ఫైనల్ మ్యాచ్: వైకాపా వర్సెస్ తెదేపా

ప్రపంచ కప్ క్రికెట్ ముగిసింది. మొదటి నుంచీ ఒక్క ఓటమి కూడా చవిచూడని భారత్ ఫైనల్స్ లో ఎలా ఓడిందో చూసాం. ఎందుకు ఓడిందో కూడా కళ్లకు కట్టినట్టు కనపడింది. సెమీ ఫైనల్స్ వరకు…

ప్రపంచ కప్ క్రికెట్ ముగిసింది. మొదటి నుంచీ ఒక్క ఓటమి కూడా చవిచూడని భారత్ ఫైనల్స్ లో ఎలా ఓడిందో చూసాం. ఎందుకు ఓడిందో కూడా కళ్లకు కట్టినట్టు కనపడింది. సెమీ ఫైనల్స్ వరకు ఉన్న దీక్ష, కసి, పట్టుదల, ధైర్యం, నైపుణ్యం.. ఫైనల్ మ్యాచులో కనపడకపోవడం ఆశ్చర్యం. ఎవరు ఏమన్నా ప్లానింగ్ నుంచి అనేకమైన ఇతర కారణాలు భారత్ ఓటమికి కారణమయ్యాయి. లక్షన్నర మంది జనమున్న స్టేడియంలో ఏ మాత్రం డైవెర్ట్ కాకుండా ఆస్ట్రేలియా క్రీడాకారులు దీక్ష, పట్టుదల, ఏకాగ్రతలతో ఆడారు. అందుకే విజయం వారి పక్కకు పోయింది. 

ఇక్కడ చెప్పుకునేది ఒక్కటే. అంతిమవిజయానికి ట్రాక్ రికార్డుతో సంబంధం లేదు. ఇది రాజకీయాలకి కూడా వర్తిస్తుంది. 

వైకాపా గత నాలుగున్నరేళ్లలో ఎన్నో గొప్ప పనులు చేసామని అనుకోవచ్చు. స్కీములందుకున్న ప్రజలంతా తమ పక్షానే ఉన్నారని గట్టిగా నమ్మొచ్చు. కానీ ఆ నమ్మకంతో ఆదమరిచి ఉంటే మాత్రం ప్రమాదమే. ఇంకో మూడు-నాలుగు నెలల్లో ఎన్నికలు. అంటే ఇది ఆల్మోస్ట్ ఫైనల్ మ్యాచ్ లాంటిది. 

ఆఫ్ఘనిస్తాన్ తో కూడా అతికష్టం మీద గెలిచిన ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాని కూడా ఆపసోపాలు పడుతూ ఓడించిన ఆస్ట్రేలియా…జగజ్జేత అయిన భారత్ ని ఓడించేసింది. 

అదే విధంగా చతికిలపడి ఉంది అనుకున్న తెదేపాకి సరైన మార్గంలో నడిస్తే కాలం కలిసిరావొచ్చు. ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేన పార్టీ తమకి మద్దతిచ్చి పైకి లేపాల్సిన దుస్థితిలో తెదేపా ఉంది కదా అని వెక్కిరిస్తూ కూర్చునే సమయం కాదిది వైకాపాకి. తాబేలు-కుందేలు కథని ఒకసారి గుర్తు చేసుకోవాలి. దీక్ష, పట్టుదల వదలకపోవడం వల్ల తాబేలే గెలిచింది. ఆదమరిచి ధీమాగా ఉండడం వల్ల కుందేలు ఓడింది. 

అందుకే ఈ చివరి మూడు-నాలుగు నెలల్లో ఎవరు ఆటని గట్టిగా ఆడతారో వారిదే విజయం. అది వైకాపా అయినా, తెదేపా అయినా. 

అయితే ఆ ఆడే విధానం ఏవిటి? ఎలా ఉండాలి? ఏం చేస్తే టెబుల్స్ టర్న్ అవ్వొచ్చు అనేది ఆయా నాయకులే ఆలోచించుకోవాలి. 

అందరూ అనుకుంటున్నట్టు సింపతీలు, అభియోగాలు పని చెయ్యవు. వాటికి భిన్నంగా ఆలోచించి జనాన్ని తమ వైపుకు తిప్పుకోగలగాలి. 

నాలుగన్నరేళ్లు ఏం చేసామన్నదానిపై కంటే ఈ మూడున్నర నెలల్లో జనం పొందే లబ్ధి, భరోసా, ధైర్యం, నమ్మకం చాలా కీలకం వైకాపాకి. 

అలాగే గత నాలుగున్నర ఏళ్లల్లో ఎలా చతికిలపడి కూర్చుందో అన్నదానికంటే ఈ మూడున్నర నెలల్లో జనానికి ఎంత దగ్గరయ్యింది అనేది చాలా ముఖ్యం తెదేపాకి. 

తెలంగాణాలో పరిస్థితి చూస్తున్నాం. అసలు కాంగ్రెస్ పార్టీకి నిలబెట్టడానికి అభ్యర్థులే దొరకరు అని అనుకునే పరిస్థితి ఉండేది ఆరేడు నెలల క్రితం వరకు. అలాంటిది ఇప్పుడు సీన్ ఎలా మారిందో చూస్తున్నాం కదా. 

దీనికి కారణం ప్రధానంగా బీఆరెస్ అలసత్వమే. కాంగ్రెస్ వస్తే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పే విజువల్ యాడ్స్ లేవు బీఆరెస్ కి…కేవలం న్యూస్ పేపర్ యాడ్స్ కే పరిమితం చేసారు ఈ ముఖ్యమైన టాపిక్ ని.  ఎంతసేపూ కేసీయార్ కి డబ్బా కొట్టే ప్రకటనలు తప్ప. పక్క రాష్ట్రం కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రామిస్ చేసిన పథకాలు ఇవ్వలేక ఎలా చేతులెత్తేసిందో, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో విజువల్ గా చూపాలి కదా! “కాంగ్రెస్ ముక్త్ భారత్” అని 2014లో మోదీ విపరీతమైన పచారం చేసి కదా గద్దెనెక్కింది! తాము వస్తే ఏ గొప్ప జరిగిందో, జరుగుతుందో అన్నదొక్కటి చెప్తే సరిపోతుందనుకుంటే పొరబాటు. ప్రత్యర్ధి అధికారంలోకి వస్తే ఎలాంటి దుస్థితి దాపురిస్తుందో చెప్పుకోగలగాలి. 

అదలా ఉంటే బీఆరెస్-భాజపాలు ఒక గూటి పక్షులే అనే అభిప్రాయం బాగా ప్రబలింది జనాల్లో. దీని వల్ల మైనారిటీ ఓట్లు బీఆరెస్ వైపు నుంచి కదిలి కాంగ్రెస్ వైపుకు చేరాయి. అలాంటి అభిప్రాయాన్ని బలంగా చెప్పి మైనారిటీలని తమ వైపుకి తిప్పుకున్నది కాంగ్రెస్ ప్రచారమే. 

అలా చాప కింద నీరులా పాకి నెమ్మదిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆరెస్ కి గట్టి పోటీ ఇవ్వబోతోంది. సర్వేలు గులాబీ దళాన్ని భయపెడుతున్నాయి. ఎన్నికలు మరీ వారం రోజులకొచ్చేసాయి కాబట్టి ఇక ఇప్పుడు బీఆరెస్ కి సీన్ మార్చే అవకాశమేం లేదు. 

ఇక అటు ఆంధ్రా వైపు చూస్తే అక్కడ కూడా వైకాపాకి, భాజపాకి లోపాయికారి ఒప్పందాలున్నాయని ప్రచారముంది. కానీ దానికి వాడుకోకుండా చంద్రబాబు ఘోరమైన తప్పు చేసాడు. భాజపా అనుగ్రహం కోసం వాళ్ల చుట్టూ తిరుగుతుంటే వైకాపా వైపు ఉన్న మైనారిటీలు తెదేపా వైపుకి ఎందుకు వస్తారు? 

తెలంగాణాలో రేవంత్ రెడ్డికి ఉన్నపాటి తెలివి అక్కడ బాబుకి లేకపోవడం ఆశ్చర్యం. పోనీ రానున్న మూడున్నర నెలల్లో బాజపాతో విపరీతంగా విబేధించి తెలంగాణా కాంగ్రెస్ ఫార్ములానే వాడి వైకాపా-భాజపా ఒకటే అని జనాన్ని నమ్మించి కనీసం మైనారిటీలనైనా తమ వైపుకి తిప్పుకోవచ్చు కదా అనుకుంటే, అక్కడ కూడా ఒక అడ్డంకి ఉంది చంద్రబాబుకి. అదేంటంటే.. తన భార్య సోదరి అయిన పురందేశ్వరి భాజపాలో ఉండి ప్రతి రోజూ జగన్ మోహన్ రెడ్డిని తిడుతూనే ఉంది. పురందేశ్వరి అంటే జనం దృష్టిలో తెదేపా కుటుంబానికి చెందిన భాజపా ఉద్యోగి. కనుక చంద్రబాబు ఎన్ని మతలబులు చేసినా పురందేశ్వరి భాజపాలో ఉన్నంత వరకు మైనారిటీలు బాబువైపు చూడరు. 

ఇలాంటి అవకాశాలు, అడ్డంకులు అనేకముంటాయి. వాటన్నిటినీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్లాలిసిన పరిస్థితి ఇరుపార్టీలకి ఉంది. 

అభ్యర్థుల ఎంపిక నుంచి, ప్రచార సరళి వరకు..ప్రతీదీ ఆచి తూచి జాగ్రత్తగా అడుగేయాలి. ఎక్కడికక్కడ ఇంపాక్ట్ ఎలా ఉందో బేరీజు వెసుకోవాలి. ఈ ఆఖరి మ్యాచ్ ఎవరు బాగా ఆడతారో వారిదే విజయమౌతుంది. ఏ ఒక్కరు ఆదమరిచి ఉన్నా ప్రత్యర్ధికి రాజ్యాధికారాన్ని ఇచ్చేయాల్సి రావొచ్చు. మామూలు భాషలో చెప్పాలంటే ఒళ్లు దగ్గర పెట్టుకుని కష్టపడాల్సిన సమయమిది. 

ఏదైనా తేడా వస్తే అక్కడ క్రికెట్ కప్పు కోసం మళ్లీ నాలుగేళ్లు ఎలా వేచి చూడాల్సొస్తుందో..అలాగే ఇక్కడ అధికారం కోసం మరో ఐదేళ్లు ఆగాల్సిన పరిస్థితి ఉంటుంది. 

శ్రీనివాసమూర్తి