తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ్టి కార్యక్రమం రద్దైంది. ఈ విషయాన్ని వైసీపీ నేతలు తెలిపారు. బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రభావంతో తమిళనాడులో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న సూళ్లూరుపేట నియోజకవర్గంపై కూడా తుపాను ప్రభావం పడింది. ముఖ్యంగా చెన్నైకి తడ అతి సమీపంలో వుంటుంది.
ఈ నేపథ్యంలో సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తడ మండలం మాంబట్టు గ్రామం వద్ద నిర్వహించతలపెట్టిన సీఎం కార్యక్రమానికి తుపాను అడ్డంకిగా మారింది. మత్స్యకారులకు బటన్ నొక్కి సాయం అందించడంతో పాటు వాకాడు మండలం రాయదరువు వద్ద షిఫ్ ల్యాండింగ్ సెంటర్‌కు, అలాగే పులికాట్ సరస్సు వద్ద సముద్ర ముఖ ద్వారం పనులకు శంకుస్థాపన, ఇతరత్రా సాయం సీఎం చేతుల మీదుగా తలపెట్టారు.
సోమవారం నుంచి తమిళనాడు సమీపంలోని తిరుపతి జిల్లాపై తుపాను ప్రభావం కనిపిస్తోంది. తుపాను ప్రభావంతో నల్లటి మబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి. చెన్నైకి సమీపంలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలో వర్షం బాగా పడుతోంది. దీంతో సీఎం పర్యటనపై మబ్బులు కమ్ముకున్నాయి.
ఎంతకూ వర్షం తగ్గకపోవడం, విమానాయన అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో సీఎం పర్యటన రద్దు అయినట్టు ప్రాథమికంగా తెలిసొచ్చింది. పూర్తి వివరాలు వెల్లడించాల్సి వుంది.