ఢిల్లీ వెళ్లి భాజపా పెద్దలతో పలుదఫాల మంతనాలు సాగించిన, ఏపీలో జగన్ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వబోనని అనేక ప్రతిజ్ఞలు చేసిన పవన్ కల్యాణ్ కు క్లారిటీ ఉన్నదో లేదో గానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పల్లకీ మోయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు.
అందుకోసం పవన్ కల్యాణ్ తో కలిసి భుజం పంచుకోడానికి వారు రెడీగా లేరు. ఈ విషయంలో పార్టీ కీలక నాయకుడు బీఎల్ సంతోష్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. అంతేకాదు.. పొత్తుల గురించి రాష్ట్రనాయకులు ఎవరు పడితే వారు మాట్లాడడం కూడా తగదని పరోక్ష హెచ్చరిక కూడా జారీచేశారు.
జనసేనతో కలిసి పొత్తులతోనే ఎన్నికల్లో పోటీచేస్తామని కొన్ని రోజుల కిందట రాష్ట్ర పార్టీ సారథి దగ్గుబాటి పురందేశ్వరి ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. దాంతో ఆ పార్టీలోనే నాయకులకు అనేక సందేహాలు మొదలయ్యాయి. తాము తిరిగి చంద్రబాబు విజయం కోసం పనిచేయాలా? అనే మీమాంస కూడా తయారైంది. ఈ నేపథ్యంలో ఒంగోలులో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం చాలా కీలకంగా మారింది.
ఈ సమావేశంలో జాతీయ పార్టీ సంఘటన కార్యదర్శి బిఎల్ సంతోష్ క్లారిటీ ఇచ్చారు. పొత్తుల విషయం అధిష్ఠానం మాత్రమే నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఎవరికి తోచినట్లుగా వారు నోరు చేసుకోవద్దని హెచ్చరించినట్లు అయింది.
దానికి తోడు.. బీఎల్ సంతోష్ మాట్లాడుతూ.. రెండు ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లు సాధించడం తమ లక్ష్యం కానే కాదని, అధికారంలోకి రావాలనే కోరిక బలంగా ఉండాలని కూడా అన్నారు. ఈ మాటలు చాలా స్పష్టంగా పొత్తులకు నో అంటున్నట్టుగానే ఉన్నాయి.
పొత్తులు పెట్టుకుంటే ఆ మాత్రం సీట్లు దక్కుతాయి తప్ప.. పార్టీ రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం కావడం అనేది జరగదు. అందుకే సంతోష్ పొత్తుల ఆలోచనను తోసిరాజంటున్నట్టుగా కనిపిస్తోంది.
పైగా ఇప్పుడున్న ఏపీ రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని.. బలంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో విరోధం కొని తెచ్చుకోవాల్సిన అవసరం భాజపా కేంద్ర నాయకత్వానికి లేదు. పార్లమెంటులో కీలక బిల్లుల సమయంలో అవసరం వచ్చినప్పుడు జగన్ తమ సహకారాన్ని బిజెపి సర్కారుకు అందిస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు.. బలవంతుడైన,ప్రజాదరణ కలిగి ఉన్న జగన్ తో సున్నం పెట్టుకోవడం.. అదికూడా చంద్రబాబునాయుడును సీఎంచేయడంకోసం అలాంటి సాహసం చేయడం వివేకం లేని పని అని భాజపా గుర్తించినట్లుగా కనిపిస్తోంది.
సంతోష్ మాటలతో బిజెపిని కూడా తెదేపా జట్టులోకి తీసుకురాగలమన్న ఆలోచనలకు స్వస్తి పలికినట్టే. పవన్ కల్యాణ్ కూడా, వ్యతిరే ఓటు చీలనివ్వను లాంటి, ప్రగల్భాలు మాని ఇక తన దారి తాను చూసుకోవడం మంచిదనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది.