‘రాములమ్మ’ కిరికిరి: బిజెపికి నష్టమెంత?

రాములమ్మ విజయశాంతి ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీకి ఆమె రాజీనామా చేశారు. చాలాకాలంగా పార్టీతో ఆమె అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నప్పటికీ.. బండి సంజయ్ ను తప్పించి, కిషన్ రెడ్డిని సారథిగా చేసిన…

రాములమ్మ విజయశాంతి ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీకి ఆమె రాజీనామా చేశారు. చాలాకాలంగా పార్టీతో ఆమె అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నప్పటికీ.. బండి సంజయ్ ను తప్పించి, కిషన్ రెడ్డిని సారథిగా చేసిన తర్వాత.. బాహాటంగా తన అసంతృప్తిని వెళ్లగక్కిన రాములమ్మ.. మొత్తానికి ఇన్నాళ్ల తరువాత.. రాజీనామాను ప్రకటించారు. ఆమె రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెసు పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది.

మెదక్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టుగా కూడా అప్పుడే ప్రచారం జరుగుతోంది. అయితే విజయశాంతి రాజీనామా చేయడం వల్ల భారతీయ జనతా పార్టీకి జరగబోయే నష్టమెంత? కాంగ్రెసుకు జరగగల లాభమెంత అనే విషయంలో ఇప్పుడు చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

విజయశాంతి రాజీనామా అనేది భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా నష్టమే అని చెప్పాలి. ఆమె చురుగ్గా లేకపోయినప్పటికీ.. ఆమె పార్టీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ లేకపోయినప్పటికీ.. ఆమె రాజీనామా అనేది పార్టీ మీద ప్రజల్లో అనుమానాలను పుట్టిస్తుందనడంలో సందేహం లేదు. 

అసలే భారతీయ జనతా పార్టీ.. భారాసతో కుమ్మక్కు రాజకీయాలు నడుపుతోందనే ఆరోపణలు పుష్కలంగా ఎదుర్కొంటోంది. అనేకానేక సంకేతాలు.. భాజపా.. కేసీఆర్ తో లాలూచీ పడిందనే అనుమానాలనే ప్రజల్లో పెంచుతున్నాయి.

ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ విమర్శల దాడి కూడా కేవలం కాంగ్రెస్ ఫోకస్ తోనే ఉంటోంది తప్ప.. బిజెపి ని పెద్దగా ఆయన టార్గెట్ చేయడం లేదు. ఈ పోకడలు.. కేసీఆర్ మీద విపరీతమైన వ్యతిరేకతతో భాజపాలో చేరిన వారికి ఈ పోకడలు ఏమాత్రం రుచించలేదు. అలాంటి వారంతా ఇప్పటికే బయటకు వెళ్లిపోయారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జి వివేక్ వంటి వారు సరిగ్గా టికెట్లు ప్రకటిస్తున్న సమయంలో పార్టీని వీడి కాంగ్రెసులో చేరారు.

ఇప్పుడు విజయశాంతి వంతు వచ్చింది. బిజెపి కేసీఆర్ అనుకూల ధోరణితో ఉన్నదనే అభిప్రాయంతోనే విజయశాంతి కూడా పార్టీని వీడి కాంగ్రెసులోకి వెళుతున్నారని ప్రజలు నమ్మితే.. బిజెపికి పెద్ద నష్టమే జరుగుతుంది. 

బిజెపికి సాంప్రదాయ హిందూత్వ వీరాభిమానుల ఓట్లు పడాల్సిందే తప్ప.. కేసీఆర్ వ్యతిరేక ఓటు కమలం వైపు మళ్లే అవకాశం తగ్గిపోతుంది. ఇదే అంశాన్ని విజయశాంతి ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది కాంగ్రెస్ ప్లాన్ గా ఉంది. ప్రభుత్వ/కేసీఆర్ వ్యతిరేక ఓటు ఏ మాత్రం చీలకుండా.. కాంగ్రెసుకు పడేలా చేసుకుంటే గెలవగలం అనేది వారి ఆలోచనగా ఉంది.