అమిత్ షా: పలాయన వాద హామీలు!

తాము గెలుస్తామనే నమ్మకం చాలా తక్కువగా ఉన్న పార్టీ.. ఎంత పెద్ద హామీలనైనా సునాయాసంగా ప్రకటించేస్తుంది. ఆకాశం నుంచి చంద్రుడిని తీసుకువచ్చి మీ చేతిలో పెట్టేస్తాం అని చెబుతుంది. భూతలాన్ని స్వర్గంగా మార్చేస్తామని కూడా…

తాము గెలుస్తామనే నమ్మకం చాలా తక్కువగా ఉన్న పార్టీ.. ఎంత పెద్ద హామీలనైనా సునాయాసంగా ప్రకటించేస్తుంది. ఆకాశం నుంచి చంద్రుడిని తీసుకువచ్చి మీ చేతిలో పెట్టేస్తాం అని చెబుతుంది. భూతలాన్ని స్వర్గంగా మార్చేస్తామని కూడా అంటుంది. వాటిని ఎలా అమలు చేస్తామా? అనే దిగులు వారికి ఉండదు. 

ఇప్పుడు భారతీయ జనతా పార్టీ  కూడా తెలంగాణ ఎన్నికల బరిలో అలాంటి హామీలనే ఇస్తోంది. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే గనుక.. పదేళ్లపాటు కేసీఆర్ ప్రభుత్వం సాగించిన దోపిడీ, అవినీతి, అక్రమాల పర్వంపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం అని ఎన్నికల ప్రచార సభల్లో అమిత్ షా వాగ్దానాలు చేస్తున్నారు.

కాళేశ్వరం, మిషన్ భగీరథ, ఓఆర్ఆర్, మియాపూర్ భూములు, పాస్ పోర్టులు, గ్రానైట్ కుంభకోణాలపై రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విచారణ చేసి అవినీతి పరులపై చర్యలు తీసుకుంటామని ఆయన అంటున్నారు.

నిజానికి ఈ అంశాల్లో భారీగా వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కేంద్రం చొరవ తీసుకుని దర్యాప్తు చేయిస్తే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని.. కేసీఆర్ వ్యతిరేక పక్షాలు సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇన్నేళ్లుగా ఆ డిమాండ్ వినిపిస్తున్నా కేంద్రంలోని భాజపా సర్కారు తమకేమీ పట్టనట్టుగానే వ్యవహరిస్తూ వస్తోంది. 

ఇప్పుడు తీరా ఎన్నికలు వచ్చేసరికి.. కేసీఆర్ అవినీతిపై విచారణ సాగించాలంటే.. తమ పార్టీకి అధికారం కట్టబెట్టాలనే అసాధ్యమైన నిబంధన విధిస్తోంది. అంటే అలా చెప్పడం ద్వారా.. రాష్ట్రంలో భాజపాకు అధికారం దక్కేది లేదు గనుక.. తాము ఎప్పటికీ కేసీఆర్ అవినీతి మీద విచారణ జరిపేది కూడా ఉండదని సంకేతాలు ఇస్తోంది.

సూటిగా చెప్పాలంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిన అవినీతి వ్యవహారాలపై దర్యాప్తు చేయాలంటే.. ఆ రాష్ట్రంలో మరొక పార్టీ అధికారంలోకి వచ్చి తీరాలనే నిబంధన ఏమాత్రమూ లేదు. కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే.. స్వచ్ఛమైన దర్యాప్తు కేంద్ర సంస్థల ద్వారా చేయించవచ్చు. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నది కూడా అదే. 

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సాక్షాత్తూ మంత్రి కూడా కటకటాల్లో ఉన్నారు. అదే లిక్కర్ కుంభకోణంలో కీలకపాత్ర ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవిత మాత్రం.. ఎంచక్కా ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. ఆమె మీద కేసు బిగుసుకోకుండా చూడడమే.. కేసీఆర్ కుటుంబానికి బిజెపి లోపాయికారీగా చేసిన మేలు అనే ఆరోపణలు ఉన్నాయి. 

ఇప్పుడు వీళ్లకు అధికారం అప్పగించినంత మాత్రాన కేసీఆర్ కుటుంబ అవినీతి మీద ఏం దర్యాప్తు చేయబోతారనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. ఉత్తినే మాటలు చెబితే సరిపోదని, తెలంగాణ ప్రజలైనా సరే.. తమను నమ్మాలంటే చేతల్లో కూడా కాస్త చూపించాలని అమిత్ షా తెలుసుకోవాలి.