మధ్యప్రదేశ్‌లో పోలింగు అయిపోయింది. ఫలానా పార్టీ కచ్చితంగా గెలుస్తుంది అని చెప్పడం కష్టంగా ఉంది. ఫలితాలు వచ్చాకనే తెలుస్తుంది. ఈలోగా రాజ్‌దీప్ సర్దేశాయి చమత్కరించారు – ‘ఓడిపోయే బిజెపి, గెలవలేని కాంగ్రెస్’ అని. ఎందుకిలాటి పరిస్థితి అనేది తెలుసుకోవాలనే యీ ప్రయత్నం. 2018 ఎన్నికలలో మొత్తం 230 సీట్లలో కాంగ్రెసుకు 114 (40.9% ఓట్లు), బిజెపికి 109 (41.0% ఓట్లు), బియస్పీతో సహా యితరులకి 3, స్వతంత్రులకు 4, సీట్లు రాగా, ఫిరాయింపుల తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితి యిది – బిజెపికి 128, కాంగ్రెసుకు 98, బియస్పీకి 1, స్వతంత్రులు 3. 30 స్థానాల లీడ్ ఉన్నా బిజెపి గెలుపుపై పెద్దగా ఆశలు పెట్టుకున్నట్లు కనబడటం లేదు. మధ్యలో 15 నెలలు తప్పిస్తే నాలుగు టర్మ్‌లు అధికారంలో ఉండడంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత గూడు కట్టుకుందనే భయం ఉంది.
అందుకే కాబోలు నాలుగు సార్లు సిఎంగా ఉండి, రాష్ట్ర ప్రజల చేత ‘మామాజీ’గా పిలవబడుతూ కొన్ని పథకాల ద్వారా పాప్యులర్ అయిన 64 ఏళ్ల శివరాజ్ చౌహాన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపడానికి పార్టీ యిష్టపడటం లేదు. అతనికి టిక్కెట్టు యిస్తారో లేదోనని చాలాకాలం సస్పెన్స్‌లో పెట్టి చివరకు యిచ్చారు. ప్రస్తుతం అనేకమంది బిజెపి నాయకుల్లో ఆయనొకడు అన్నట్లు చూస్తున్నారు. ముగ్గురు కేంద్రమంత్రులు, నలుగురు ఎంపీలు, ఒక జాతీయ కార్యదర్శిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా దింపి, వీరిలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు అనే కలరింగు యిస్తున్నారు. ఎక్కడ చూసినా మోదీ కటౌట్లే. మోదీ తన సభల్లో చౌహాన్ పాలన గురించి మాట్లాడకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు.
ఇందిర హయాం నుంచి కాంగ్రెసులో రాష్ట్ర నాయకుల స్థాయిని తగ్గించడం ప్రారంభమైందని అనేక సందర్భాల్లో రాశాను. ఇప్పుడు మోదీ బిజెపిలో అదే ధోరణి కనబడుతోంది. మునిసిపల్ ఎన్నికల కైనా సరే, మోదీ ముఖాన్నే చూపిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ విషయంలో మాత్రమే మినహాయింపు. రాష్ట్రాలలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవర్నీ చూపటం లేదు. దీనికి విపర్యంగా యీసారి కాంగ్రెసు కమలనాథ్‌ను తమ తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపిస్తోంది. పైగా అతనికి పూర్తిగా స్వేచ్ఛ నిచ్చేసి, కేంద్ర నాయకత్వం వేలు పెట్టడం లేదు. జాతీయ సమస్యలు కాకుండా స్థానిక సమస్యలనే ఎన్నికల అంశంగా చేసుకున్నారు. కాంగ్రెసు అంటే కుమ్ములాటలకి పర్యాయపదం. అలాటిది కమలనాథ్, దిగ్విజయ్ సింగ్ సఖ్యంగా ముందుకు సాగుతున్నారు.
ఐకమత్యానికి పేరుబడిన బిజెపిలో యీసారి అసంతృప్తులు బాగా పెరిగారు. సింధియాతో పాటు బిజెపిలోకి వచ్చిన ఫిరాయింపు దారులందరికీ టిక్కెట్లు దక్కడంతో గత ఎన్నికలలో వారితో పోటీ చేసి ఓడిపోయిన వారందరికీ మంటగా ఉంది. ఎంపీలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవతరించడమూ రాష్ట్ర స్థాయి నాయకులకు యిబ్బందిగా ఉంది. కేంద్ర నాయకత్వం తమను ఉపేక్షిస్తోందని ఆరెస్సెస్ వారికి బాధగా ఉంది. ఇవి బిజెపి యిబ్బందులైతే కాంగ్రెసుకి సమాజ్‌వాదీ పార్టీతో యిబ్బంది వచ్చింది. యుపి సరిహద్దు ప్రాంతాలైన బుందేల్‌ఖండ్, వింధ్య ప్రాంతాల్లో ఎస్పీకి కొంత ఓటు బ్యాంక్ ఉంది. 2018 ఎన్నికలల్లో 52 చోట్ల పోటీ చేసి 1 గెలిచింది. 1.3% ఓట్లు తెచ్చుకుంది. ఇప్పుడు కాంగ్రెసు, బిజెపిల మధ్య హోరాహోరీ పోరాటం కాబట్టి, యిదే అదనుగా పొత్తు పెట్టుకుందామని అఖిలేశ్ ప్రతిపాదించాడు కానీ కాంగ్రెసు ససేమిరా అంది. తమకు 6 స్థానాలిస్తానని చెప్పి మోసం చేసిందని ఆరోపిస్తూ 20 చోట్ల కాంగ్రెసుకు పోటీగా అభ్యర్థులను దింపాడు.
కులాల వారీగా చూస్తే రాష్ట్రంలో అగ్రకులాలు 14.3% (6% బ్రాహ్మణులు, 5.8% రాజపుత్రులు, 2.5% వైశ్యులు). వీళ్లు 80 స్థానాల్లో ఫలితాలపై ప్రభావం చూపగలరు. 2018 ఎన్నికల్లో వీరిలో 33% మంది కాంగ్రెసుకు, 58% బిజెపికి ఓటేశారు. బిజెపి హయాంలో ఠాకూర్లు ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నారనే అలక బ్రాహ్మణుల్లో, గుజ్జర్లలో ఉందనే వార్తలు వచ్చాయి. ఒబిసిలు 42%, ఎస్టీలు 21% (వీరికి 47 సీట్లు రిజర్వ్ అయి ఉన్నాయి), ఎస్సీలు 14% (వీరికి 35 సీట్లు రిజర్వ్ అయి ఉన్నాయి) మంది ఉన్నారు. వీరిపై కాంగ్రెసు చాలా ఆశలు పెట్టుకుంది.
బిహార్ తరహాలో కులగణన చేసి బిసిలకు 27% రిజర్వేషన్ యిస్తామని హామీ యిచ్చారు. కానీ స్థానిక కాంగ్రెసు నాయకులు కులగణన గురించి పెద్దగా మాట్లాడటం లేదట. బిసిలకు 62, ఎస్టీలకు 34, ఎస్సీలకు 18 సీట్లు యిచ్చారు. 2018లో బిసిలలో 48% ఓట్లు బిజెపికి, 41% కాంగ్రెసుకి పడ్డాయి. ఎస్సీ, ఎస్టీలలో కూడా యించుమించు యివే శాతాలు. బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని దళిత ఓట్లు ఆకర్షించడానికి చౌహాన్ వారికి ఆరాధ్యుడైన రవిదాస్ స్మారకాన్ని 100 కోట్ల రూ.లతో కడతానని వాగ్దానం చేశాడు. కాంగ్రెసు పార్టీ తమ అధ్యక్షుడు ఖర్గే దళితుడే అంటూ చూపిస్తోంది. మోదీ రాష్ట్రపతి ముర్మును చూపించి గిరిజనులను మురిపిస్తోంది. జనాభాలో ముస్లిములు 6.6% మాత్రమే కాబట్టి వాళ్ల గురించి పట్టించుకునే వారు లేరు.2018లో బిజెపి ఒకే ఒక ముస్లిము అభ్యర్థిని నిలబెట్టింది. కాంగ్రెసు ముగ్గుర్ని నిలబెట్టింది.
జనాభాలో 70% మంది వ్యవసాయంపై, అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడి ఉన్నారు. ఎరువుల కొరత కారణంగా రైతాంగం అసంతృప్తిగా ఉంది. ప్రభుత్వం ప్రయివేటు కంపెనీలతో కుమ్మక్కయిందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. బిజెపి రైతుల మనసు గెలవడానికి గోధుమకు క్వింటాలుకు రూ.2700 (కాంగ్రెసు యిస్తానన్నది 2600), వరికి 3100 (కాంగ్రెసు యిస్తానన్నది 2500) మద్దతు ధర యిస్తామని హామీ యిచ్చింది. కాంగ్రెసు రూ.2లక్షల లోపు రైతు ఋణాలను మాఫీ చేస్తామని హామీ యివ్వడంతో బాటు 37 లక్షల మంది రైతులకు 5 ఎచ్‌పి కెపాసిటీ వరకు ఉన్న పంపులకు ఉచిత విద్యుత్తు యిస్తానంది. సాగుబిల్లులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన రైతులపై బిజెపి ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేస్తానంటోంది.
కాంగ్రెసు హిందూత్వలో కూడా వెనకబడ దలచుకోలేదు. హిందూత్వపై బిజెపికి గుత్తాధిపత్యం ఉందా? అని కమలనాథ్ అడుగుతున్నాడు. బిజెపి వారు అయోధ్య రామాలయం వీడియోలు చూపిస్తే తను తన నియోజకవర్గంలో పెట్టించిన 101 అడుగుల హనుమాన్ విగ్రహం వీడియో చూపిస్తున్నాడు. తన 15 నెలల కాలంలో అనేక గోశాలలు నిర్మించిన సంగతి గుర్తు చేస్తున్నాడు. అయోధ్యలో రామమందిరం తాళాలు తెరిపించిన రాజీవ్‌కు అప్పట్లోనే తను మద్దతిచ్చానని చెప్పుకుంటున్నాడు. బిజెపి ఖాండ్వా జిల్లాలోని ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ఆదిశంకర విగ్రహాన్ని యిటీవలే ఆవిష్కరించింది. అది రూ. 2100 కోట్ల ప్రాజెక్టు. ఆలయాల పునర్మిర్మాణం, సుందరీకరణపై చౌహాన్ రూ.3000 కోట్లు వెచ్చిస్తున్నారు. కాంగ్రెసు మతమార్పిడులను ప్రోత్సహిస్తోందని బిజెపి ఆరోపిస్తోంది. ‘‘కాంగ్రెసు అధికారంలోకి వస్తే హిందూ స్త్రీలు బొట్టు పెట్టుకోలేరు, గాజులు వేసుకోలేరు.’’ అంటూ శివరాజ్ హెచ్చరిస్తున్నాడు.
రెండు పార్టీలూ మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నించడం వెనుక ఓ కారణం ఉంది. మొత్తం 5.5 కోట్ల ఓటర్లుంటే, వారిలో పురుషులు 2.88 కోట్లు, మహిళలు 2.72 కోట్లు. పోలింగు బూత్‌కు మగవాళ్ల కంటె ఆడవాళ్లే ఎక్కువ వస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో 1962లో 29% మంది మహిళలు ఓటేస్తే, 2018లో 76% మంది వేశారు. 2009 నుంచి దాదాపు అన్ని రాష్ట్రాలలోను మహిళలే ఎక్కువగా ఓటేస్తున్నారు. దీనివలన ప్రయోజనం పొందినవారిలో మమతా బెనర్జీ, నీతీశ్ కుమార్, అరవింద్ ప్రస్ఫుటంగా కనబడతారు. మహిళలు మూకుమ్మడిగా ఓటేయరు కానీ, వాళ్లు ఆసక్తి కనబరచిన పార్టీకి 2-3% ఓట్లు ఎక్కువగా పడతాయి. మార్జిన్లు తక్కువగా ఉన్నపుడు దీనికి చాలా విలువ ఉంటుంది. అయినా టిక్కెట్ల పంపిణీకి వచ్చేసరికి మహిళా అభ్యర్థులకు 10-15% కంటె ఎక్కువగా ఏ పార్టీ యివ్వటం లేదు. మధ్యప్రదేశ్‌లోని 230 సీట్లలో కాంగ్రెసు 30 సీట్లు మహిళలకు యిస్తే, బిజెపి 27 మందికి యిచ్చింది.
వీళ్ల ఓట్లను ఆకర్షించడానికి ప్రభుత్వోద్యోగాల్లో 35% మహిళలకు రిజర్వ్ చేశారు. ప్రధాని ఉజ్వల యోజన కింద యిచ్చే గ్యాస్ సిలండరు ధరను రూ.450కు తగ్గించారు. రక్షాబంధన్ నాడు ప్రతి మహిళ ఖాతాకు రూ.250 బదిలీ చేశారు. చౌహాన్ ఆర్నెల్ల క్రితం లాడ్లీ బెహ్‌నా పథకం ప్రవేశ పెట్టి రూ.2.5 లక్షల వార్షికాదాయం కంటె తక్కువ ఉన్న కుటుంబాల్లో 21-60 మధ్య వయసున్న మహిళలకు నెలకు 1000 రూ.లు యిస్తూ వచ్చి, దాన్ని యిటీవలే 1250కి పెంచాడు. కాంగ్రెసు తను అధికారంలోకి వస్తే దీనికే నారీ సమ్మాన్ యోజనా అని పేరు పెట్టి 1500 యిస్తానంటోంది. మళ్లీ గెలిస్తే మేం 3 వేలు యిస్తానంటోంది బిజెపి. ఈ పథకం కింద 1.32 కోట్ల మంది లబ్ధి పొందారు.
వీటితో పాటు బిజెపి ప్రతి గిరిజన జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ, ప్రతి బ్లాకులో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూలు పెడతానంటోంది. రాష్ట్రంలోని ప్రతి డివిజనులో ఐఐటి తరహా ఇంజనీరింగు కాలేజీ, ఎయిమ్స్ తరహా మెడికల్ కాలేజీ పెడతానంటోంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలలోని ఆడపిల్లలకు కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య యిస్తానంటోంది. 1.3 కోట్ల మందికి కాంక్రీట్ యిళ్లు కూడా.
దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్‌ను 1993 నుంచి 2003 వరకు పాలించాడు. కేంద్రంలో ఉండే కమలనాథ్ అతనికి దన్నుగా నిలిచాడు. 2003లో బిజెపి అధికారంలోకి వచ్చి మధ్యలో 15 నెలల విరామం తప్పిస్తే 20 ఏళ్లగా పాలిస్తోంది. దిగ్విజయ్ పదేళ్ల పాటు బయటకు వచ్చి రాజకీయాల్లో చురుగ్గా లేడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెసు కమలనాథ్-సింధియా జోడీనే ప్రొజెక్టు చేసింది. ఇప్పటి ఎన్నికలలో దిగ్విజయ్ కమలనాథ్‌కు మద్దతు యిస్తున్నాడు. ప్రస్తుత ఎన్నికలలో దిగ్విజయ్ స్ట్రాటజిస్టుగా పని చేస్తున్నాడు. అందుకని అమిత్ షా అతనిపై గురి పెట్టాడు. 20 ఏళ్ల క్రితం నాటి అతని పాలనను యింకా ప్రస్తావిస్తున్నాడు. ‘‘అప్పట్లో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉండేవి కావు. రోడ్లు బాగుండేవి కావు. విద్యుత్ కొరత, నీటి కొరత..’’ అంటూ ఏకరువు పెట్టాడు.
ఈ సందర్భంగా గత 20 ఏళ్ల బిజెపి పాలన రాష్ట్రంపై ఎలాటి ప్రభావం చూపిందో గణాంకాలు చూస్తే మంచిది. 14-11-23 నాటి ‘‘హిందూ’’లో ప్రచురించబడిన యీ డేటా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేస్, గ్లోబల్ డేటా, నీతి ఆయోగ్‌ల నుంచి తీసుకోబడింది. మొదట ఆర్థిక అంశాలు చూద్దాం. 1993-94లో పెర్ కాపిటా ఎన్ఎస్‌డిపి (నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్) విషయంలో 27 రాష్ట్రాలలో దాని స్థానం 19. 2021-22 వచ్చేసరికి అది 21కి దిగజారింది. జనాభాలో 7% మందికి ఉద్యోగాలు కల్పించే ఉత్పత్తి రంగం మొత్తం జివిఎ (గ్రాస్ వేల్యూ యాడెడ్)లో 9% మాత్రమే. ఈ విషయంలో 2020లో 30 రాష్ట్రాలలో దాని స్థానం 22. ఇక హ్యూమన్ ఇండికేటర్స్ విషయంలో 2021లో దాని స్థానం 30 టిలో 27వది.
విద్య విషయంలో 2020లో 1-8 తరగతుల వరకు బడిలో చేరేవారు 81%, (30 రాష్ట్రాలలో 24వ స్థానం). 9, 10 తరగతుల్లో డ్రాపౌట్ అయ్యేవారు 25% ((30 రాష్ట్రాలలో 26వ స్థానం) 11, 12 క్లాసుల్లో చేరేవారు 44% (30 రాష్ట్రాలలో 21వ స్థానం), ఉన్నత విద్యలకు వెళ్లేవారు 22% (30 రాష్ట్రాలలో 22వ స్థానం). మహిళల సంగతి చూస్తే 2019-21లో 18 ఏళ్ల లోపు పెళ్లయిపోయిన బాలికలు 23% (30 రాష్ట్రాలలో 22వ స్థానం), శిశుమరణాలు 41% (30 రాష్ట్రాలలో 27వ స్థానం), బరువు తక్కువగా ఉన్న పిల్లలు 33% (30 రాష్ట్రాలలో 26వ స్థానం). రాష్ట్ర ఋణభారం రూ.3.5 లక్షల కోట్లకు పెరిగింది కానీ నీతి ఆయోగ్ ప్రకారం మధ్యప్రదేశ్‌లో దారిద్ర్యం 20.6% ఉంది. ఇది రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ల కంటె ఎక్కువ.
ఇదేమీ గొప్పగా చెప్పుకోదగిన ప్రగతి కాదు. ప్రస్తుతం ధరల పెరుగుదల, రైతులపై ఆర్థిక మందగమన ప్రభావం, తీవ్ర నిరుద్యోగం వీటన్నిటితో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. మధ్యలో 15 నెలలు తప్పిస్తే, 18ఏళ్లగా ముఖ్యమంత్రిగా ఉన్న చౌహాన్‌పై ఆ ఆగ్రహాన్ని మళ్లించి, పార్టీని రక్షించుకుందామని బిజెపి అధిష్టానం చూస్తోంది. అందువలన సంక్షేమ పథకాలను చూపించే ఓట్లు అడుగుతోంది. కానీ అవి కూడా ఏడెనిమిది నెలల క్రితమే ప్రారంభించాడు చౌహాన్. దీన్‌దయాళ్ రసోయీ యోజనా కింద రూ.10కి యిచ్చే భోజనం రేటును యిటీవలే రూ.5కి తగ్గించాడు. టూ లేట్ అండ్ టూ లిటిల్ అనిపిస్తుంది, తెలుగు రాష్ట్రాలలో పథకాలతో పోలిస్తే! ఉద్యోగులను ఆకట్టుకోవడానికి కాంగ్రెసు పాత పెన్షన్ పథకాన్ని అమలు చేస్తామని హామీ యిచ్చింది.
కాంగ్రెసు 76 ఏళ్ల కమలనాథ్‌పైనే భారమంతా పెట్టింది. నిజానికి అతను ఆ రాష్ట్రానికి చెందినవాడు కాదు. కాన్పూరులో పుట్టాడు, కలకత్తాలో పెరిగాడు. కుటుంబ వ్యాపారాలు చేసుకునేవాడు. డూన్ స్కూలులో సంజయ్ గాంధీకి స్నేహితుడు కాబట్టి యూత్ కాంగ్రెసులో చేరాడు. 1980లో పార్లమెంటు ఎన్నికలు వచ్చినపుడు ఇందిరా గాంధీ కోరికపై యీ రాష్ట్రంలోని చింద్వారా నియోజకవర్గం నుంచి పోటీ చేసి నెగ్గాడు. నియోజకవర్గానికి చాలా సేవలు చేయడంతో అప్పణ్నుంచి మరో 8 సార్లు నెగ్గాడు. అతని కార్యక్షేత్రం దిల్లీయే. కేంద్ర మంత్రిగా చేశాడు. రాష్ట్రంలో దిగ్విజయ్‌కు మద్దతిస్తూ ఉండేవాడు. అతని యింటి ముందు జనాలు గుమిగూడడం, అతను అందరితో కలిసిపోవడం వంటివి ఉండేవి కావు. ప్రజలకు కావలసినవి అతని ఆఫీసు సిబ్బంది చూసేవారు.
2018లో అతని రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా చేశారు. ఎన్నికలలో కాంగ్రెసు గెలవడంతో యువకుడైన జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి చేస్తారేమో ననుకుంటే సోనియా 71 ఏళ్ల కమలనాథ్‌ను ఎంచుకుంది. తనను సిఎం చేయలేదన్న అలకతో సింధియా 22 మంది కాంగ్రెసు వారితో సహా బిజెపిలోకి మారిపోయి, కమలనాథ్ ప్రభుత్వాన్ని కూలదోశాడు. వారిలో 18 మందికి యిప్పుడు టిక్కెట్లు దక్కాయి. సింధియా ప్రభావం ఉన్న గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో ఉన్న 34 సీట్లలో కాంగ్రెసుకు 26 వచ్చాయి. ఇప్పుడు అతనిటు వచ్చాడు కాబట్టి బిజెపికి ఎన్ని వస్తాయో చూడాలి. క్యాడర్ బేస్‌డ్ బిజెపి సంస్కృతిలో సింధియా యిమిడిపోయాడు కానీ అతని అనుచరులకు ప్రాధాన్యత కోల్పోయినందుకు బాధగానే ఉంది. అతను మాత్రం యీ ఎన్నికలలో బాగానే కష్టపడుతున్నాడు. ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సుందా అని అడిగితే మాత్రం జవాబివ్వటం లేదు.
కమలనాథ్ సూపర్-రిచ్ కావడం, జాతీయ స్థాయిలో నాయకుడిగా ఉంటూ, మరీ అర్బేన్ (పాలిష్‌డ్)గా ఉండడంతో, సాధారణ ఎమ్మెల్యేలు అతనితో చనువుగా ఉండలేక పోయేవారని, ఆ కారణం చేతనే వాళ్లలో రగిలిన అసంతృప్తిని పసి గట్టలేక, సింధియాతో పాటు వెళ్లిన ఫిరాయింపు దారులను అరికట్ట లేకపోయాడని విమర్శలు వచ్చాయి. పదవి పోయిన తర్వాత రిటైరై పోతాడని కూడా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అప్పణ్నుంచి కమలనాథ్ ప్రజల మధ్య బాగా తిరుగుతూ, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ చురుగ్గా ఉన్నాడు. విస్తృతంగా తిరుగుతున్నాడు. దిగ్విజయ్‌తో సోదరభావం నెరపుతూ, అభ్యర్థుల సెలక్షన్ స్వయంగా చూసుకున్నాడు. కర్ణాటక అనుభవం తర్వాత కాంగ్రెసు అధిష్టానం స్థానిక నాయకులకు బాధ్యతలు అప్పగించడం నేర్చుకుంటోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, అధిష్టానం పెత్తనం చలాయించడం తగ్గిస్తుందేమో, దాన్ని చూసి బిజెపి నేర్చుకుంటుందేమో చూడాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2023)