మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతు, రాయలసీమ వ్యతిరేకి అనే విమర్శ వుంది. ఇది నిజం అని చెప్పేందుకు ఎన్నైనా ఉదాహరణలు చెప్పొచ్చు. తాను పుట్టి పెరిగిన, ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న రాయలసీమపై మొదటి నుంచి ఆయనకు చిన్న చూపే. రాజకీయంగా రాయలసీమ అండగా ఉండడం లేదనే కోపం ఆయనలో వుంది. దీంతో రాయలసీమను శతాబ్దాలుగా పట్టి పీడిస్తున్న కరవును పారదోలాలనే కనీస మానవత్వం కూడా ఆయనలో కొరవడింది.
14 ఏళ్ల పాటు ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌గా సీఎంగా ఉన్న ఏకైక నాయకుడిని తానే అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు, తనకు రాజకీయ భిక్ష పెట్టిన రాయలసీమకు చేసిన మంచి ఏంటో చెప్పుకోడానికి ఏమీ లేదు. తాజాగా కరవు పరిస్థితిపై లోకేశ్ చేసిన ట్వీట్, తన తండ్రి చంద్రబాబు అధ్వానపాలనతో పాటు రైతు, రాయలసీమ వ్యతిరేకతను చెప్పకనే చెబుతోంది. టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన పార్టీగా టీడీపీ ఘనత సాధించింది.
నిజంగా సాగు, తాగునీటికి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చి వుంటే, ఈ రోజు రాయలసీమలో కరవు తాండవిస్తోందని లోకేశ్ ట్వీట్ చేసే పరిస్థితి వుండేదా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ప్రస్తుతం రాయలసీమలో కరవు పరిస్థితులున్నాయి. జగన్ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం వుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నష్టపరిహార చర్యలు చేపట్టలేదు.
ఈ క్రమంలో లోకేశ్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితుల వల్ల 70 శాతం పొలాలు ఎండిపోతే సీఎం జగన్‌కు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదని లోకేశ్ విమర్శించారు. టీడీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి వుంటే నేడు రాష్ట్ర వ్యాప్తంగా 70 శాతం పంటలు ఎండిపోయే పరిస్థితి వుండేదా? అనే ప్రశ్నకు లోకేశ్ సమాధానం ఏంటి? వర్షాభావ పరిస్థితుల వల్ల సుమారు 24 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా వేయలేదని లోకేశ్ మండిపడ్డారు. ఈ పాపంలో టీడీపీ పాత్ర ఎంతో ఆయనే చెప్పాలి.
రాష్ట్రంలో కరవు పరిస్థితులకు ప్రత్యర్థులపై ఒక వేలు చూపితే, మిగిలిన నాలుగు వేళ్లు తనవైపు వుంటాయని లోకేశ్ గ్రహించాలి. కళ్లు తెరువు…కరవు చూడు అని ట్విటర్ వేదికగా జగన్‌కు సూచించడం బాగుంది. ఇదే తనకు కూడా వర్తిస్తుందని నెటిజన్లు చీవాట్లు పెడుతున్నారు. రాయలసీమ వాసుల తాగు, సాగునీటి కష్టాలను తీర్చడానికి రూపొందించిన పోలవరం ప్రాజెక్టును ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని లోకేశ్ విమర్శించడం విడ్డూరంగా వుంది.
కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన జాతీయ ప్రాజెక్టును తన చేతల్లోకి తీసుకుని, ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో పడేసిన ఘనతలో తమ పాత్ర కూడా వుందని లోకేశ్ గ్రహించాలి. ఏపీ ప్రజల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంలో చేయడంలో తానేమీ తక్కువ తినలేదని లోకేశ్‌కు ఎవరైనా చెప్పాలా?