు, అప్రజాస్వామిక పాలనపై విమర్శలు చేస్తారా? చేయరా? అనే చర్చకు తెరలేచింది. తెలంగాణలో పవన్‌కల్యాణ్ ఆస్తులు, వ్యాపారాలున్నాయని, ఒకవేళ మళ్లీ బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తే ఏంటనే ప్రశ్నే, ఆయన నోరు మూయిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తినబోతు రుచి చూడడం ఎందుకు…. ఇవాళ ఎన్నికల ప్రచారంలో పవన్ ఏం మాట్లాడ్తారో చూద్దాం!