తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై ఇన్‌కమ్ ట్యాక్స్ (ఐటీ) వేట కొనసాగుతోంది. పాలేరు బరిలో నిలిచిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్ వేసే రోజే ఐటీ అధికారులు సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. పొంగులేటి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేసి, కొన్ని డాక్యుమెంట్స్‌ను తీసుకెళ్లారు. తెలంగాణలో కాంగ్రెస్ ఊపు మీద ఉండడంతో, ఆ పార్టీ అభ్యర్థులను భయపెట్టేందుకే మోదీ సర్కార్ ఇలా చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి.
తాజాగా మంచిర్యాలలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేయడం చర్చనీయాంశమైంది. వివేక్ సూట్‌కేస్ కంపెనీలు పెట్టి భారీ మొత్తంలో డబ్బులు చెలామణి చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఒక సూట్‌కేస్ కంపెనీకి రూ.8 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సూట్‌కేస్ కంపెనీల్లో ఇద్దరు డైరెక్టర్లు వివేక్ కంపెనీల్లోని ఉద్యోగులని ఐటీ, ఈడీ అధికారులకు బీఆర్ఎస్ నేత ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు చెన్నూరులో వివేక్ నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. వివేక్, ఆయన సోదరుడు వినోద్ నివాసాలతో పాటు బంధువుల ఇళ్లలోనూ రైడ్ జరుగుతోంది. ఎన్నికల వేళ కేవలం కాంగ్రెస్ అభ్యర్థులపై ఐటీ సోదాలు చేయడం ద్వారా బీఆర్ఎస్, బీజేపీ మధ్య అవగాహన ఉందనే ప్రచారం నిజమవుతోందనే చర్చ నడుస్తోంది. ఈ ధోరణి బీఆర్ఎస్, బీజేపీ నేతలకు నష్టం కలిగిస్తోందనే ప్రచారం జరుగుతోంది.