అక్రమ వలసల్లో కూడా దూసుకుపోతున్న ఇండియా

అగ్రరాజ్యం అమెరికాకు అక్రమ వలసలు అనగానే మెక్సికో దేశమే గుర్తొస్తుంది. సొరంగాలు తవ్వి మరీ అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తుంటారు మెక్సికన్లు. అయితే ఇప్పుడీ లిస్ట్ లోకి ఇండియా కూడా చేరింది. అవును.. అమెరికాలోకి అక్రమంగా…

అగ్రరాజ్యం అమెరికాకు అక్రమ వలసలు అనగానే మెక్సికో దేశమే గుర్తొస్తుంది. సొరంగాలు తవ్వి మరీ అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తుంటారు మెక్సికన్లు. అయితే ఇప్పుడీ లిస్ట్ లోకి ఇండియా కూడా చేరింది. అవును.. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న విదేశీయుల జాబితాలో భారత్ ఇప్పుడు మూడో స్థానంలో ఉంది.

యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సంస్థ విడుదల చేసిన తాజా గణాంకాలు అమెరికాలోకి భారత అక్రమ వలసలు గణనీయంగా పెరిగాయనే విషయాన్ని స్ఫష్టం చేస్తోంది. ఈ లెక్కల ప్రకారం.. 2021 నాటికి అమెరికాలో 7 లక్షల 25వేల మంది భారతీయులు అక్రమంగా నివశిస్తున్నారు.

ఈ లిస్ట్ లో 9 లక్షల అక్రమ వలసదారులతో మెక్సికో మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఎల్-సాల్విడార్ (8 లక్షలు), మూడో స్థానంలో భారత్ (7 లక్షల 25వేలు) నిలిచాయి. ఇక నాలుగో స్థానంలో గ్వాటెమలా (7 లక్షలు), ఐదో స్థానంలో హోండూరస్ (5 లక్షల 25వేలు) ఉన్నాయి. మెక్సికో నుంచి గడిచిన కొన్నేళ్లుగా అక్రమ వలసలు తగ్గుతున్నట్టు నివేదిక వెల్లడించింది. అదే టైమ్ లో ఇండియా నుంచి గణనీయంగా అక్రమ వలసలు పెరుగుతున్నట్టు ప్రకటించింది. ఈ లెక్కన చూసుకుంటే, త్వరలోనే ఈ జాబితాలో ఇండియా మొదటి స్థానానికి చేరేలా ఉంది.

కరోనా తర్వాత అమెరికాలో సరిహద్దులు తెరవగా, ఎక్కువగా భారతీయులే అక్రమంగా దేశంలోకి ప్రవేశించారట. 2022 అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ మధ్య 96,917 మంది భారతీయులు సరైన పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించారు. వీళ్లలో 30వేల మంది కెనడా సరిహద్దు నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించగా, దేశ దక్షిణ సరిహద్దు నుంచి మిగతా వాళ్లంతా అక్రమంగా వచ్చారట. అధికారిక లెక్కలే ఇలా ఉన్నాయంటే, అనధికారికంగా అమెరికాలో ఉన్న భారతీయుల సంఖ్య ఇంతకు రెండింతలు ఉండొచ్చు.

ఇలా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన విదేశీయులు ఎక్కువగా 6 రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉన్నారు. 2021 లెక్కల ప్రకారం కాలిఫోర్నియాలో 1.9 మిలియన్ మంది అక్రమ వలసదారులున్నారు. ఆ రాష్ట్రం తర్వాత అత్యథికంగా అక్రమ వలసదారులున్న రాష్ట్రంగా టెక్సాస్ (1.6 మిలియన్) నిలిచింది. లిస్ట్ లో ఫ్లోరిడా (9 లక్షలు), న్యూయార్క్ (6 లక్షలు), న్యూజెర్సీ (4.50 లక్షలు), ఇల్లినాయిస్ (4 లక్షలు) ఉన్నాయి.

దేశజనాభాలో అక్రమ వలసదారులు 3 శాతం ఉన్నారు. అమెరికాలో ఉంటున్న విదేశీయులతో పోల్చిచూస్తే.. 22శాతం మంది అక్రమ వలసదారులే. అయితే ఇండియా నుంచి అక్రమ వలసలు పెరిగినప్పటికీ, ఓవరాల్ గా అమెరికాలో అక్రమ వలసదారుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్టు డేటా విశ్లేషించింది.