విశాఖ రుషికొండ వద్ద జరుగుతున్న నిర్మాణాల మీద పడి ఏడవడంలో అందరికంటె జనసేన ముందు వరుసలో ఉంటోంది. ముఖ్యమంత్రి జగన్ నివాసం కోసమే ఈ భవనాలను నిర్మిస్తున్నారని, అత్యంత విలాసవంతంగా నిర్మిస్తున్న భవనాలకు భారీగా ఖర్చు పెడుతున్నారని జనసేన అంటోంది. అయితే జనసేన చేస్తున్న విమర్శల్లో విచక్షణ లోపిస్తోందని ప్రజలు అంటున్నారు.
ఎందుకంటే.. విశాఖ రుషికొండ వద్ద నిర్మిస్తున్న భవనాలు ఏపీ టూరిజం శాఖకు చెందినవి. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే.. అది పూర్తిగా టూరిజం భవనాల మీద పెడుతున్న ఖర్చు మాత్రమే. ఆ ఖర్చును జగన్ తన సొంత ఇంటికోసం వాడుకోవడం లేదు.
తెలుగుదేశం -జనసేన కూటమి కలగంటున్నట్టుగా, ప్రతిన బూనినట్టుగా జగన్ ప్రభుత్వం ఓడిపోతే గనుక.. రుషికొండ భవనాలను వారికి నచ్చినట్టుగా ఉపయోగించుకోవచ్చు. టూరిజం శాఖ విలాసవంతమైన అతిథిభవనాలుగానే ఉంచవచ్చు. వారిని ఎవ్వరూ కాదనరు. కానీ.. ఆ భవనాలకు పెడుతున్న ఖర్చును జగన్మోహన్ రెడ్డి ఖాతాలో అవినీతికింద పరిగణిస్తూ ప్రచారం చేయడం మాత్రం చవకబారుగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.
2014 తర్వాత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తర్వాత.. సీఎం కార్యాలయాన్ని మొత్తం విజయవాడ తరలించుకుని తీసుకెళ్లిపోయారు. కానీ…ఈలోగా అక్కడ తాను ఉండనని తెలిసినప్పటికీ సెక్రటేరియేట్ భవనాలలో రిపేర్ల మీద కోట్లాది రూపాయలు అచ్చంగా వృథా చేశారు. అలాగే హైదరాబాదు జూబ్లీహిల్స్ లో సొంత ఇల్లు నిర్మించుకున్న చంద్రబాబునాయుడు ఆ ఇంటిని కూడా ఏపీసీఎం యొక్క అధికారిక నివాసంగా ప్రకటించి, జీవో ఇచ్చి, ఆ ఇంటి నిర్వహణ, రిపేర్లు తదితర పనుల కోసం కోట్లకు కోట్ల రూపాయలను ఖర్చు చేయించారు. ఇదంతా ప్రజా ధనాన్ని తన సొంత ఇంటికోసం వాడుకోవడం మాత్రమే.
కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయడం లేదు. ఒకవేళ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఆయన రుషికొండ భవనాల్లో నివాసం ప్రారంభించారనే అనుకుందాం. కానీ అది ఆయన సొంత ఇల్లు కాదు. అక్కడ ఫర్నిచర్ ఆయన సొంత ఫర్నిచర్ కాబోదు. అది ముఖ్యమంత్రి నివాసంగా పరిగణనలో ఉంటుందే తప్ప.. జగన్ ఇల్లుగా కాదు.
ఒకవేళ జనసేన కలలు ఫలించి.. జగన్ పదవీచ్యుతుడు అయితే.. ఆయన మొత్తం దులుపుకుని ఆ ఇంటిని వదలి వెళ్లిపోతారు. కోడెల శివప్రసాద్ లాగా ప్రభుత్వం సమకూర్చిన ఫర్నిచర్ మొత్తం తన సొంత ఇంటికి తరలించుకుని వెళ్లడం కూడా జరగదు. అలా జరిగితే అప్పుడు జగన్ ను తప్పుపట్టాలి.
అంతే తప్ప.. ప్రభుత్వ భవనానికి, టూరిజం వారి అతిథిభవనాలకు పెడుతున్న ఖర్చును జగన్ అవినీతిలాగా ప్రొజెక్టు చేస్తూ మాట్లాడడం లేకిగా ఉంది. క్యాంప్ ఆఫీస్ అనే ముసుగులో చంద్రబాబు తన సొంత ఇంటికి పెట్టుకున్న ఖర్చుల గురించి అడగలేని జనసేన, ఇప్పుడు ప్రభుత్వ భవనానికి పెడుతున్న ఖర్చు పై విలపించడం చోద్యంగా ఉంది.