భారతీయ జనతా పార్టీలో ఉండే తెలుగుదేశం కోవర్టుగా పలువురినుంచి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండే కీలక నాయకుడు సీఎం రమేష్.. తాజాగా తన స్థాయిని తానే అమాంతం పెంచేసుకుంటున్నారు.
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తుందా లేదా అనే సంగతి ఇప్పటిదాకా తేలలేదు. తెదేపా కూటమిలోకి బిజెపిని కూడా తీసుకువచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని పవన్ కళ్యాణ్ ప్రతిజ్ఞ చేస్తున్నారు. అదే సమయంలో సీఎం రమేష్- బిజెపి తెలుగుదేశం మధ్య పొత్తు కుదిరించగల స్థాయి నాయకుడిగా తనను తాను ప్రొజెక్టు చేసుకుంటున్నారు.
పులివెందుల తెలుగుదేశం పార్టీ నాయకుడు బీటెక్ రవి అరెస్టు అయి జైల్లో ఉన్న నేపథ్యంలో, ములాకత్ ద్వారా ఆయనను కలిసిన సీఎం రమేష్ మాటలు ఈ అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి.
పాత కేసులకు సంబంధించి బీటెక్ రవిని పోలీసులు అరెస్టు చేసి కడప సెంట్రల్ జైల్లో ఉంచగా, సీఎం రమేష్ మాత్రం వక్ర వ్యాఖ్యానాలు చెబుతున్నారు. బీటెక్ రవిని పోలీసులు కిడ్నాప్ చేసి, చంపడానికి ప్రయత్నించారని.. కిడ్నాప్ వార్త మీడియాలో వెల్లడి కావడంతో తమ వల్ల కాక.. అప్పుడు అరెస్టు చూపించారని సీఎం రమేష్ ఆరోపిస్తున్నారు. ‘వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం బిజెపి కలిసి పోటీ చేయడానికి సీఎం రమేష్ ప్రయత్నిస్తున్నారా?’ అనే విషయాన్ని బీటెక్ రవి ద్వారా తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నించినట్టు ఆయన చెప్పుకోవడం గమనార్హం.
తెలుగుదేశంతో భారతీయ జనతా పార్టీని కలిసి పోటీ చేయించాలనే తన మనసులోని కోరికను ఆయన ఈ విధంగా బయటపడుతున్నట్లుగా ఉంది. తద్వారా తనను ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరించగల స్థాయి పెద్ద నాయకుడిగా ప్రొజెక్టు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది. జగన్మోహన్ రెడ్డి సర్కారు తనను చూసి భయపడుతున్నదనే భావనను ఆయన ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అనుకుంటున్నారేమో!
మొత్తానికి తెలుగుదేశం పార్టీ తరఫున భాజపాలో కోవర్టుగా పనిచేస్తున్నారనే ఆరోపణలను చాలా తరచుగా ఎదుర్కొంటూ ఉండే సీఎం రమేష్ ఇప్పుడు ఆ ముసుగు తొలగించాలని అనుకుంటున్నట్టున్నారు. కానీ బిజెపి అగ్రనేత బీఎల్ సంతోష్.. తెలుగుదేశంతో పొత్తు ఉండదన్నట్లుగా సంకేతాలు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.