Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఇద్దరి మధ్యన నలుగుతున్న చంద్రబాబు

ఇద్దరి మధ్యన నలుగుతున్న చంద్రబాబు

రేవంత్ రెడ్డి ఎవరి మనిషి అని అడిగితే ఎవరైనా ఠక్కున చెప్పే సమాధానమేంటి?

ఎస్.. చంద్రబాబు మనిషి అని!

సుప్రసిద్ధమైన నోట్ కి ఓట్ కేసుకి సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియో ఇప్పటికీ చలామణీలో ఉండడం, ఈ మధ్యనే తెదేపా తన పుట్టిల్లు, కాంగ్రెస్ మెట్టినిల్లు అని రేవంత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం వంటి కారణాల వల్ల రేవంత్ అంటే బాబుగారి మనిషే అనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది.

సరే.. మరో ప్రశ్న. పవన్ కళ్యాణ్ ఎవరి మనిషి?

మళ్లీ ఎస్.. ఆయన కూడా బాబుగారి మనిషే అంటాం. పైగా దత్తపుత్రుడు అనే ట్యాగ్ కూడా ఆయనకు పెట్టారు వైకాపా వాళ్లు.

ఈ లెక్కన రేవంత్, పవన్ కళ్యాణ్ మధ్యన సయోధ్య ఎలా ఉండాలి? ప్రస్తుతానికి తెలంగాణా ఎన్నికల్లో రేవంత్, పవన్ కళ్యాణ్ ప్రత్యర్ధులైతే కావొచ్చు. అలాగని కేవలం ఎనిమిది సీట్లల్లో బీజేపీతో పొత్తులో భాగంగా నిలబడి 'మమ' అనిపిస్తున్న పవన్ కళ్యాణ్ గాలి తీసేయాల్సిన అవసరమేంటి రేవంత్ కి?

రెండ్రోజుల క్రితం ఒక టీవీ ఇంటర్వ్యూలో జనసేన తెలంగాణాలో పోటీ చేయడం పవన్ కి ఎంత దెబ్బో చెప్పాడు. రేపు జనసేన తెలంగాణా ఎన్నికల్లో నిలబడిన సీట్లలో గెలవకపోతే దాని ప్రభావం ఆంధ్రా మీద పడుతుందని, "అక్కడ ఏమీ చెయ్యలేని వాడు ఇక్కడేమి చేస్తాడు" అని ఆంధ్రావాళ్లు గిచ్చుతారని వెక్కిరింపులాంటి నవ్వుతో చెప్పాడు రేవంత్. ఇది గాలి తీయడమే!

ఇదిలా ఉంటే.. నిన్నగాక మొన్న రేవంత్ ఒక సభలో మాట్లాడుతూ, "రెడ్లని నమ్ముకున్నోడు ఎవ్వడూ మోసపోలేదు. దానికి ఉదాహరణ వై.ఎస్. రాజశేఖర రెడ్డి. తెలంగాణా ప్రాంతాన్ని ఔటర్ రింగ్ రోడ్, ఫార్మా కంపెనీలు, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో వంటివి పెట్టి ఎంతగానో అభివృద్ధి చేసాడు. పాదయాత్ర చేసి పేదలు, గిరిజనులు, మైనారిటీల బాధలు తెలుసుకుని సంక్షేమ పథకాలు పెట్టి గొప్ప పాలన అందివ్వబట్టే కాంగ్రెస్ పార్టీ ఆనాడు నిలబడింది. రెడ్లని నమ్ముకున్నోడు ఎవ్వడూ మోసపోలేదు. పార్టీల్ని, అధికారాన్ని రెడ్లకి ఇవ్వండి" అని ప్రసంగించాడు.

ఇది వింటుంటే ఏమనిపిస్తోంది? పరోక్షంగా ఆంధ్రలో రెడ్డి కులానికి చెందిన జగన్ మోహన్ రెడ్డినే నమ్ముకోమని జనానికి చెప్తున్నట్టు లేదు! ఒకపక్కన వై.ఎస్.ఆర్ చేసిన ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్ పోర్ట్ ,మెట్రో లాంటి అభివృద్ధి పనుల్ని తన అకౌంట్లో వేసుకుని డప్పు కొట్టుకుంటున్న చంద్రబాబుకి అవన్నీ చేసింది వై.ఎస్.ఆర్ అని జనానికి గుర్తు చేయడమే కాకుండా... రెడ్లని నమ్ముకోమని పిలుపునివ్వడం చంద్రబాబుకి ఎలా ఉంటుంది?

తన వాడు అనుకున్న రేవంత్ ఇలా మాట్లాడుతున్నాడు. అతను తన దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ కి గాలి తీస్తున్నాడు.

మరో పక్క తన వాడనుకున్న పవన్ కళ్యాణ్ భాజపాకి విధేయుడుగా తెలంగాణాలో తన పార్టీని ఎనిమిది స్థానాల్లో పోటీకి పెట్టాడు. అక్కడ గెలవడానికి ఉన్న ఛాన్సు ఎంతో చిన్నపిల్లలు కూడా చెప్తారు. అక్కడ ఓడితే ఆంధ్రాలో జనసేనకి వెక్కిరింపులు తప్పవంటాడు రేవంత్. అలాంటి జనసేనతో పొత్తులో ఉన్నాడు చంద్రబాబు.

ఎవరెవర్నో నమ్మి, ఏదేదో చేసి ఇలా నానారకాల చిక్కుముడుల మధ్య చికాకుగా కూర్చోవాల్సి వస్తోంది చంద్రబాబుకి.

గత జన్మలో ఏదో రుణానుబంధం ఉంటే తప్ప కొడుకులుగా పుట్టరని చెప్తారు. చంద్రబాబుకి లోకేష్ అసలు కొడుకైతే, పవన్ ని దత్తపుత్రుడు అని సరాదాకి అన్నా అందులో తప్పేమీ లేదనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన ఖర్చు మొత్తం భరించేది చంద్రబాబే అనేది బాగా ప్రచారంలో ఉన్న విషయం. ఒక ప్రెస్ మీట్ పెట్టాలన్నా, ఒక పార్టీ మీటింగ్ పెట్టుకోవాలనుకున్నా, ఆఖరికి వారాహిలో డీజిల్ పోయాలన్నా అంతా చంద్రబాబు అకౌంటే అని చెప్తారు.

రేపు ఎన్నికల్లో కూడా, "నువ్వే నా జనసేన జెండాకి అభ్యర్థుల్ని నిలబెట్టుకో... నువ్వే ఖర్చులు పెట్టుకో... ఎలా కావాలో అలా వాడుకో.." అన్న చందాన ఉంది పవన్ వైఖరి.

పదో పరకో సీట్లిస్తే కాపులు గొడవపెడతారు కనుక జాగ్రత్త.. అని సూచన మాత్రం చేయొచ్చు తప్ప కచ్చితంగా తన వర్గం కోసం ఎక్కువ సీట్లు అడగాలని మాత్రం డిమాండ్ చేయడు.

ఇంతేసి ఖర్చు చంద్రబాబు బహుశా లోకేష్ మీద కూడా ఇంతవరకూ పెట్టి ఉండకపోవచ్చు. ఈ లెక్కన చూస్తే పవన్ ది చంద్రబాబుతో రుణానుబంధం వల్ల సంక్రమించిన రాజయోగమనే చెప్పాలి.

లేకపోతే పవన్ కి వెనుక ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడమేంటి... చాణక్యుడని పేరు తెచ్చుకున్న ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబు అతన్ని ఇన్నేళ్లుగా పోషించడమేంటి?!

రేవంత్ తమ బాబుగారి మనిషని తెలంగాణాలో కొందరు కమ్మలు అతనికి మద్దతిస్తున్న వేళ "రెడ్లని నమ్ముకున్నవాడు మోసపోడు" అని రేవంత్ అనడం ఎంత బాధాకరం? అంటే రెడ్డి కాని చంద్రబాబుని నమ్మొద్దని చెప్పినట్టుగా అర్ధమైతే కమ్మవారికి ఎలా ఉంటుంది?

అలాగే ఆంధ్రాలో మునిగిపోతున్న తమ పార్టీని తన వర్గబలంతో పైకి లేపుతాడని పవన్ ని నమ్ముకున్న కమ్మవారు కూకట్పల్లిలో గ్లాసుని గెలిపించుకోగలరా? వాళ్లకిది ఎదురుగా కనిపిస్తున్న పెద్ద టాస్క్.

ఆఖరికి తెలంగాణాలో కాంగ్రెస్ గెలిచి రేవంత్ రెడ్డి సీయం అయినా, "రెడ్డి" ఫీలింగుతో జగన్ మోహన్ రెడ్డితో స్నేహం చేసే సూచనలే కనిపిస్తున్నాయి తప్ప చంద్రబాబు ఆలోచనల పరంగా రేవంత్ నడుచుకునే పరిస్థితులేవీ కనిపించడం లేదు.

ఎలా చూసుకున్నా చంద్రబాబుకి ఎవరి వల్ల ఏమి ఉపయోగమో, ఏమి నష్టమో అర్ధం కాక తలపట్టుకునే పరిస్థితి ఉందిప్పుడు.

డిసెంబర్లో తెలంగాణా ఎన్నికల ఫలితాలు, రానున్న మూడు నెలల్లో ఆంధ్ర రాజకీయ సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలి. ఆంధ్ర ఎన్నికలు దగ్గర పడ్డాక అయినా చంద్రబాబుకి కాలం కలిస్తొస్తుందో లేదో వేచి చూడాలి. 

- హరగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?