కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకు గవర్నర్ల వ్యవస్థను వాడుకుంటోందనే అపప్రద కొనసాగుతూ ఉంది. తాజాగా ఇలాంటి వ్యవహారమే సుప్రీం కోర్టు వరకూ వెళ్లి.. సదరు గవర్నర్లకు నోటీసులు జారీ కావడం వరకూ వెళ్లడం గమనార్హం! తమిళనాడు గవర్నర్ బిల్లులను పెండింగ్ పెడుతున్నాడనే అంశంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా, అచ్చం ఇలాంటి వ్యవహారంలో కేరళ గవర్నర్ కు సుప్రీం కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది!
తమ రాష్ట్ర గవర్నర్ లు శాసనసభ ఆమోదించిన బిల్లులపై సంతకాలు పెట్టకుండా ఆపుతూ పెండింగ్ లో పెడుతున్నారంటూ తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు సుప్రీంలో వేర్వురుగా కేసులు దాఖలు చేశాయి! రాష్ట్ర ప్రభుత్వానికి సాంకేతికంగా అధినేతగా గవర్నర్ పేరునే పేర్కొంటారు ఇండియాలో. అలాంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ పై సుప్రీం కోర్టు వరకూ వెళ్లే పరిస్థితి రావడం దయనీయం!
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్యన ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూ ఉంది. తమిళనాడు అసెంబ్లీ సాక్షిగానే ఈ రచ్చ బట్టబయలైంది! ఇలాంటి నేపథ్యంలో రవి తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులపై సంతకాలు పెట్టకుండా పెండింగ్ లో పెట్టాడనే అంశంపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. మూడేళ్లుగా వివిధ బిల్లులకు ఆమోదం లేకుండా పోయిందని కేసు వేసింది! ఈ అంశంపై గవర్నర్ తరఫున వాదనల్లో.. అలాంటిదేమీ లేదనే వాదన వినిపించారట! రవి బాధ్యతలు తీసుకుని రెండేళ్లే అయ్యిందని, ఏదో ఒకటో రెండో పెండింగ్ లో ఉండవచ్చన్నారట! అయితే బిల్లులను పెండింగ్ లో పెట్టడంపై గవర్నర్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందనే వార్తలు ఆసక్తిదాయంగా ఉన్నాయి.
ఇక కేరళ ప్రభుత్వానికి చుక్కలు చూపుతున్న గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్ కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తమ రాష్ట్ర గవర్నర్ తను ప్రభుత్వానికి అతీతుడినన్నట్టుగా వ్యవహరిస్తున్నాడంటూ పినరాయి విజయన్ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో.. ఈ అంశంపై కేరళ గవర్నర్ కు, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం గమనార్హం!
కాంగ్రెస్ హయాంలోనే ఒకటీ రెండు చోట్ల గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి పోరాటాలు సాగాయి. ప్రత్యేకించి అప్పట్లో కర్ణాటకలో హెచ్ఆర్ భరద్వాజ్ వర్సెస్ యడియూరప్ప తరహాలో పోరాటం సాగింది. అది కూడా కేసుల విషయాలు, లోకాయుక్త, అరెస్టులకు అనుమతి ఇవ్వడాలు వంటివే! అయితే ఆ మధ్య లెఫ్టినెంట్ గవర్నర్ ల విషయంలో రచ్చ జరిగింది ఢిల్లీలో. కిరణ్ బేడీ వర్సెస్ కేజ్రీవాల్ పోరాటం సాగింది. ఇప్పుడు తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు గవర్నర్లపై కోర్టులకు వెళ్లే వరకూ వ్యవహారం రావడం గమనార్హం!