భారీ బడ్జెట్ సినిమాపై దారుణమైన రివ్యూస్

ఫ్రాంచైజీలు ఎల్లకాలం క్రేజ్ తో కొనసాగవు. ఏదో ఒక దశలో వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా సాగదీసుకుంటూపోతే జనాలే తిరస్కరిస్తారు. ఇప్పుడిదే జరిగింది. మార్వెల్ కథలపై ప్రేక్షకులకు మొహం మొత్తింది.…

ఫ్రాంచైజీలు ఎల్లకాలం క్రేజ్ తో కొనసాగవు. ఏదో ఒక దశలో వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా సాగదీసుకుంటూపోతే జనాలే తిరస్కరిస్తారు. ఇప్పుడిదే జరిగింది. మార్వెల్ కథలపై ప్రేక్షకులకు మొహం మొత్తింది. తాజాగా రిలీజైన ది మార్వెల్స్ సినిమాపై ఇటు ప్రేక్షకులతో పాటు, అటు సమీక్షకులు విరుచుకుపడుతున్నారు.

జస్ట్ 105 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా తమ సహనాన్ని పరీక్షించిందంటూ ప్రేక్షకులు తెగ పోస్టులు పెడుతున్నారు. అక్కడితో ఆగకుండా, ఇక మార్వెల్ ఫ్రాంచైజీకి ఫుల్ స్టాప్ పెట్టండంటూ సూచనలు చేస్తున్నారు.

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఎన్నో పాత్రలు జీవం పోసుకున్నాడు. కోట్లాది మంది ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పటివరకు ఈ ప్రపంచం నుంచి 32 సినిమాలొచ్చాయి. తాజాగా వచ్చిన ది మార్వెల్స్ మూవీ 33వది. ఇక ఇక్కడితో ఆపితే అందరికీ మంచిదంటూ ఫన్నీ పోస్టులు కూడా పెడుతున్నారు హాలీవుడ్ జనం.

ఇక రివ్యూల విషయానికొస్తే, హాలీవుడ్ మీడియా, ఈ సినిమాను ఏకి పారేసింది. న్యూయార్క్ టైమ్స్ అయితే.. ఈ సినిమాపై విరుచుకుపడింది. ఇప్పటికే ఈ సినిమాను 32 సార్లు చూసి ఉంటారంటూ కామెంట్ చేసింది. అంటే, ఇంతకుముందు వచ్చిన 32 సినిమాల్లోని కథ, కథనాలు, క్లయిమాక్సే.. 33వ చిత్రంలో కూడా కనిపించాయని, ఏమాత్రం ఆసక్తికరంగా లేదనేది ఆ రివ్యూ సారాంశం.

వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం చూసుకుంటే, ది మార్వెల్స్ సినిమాలో ఎలాంటి నవ్వులు, సస్పెన్స్, ఉత్కంఠ లేనే లేవు. పాత్రలన్నీ గత సినిమాల్లో మాదిరిగా జిరాక్స్ కాపీల్లా వ్యవహరించాయని, కనీసం వాటి ఎక్స్ ప్రెషన్స్ కూడా మారకపోవడం బాధాకరం అని రాసింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో నిస్తేజమైన సూపర్ హీరోల బృందం ఏదైనా ఉందంటే, అది ఇది మాత్రమే అని చెప్పుకొచ్చింది.

కేవలం ఫ్రాంచైజీతో పాపులారిటీ, డబ్బులు కొట్టేయాలనే ఆలోచనతో ఈ సినిమా తీసినట్టుందంటూ ది హాలీవుడ్ రిపోర్టర్ పేర్కొంది. దీనికి తోడు సినిమాను సడెన్ గా ముగించినట్టు ఉందని, కొన్ని థ్రెడ్స్ కూడా మిస్సయ్యారని విశ్లేషణ అందించింది.

ది టెలిగ్రాఫ్ మరింత దారుణంగా విశ్లేషించింది. మార్వెల్స్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇంతకంటే దారుణమైన సినిమా ఇంకోటి లేదని, రాదని రాసుకొచ్చింది. ఈ ఒక్క సినిమా దెబ్బతో మార్వెల్స్ ట్రేడ్ మార్క్ పూర్తిగా పడిపోయిందని చెప్పుకొచ్చింది.

ఇలా చెప్పుకుంటూపోతే.. ది వ్రాప్, అసోసియేటెడ్ ప్రెస్, యూఎస్ఏ టుడే, న్యూయార్క్ పోస్ట్… ఇలా దాదాపు ప్రముఖ హాలీవుడ్ రివ్యూస్ అన్నీ ది మార్వెల్స్ ను ఏకి పడేశాయి. 2019లో వచ్చిన కెప్టెన్ మార్వెల్ సినిమాకు సీక్వెల్ గా తీసిన ఈ మూవీ కి ఓపెనింగ్స్ మాత్రం భారీగా వచ్చాయి.