భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం మీద కంటె రాష్ట్రవ్యాప్తంగా మరింతగా బలోపేతం కావడం మీదనే ఎక్కువగా దృష్టి పెడుతోంది. వారికి వచ్చే ఏడాదిలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలు కీలకం. అప్పటిలోగా మరిన్ని స్థానాల్లో పార్టీని బలోపేతం చేసుకోవడం ముఖ్యం.
మరిన్ని సీట్లు లోక్ సభకు సాధించడం వారి టార్గెట్. గెలుపు కష్టం అని తెలిసినప్పటికీ కూడా.. తాము రాష్ట్రవ్యాప్తంగా 111 స్థానాల్లో పోటీచేస్తూ.. జనసేనకు కేవలం 8సీట్లు ఇవ్వడంలోని మర్మం కూడా అదేననే అభిప్రాయాలున్నాయి.
అయితే భాజపా వారి లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎవరి మీద ఎక్కువగా డిపెండ్ అవుతోంది, ఎవరికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోంది? ఈ కోణంలోంచి పోల్చి చూసినప్పుడు.. జనసేనాని పవన్ కల్యాణ్ కంటె.. ఎమ్మార్పీస్ అధినేత మందకృష్ణ మాదిగకే భాజపా ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఎస్సీల్లో వర్గీకరణ చేసి తీరుతామని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన నేపథ్యంలో, అందుకోసం కొన్ని దశాబ్దాల నుంచి పోరాడుతున్న మందకృష్ణ మాదిగ బిజెపికి అనుకూలంగా గళమెత్తారు.
వర్గీకరణకు ఓకే చెప్పిన బిజెపికి ఓటు వేయాలని ఆయన రాష్ట్రవ్యాప్తంగా మాదిగలకు పిలుపు ఇస్తున్నారు. ఇప్పుడు బిజెపి మందకృష్ణ ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేస్తోంది.
తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 28వ తేదీవరకు మంద కృష్ణ సుడిగాలి పర్యటనలు నిర్వహించాలని ఆరాటపడుతోంది. ఆయనతో పాటు ఇతర కీలక ఎమ్మార్పీఎస్ నేతలందరూ కూడా బిజెపి అనుకూల ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనబోతున్నారు. వారికి అవసరమైన ఏర్పాట్లను కూడా బిజెపి చేస్తోంది.
ప్రస్తుతం భాజపా తరఫున పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఈటల రాజేందర్ లకు పార్టీ హెలికాప్టర్ లను సమకూర్చింది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కోసం మరో హెలికాప్టర్ వాడుతున్నారు. వీటికి అదనంగా మందకృష్ణ మాదిగకు కూడా హెలికాప్టర్ ఏర్పాటు చేస్తున్నారు.
అదే సమయంలటో.. పవన కల్యాణ్ మీద ఎంతగా ఆధారపడుతున్నదో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పవన్ కళ్యాణ్. భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలతో కలిసి పాల్గొనే సమావేశాలు కాకుండా. కేవలం. మూడు నియోజకవర్గాల్లో మాత్రమే. ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి ఆయన ఒకే నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి సిద్ధపడ్డారు.
భారతీయ జనతా పార్టీ నుంచి ఫిరాయించి జనసేనలో చేరిన. కూకట్పల్లి అభ్యర్థి ప్రేమ్‌కుమార్ కోసం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని మాత్రమే పార్టీ తొలుత ప్రకటించింది. తర్వాత పార్టీ నాయకులు ఆయనతో ఏ మంతనాలు సాగించారో తెలియదు గానీ.. ఇప్పుడు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయబోతున్నారు.
వరంగల్, తాండూరు, కూకట్ పల్లిల్లో ప్రచారం చేయబోతున్నారు. ఇందుకోసం మూడు రోజులు కేటాయిస్తున్నారు. నిజానికి పవన్ కల్యాణ్ కు ఉండే చరిష్మాను వాడుకుంటూ.. ఆయన మూడే రోజుల సమయం ఇచ్చినా హెలికాప్టర్ ఏర్పాటుచేసి.. మరిన్ని నియోజకవర్గాల్లో తిప్పితే బాగుండేదని పార్టీ వర్గాల అభిప్రాయం.
ఈ పోకడను గమనించినప్పుడే తమ పార్టీ పవన్ కంటె.. మందకృష్ణ మీదనే ఎక్కువ ఆధారపడుతున్నదని, అందుకే ఆయనకు హెలికాప్టర్ కూడా పెట్టిందని వారు అంటున్నారు.