నరేంద్రమోడీ నాయకత్వం రాజ్యం చేయడం ప్రారంభించిన తర్వాత.. భారతీయ జనతా పార్టీ కూడా అచ్చంగా కాంగ్రెస్ శైలిలో వ్యక్తిపూజకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోంది. నరేంద్రమోడీని కీర్తించడంలోనే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ తమ తమ జీవితాలను తరింపజేసుకుంటున్నారు.
ఎక్కడ అడుగుపెట్టినా మోడీ భజనే, ఎక్కడ మాట్లాడినా మోడీ స్తోత్రాలే. మోడీ హవా సాగుతున్నంత కాలం.. అది వారు తమ మనుగడ కోసం చేస్తున్న పోరాటం అని అనుకోవచ్చు. కానీ ఆ క్రమంలో వారు వాస్తవాల్ని గుర్తించకపోతే మాత్రం.. పార్టీకే చేటు చేసిన వారు అవుతారు. ఏపీలో ప్రస్తుతం అదే జరుగుతోంది.
ఒంగోలులో తాజాగా రాష్ట్రా బిజెపి కార్యవర్గ సమావేశం జరిగింది. భాజపా సంఘటన్ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీఎల్ సంతోష్ అంటే.. పార్టీలో అత్యంత కీలకంగా చక్రం తిప్పే ప్రముఖుల్లో ఒకరు అన్న సంగతి అందరికీ తెలిసిందే.
ఆయన మాట్లాడుతూ.. మోడీ ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకునేవారు ఏపీలో 25 నుంచి 30 శాతం మంది వరకు ఉన్నారని అన్నారు. అయితే వారంతా కూడా బిజెపికి ఓట్లు వేసేందుకు సంకోచిస్తున్నారని, వారిలో మార్పు రావడానికి కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. రెండు ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లు సాధించడం కానే కాదని.. అధికారంలోకి రావాలన్న బలమైన కోరికతో పనిచేయాలని పార్టీకి పిలుపు ఇచ్చారు.
మోడీ ప్రధానిగా ఉండాలని 30 శాతం ప్రజలు కోరుకుంటున్నారనే పరిశీలన బాగానే ఉంది. కానీ ఎందుకు ఏపీ ప్రజలు ఓట్లు వేయడంలేదో వాస్తవాన్ని పట్టించుకోకపోతే ఎలాగ? ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్రమోడీ సర్కారుచేసిన ద్రోహాన్ని ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు.
అయిదేళ్లు అనుకున్న ప్రత్యేకహోదాను పదేళ్లపాటు ఉండేలా ఇస్తాం అని ప్రగల్భాలు పలికి, వెంకన్న సాక్షిగా ప్రతిజ్ఞలు చేసి ఏ స్థాయిలో తెలుగు ప్రజలను వంచించారో అందరికీ గుర్తుంది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే.. స్వయం సమృద్ధిని సాధించాలంటే.. ప్రత్యేకహోదా తప్ప మరొక ఆప్షన్ లేనేలేదని ప్రజలకు తెలుసు. ఆ విషయంలో మోసం చేయడం ద్వారా.. ఏపీ అభివృద్ధికి మోడీ శాశ్వత సమాధి కట్టేశారని ప్రజలు నమ్ముతున్నారు. అందుకే ఓట్లు వేయడం లేదు.
ఈ వాస్తవాన్ని కమల మేధావి బీఎల్ సంతోష్ గుర్తించకుండా.. మోడీ అంటే ప్రేమ ఉన్నా కూడా ప్రజలు ఓట్లు వేయడానికి మొహమాటపడుతున్నట్టుగా మాట్లాడడం తమాషాగా ఉంది. ఇలాంటి తప్పుడు అంచనాలతో పార్టీని ముందుకు నడిపే ప్రయత్నం చేస్తే పార్టీకి చేటు జరుగుతుందే తప్ప లాభం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.