ఈ కష్టం అక్కడ పడితే.. కాస్త లేవగలరేమో!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న వచ్చినప్పుడు.. దాన్ని గురించి మాట్లాడుకోవడం ఎందుకు? అనే ప్రశ్నే సమాధానంగా వస్తుంది. ఆ పార్టీకి అక్కడ కమిటీ, కార్యవర్గం ఉన్నాయి తప్ప.. పార్టీగా…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న వచ్చినప్పుడు.. దాన్ని గురించి మాట్లాడుకోవడం ఎందుకు? అనే ప్రశ్నే సమాధానంగా వస్తుంది. ఆ పార్టీకి అక్కడ కమిటీ, కార్యవర్గం ఉన్నాయి తప్ప.. పార్టీగా అస్తిత్వం మాత్రం లేదు. అప్పుడప్పుడూ ప్రెస్ మీట్లు పెడుతుంటారు తప్ప.. ప్రజల్లో పార్టీగా వారు మనుగడను కొనసాగిస్తున్నట్టు లేదు. 

కానీ.. అదే ఏపీ కాంగ్రెసు పార్టీ నాయకులు ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడి పార్టీ నాయకులను గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంట గెలవలేనివారు.. రచ్చ గెలిచే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ వ్యవహారం కనిపిస్తోంది.

ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తన జట్టునందరినీ వేసుకుని తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క పోటీచేస్తున్న మధిర నియోజకవర్గంలో వీళ్లంతా ఆయనతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భట్టి గెలుపు అనేది తెలంగాణకు చాలా అవసరం అంటూ రుద్రరాజు అండ్ కో అక్కడ ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు ఏపీసీసీ నాయకులు సుంకర పద్మశ్రీ తదితరులు కూడా పాల్గొన్నారు.

అయితే ఇక్కడ ప్రధానంగా ఒక్క విషయం గమనించాల్సి ఉంది. ఏపీ కాంగ్రెసు నాయకులు తమ సొంత రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేయడానికి లేదా, పార్టీకి జవజీవాలు తీసుకురావడానికి ఈ మాత్రం కష్టం పడుతున్నారా? ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి గనుక, పొరుగు రాష్ట్ర నాయకులుగా, ఇక్కడ ఖమ్మం వంటి సరిహద్దు జిల్లాల్లో ప్రభావం చూపగలరు గనుక.. ప్రచారానికి రావడం మంచిదే. కానీ.. సొంత రాష్ట్రంలో ఆల్రెడీ శవాసనం వేసిన పార్టీని మళ్లీ లేపి నిలబెట్టాలనే కోరిక వీరికి ఉన్నదా లేదా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది.

పాత సారథి శైలాజానాధ్ ను తప్పించి.. గిడుగు రుద్రరాజు చేతిలో ఏపీసీసీ పగ్గాలను పెట్టారు. ఆ తర్వాత పార్టీ బాగు కోసం ఆయన క్రియాశీలంగా ఏం చేశారు? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి, కాంగ్రెసు పార్టీ అనేది బతికే ఉన్నదని ఏపీ ప్రజలను నమ్మించడానికి ఆయన ఏం ప్రయత్నించారు? అనేది మాత్రం సందేహమే. 

ఎందుకంటే.. ఎలాంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టకుండా, ప్రజాందోళనల జోలికి వెళ్లకుండా కాంగ్రెసు అక్కడ నీరుగారిపోతోంది. కనీసం పార్టీకి బలం ఉంటుందని వారు భావించే ఒకటి రెండు నియోజకవర్గాలమీదనైనా ఫోకస్ పెంచి.. అసెంబ్లీ ఎన్నికలనాటికి ఒకటిరెండు సీట్లయినా గెలిచేస్థాయికి పార్టీ ని తీసుకువెళ్లడం గురించి వారు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా లేదు. 

సొంత రాష్ట్రంలో పార్టీకోసం పనిచేయకుండా.. తగుదునమ్మా అంటూ పొరుగు రాష్ట్రాల్లో ప్రచారాలు వారి పరువు తీస్తాయని తెలుసుకోవడం లేదు.