థియేటర్లలో ఫ్లాప్.. టీవీల్లో సూపర్ హిట్

బుల్లితెరపై ఏ సినిమా క్లిక్ అవుతుందో, ఏది ఫ్లాప్ అవుతుందో అస్సలు చెప్పలేని పరిస్థితి. థియేటర్లలో సూపర్ హిట్టయిన వాల్తేరు వీరయ్య, టీవీల్లో అట్టర్ ఫెయిల్. అదే టైమ్ లో థియేటర్లలో డిజాస్టర్ అయిన…

బుల్లితెరపై ఏ సినిమా క్లిక్ అవుతుందో, ఏది ఫ్లాప్ అవుతుందో అస్సలు చెప్పలేని పరిస్థితి. థియేటర్లలో సూపర్ హిట్టయిన వాల్తేరు వీరయ్య, టీవీల్లో అట్టర్ ఫెయిల్. అదే టైమ్ లో థియేటర్లలో డిజాస్టర్ అయిన ఆదిపురుష్ సినిమా, బుల్లితెరపై మాత్రం బంపర్ హిట్.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో ఆదిపురుష్ సినిమాను ప్రసారం చేశారు. ఈ సినిమాకు ఏకంగా 9.5 (అర్బన్) రేటింగ్ రావడం విశేషం. ఈమధ్య కాలంలో వచ్చిన రేటింగ్స్ ఆధారంగా చూసుకుంటే, ఆదిపురుష్ సినిమా బుల్లితెరపై బ్లాక్ బస్టర్ హిట్టయినట్టే.

ఈ సినిమా టీవీల్లో హిట్టవ్వడం మామూలు విషయం కాదు. ఎందుకంటే, ఈ సినిమాను టెలికాస్ట్ చేసిన టైమ్ లో వరల్డ్ కప్ మ్యాచ్ కూడా ఉంది. మ్యాచ్ ను సైతం ఎదిరించి, ఈ సినిమాకు ఈ స్థాయిలో రేటింగ్ రావడం పెద్ద విషయం.

ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ సినిమాలు వేటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో రేటింగ్స్ రావడం లేదు. వాల్తేరు వీరయ్య తో పాటు బ్రో, గాడ్ ఫాదర్, కార్తికేయ-2, సర్దార్ సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఉన్నంతలో బలగం, ధమాకా మాత్రమే మెరిశాయి. ఇప్పుడు ఆదిపురుష్ మంచి రేటింగ్ అందుకుంది.

ప్రభాస్ హీరోగా నటించిన ఈ మైథలాజికల్ సినిమాపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. మరీ ముఖ్యంగా హనుమంతుడి పాత్రధారితో చెప్పించిన డైలాగ్ అయితే వివాదాస్పదమైంది. ఏకంగా కోర్టులు జోక్యం చేసుకొని మొట్టికాయలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పట్లో అదంతా ఓ ప్రహసనం. గ్రాఫిక్స్ కూడా చాలా పేలవం.

అలాంటి సినిమా టీవీల్లో క్లిక్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ప్రభాస్ సినిమా మెరిసింది. వరల్డ్ కప్ కు దీటుగా మంచి టీఆర్పీతో నిలిచింది.