జనసేనాని పవన్‌కల్యాణ్ అజ్ఞానమో, లేక మరొకటో తెలియదు కానీ, టీడీపీ మాత్రం బాగా వాడుకుంటోంది. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా ఆ రెండు పార్టీల మధ్య సమన్వయ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పవన్‌కల్యాణ్ ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్ పల్లకీలు మోస్తున్నారు.
పవన్ అభిమానులతో పల్లకీలు మోయించుకోడానికి సమన్వయ సమావేశాలను టీడీపీ నేతలు బాగా వాడుకుంటున్నారు. టికెట్ ఎవరికిచ్చినా గెలుపు కోసం పని చేయాలంటూ టీడీపీ ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. నిజమే అని నమ్మి కొన్ని నియోజకవర్గాల్లో జనసేన నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. టీడీపీ మాస్టర్ ప్లాన్ వెనుక కుట్రను జనసేన పసిగట్టలేకపోతోంది.
టికెట్ ఎవరికిచ్చినా అని ఒక వైపు టీడీపీ చెబుతూ, మరోవైపు తమ అభ్యర్థులను ఆ పార్టీ ఎంపిక చేస్తోంది. ఈ విషయంలో జనసేనతో పొత్తు వుందన్న విషయాన్నే టీడీపీ మరిచిపోయింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో టీడీపీ తన పని తాను చేసుకుపోతుంటే జనసేన మాత్రం చేష్టలుడిగి ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. అయితే ఎవరికిచ్చినా అనే కండీషన్‌తో జనసేనను టీడీపీ మభ్యపెడుతోందని కొందరు పవన్ అభిమానులు అనుమానిస్తున్నారు.
టికెట్ల విషయం తప్ప, మిగిలిన అన్ని సంగతులు జనసేనతో కలిసి చేస్తున్నట్టు టీడీపీ నటిస్తోంది. మరి కీలకమైన టికెట్ల విషయానికి వచ్చే సరికి …ఎందుకు మెలిక పెడుతున్నదో ఈ పాటికే జనసేన అర్థం చేసుకుని వుండాలి. కానీ జనసేనకు టీడీపీ అంతరంగం అర్థమైనట్టు లేదు. అందుకే సులువుగా జనసేనను మోసగించేందుకు ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుందామనే నిబంధనను టీడీపీ తెరపైకి తెచ్చిందనేది వాస్తవం.