భగవంత్ కేసరి ఇచ్చిన ఆనందం అనీల్ రావిపూడి కళ్లల్లో, బాడీ లాంగ్వేజ్ లో స్పష్టంగా కనిపించింది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ లో మాట్లాడిన ఈ దర్శకుడు.. తను తీసిన భగవంత్ కేసరి సినిమాకు అవార్డులు ఆశిస్తున్నట్టు ప్రకటించాడు.
“అవార్డుల గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. నిజంగా వాటికి మనసుంటే పరుగెత్తుకుంటూ బాలయ్య దగ్గరకు, శ్రీలీల దగ్గరకు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే, అవార్డు వచ్చే స్థాయి పెర్ఫార్మెన్స్ చేశారిద్దరూ. ఏ అవార్డులైనా పర్వాలేదు, వాటికి మనసుంటే బాబు దగ్గరకు పరుగెత్తుకుంటూ రావాల్సిందే.”
తను ఇలాంటి సందేశాత్మక సినిమాలు కూడా తీయగలననే నమ్మకాన్ని భగవంత్ కేసరి కలిగించిందంటున్నాడు రావిపూడి. తనకు అంత నమ్మకాన్ని కల్గించిన ప్రేక్షకులకు పాదాభివందనం తెలుపుతూనే, తన నెక్ట్స్ సినిమా కోసం కూడా ఇదే విధంగా కష్టపడతానని ప్రామిస్ చేశాడు.
ఈ సందర్భంగా బాలయ్యతో మరో సినిమా చేస్తానని ప్రకటించాడు అనీల్. బాలయ్య సై అంటే తను కూడా సై అన్నాడు. సినిమాలో బాలయ్యకు తొడకొట్టే సీన్ లేదని కొందరు విమర్శించారని, బాలయ్య తొడ కొట్టాల్సిన అవసరం లేదని, ఇంత సక్సెస్ అందుకున్న తమ నిర్మాతలు తొడ కొడతారంటూ వేదికపై నిర్మాతలతో తొడ కొట్టించాడు అనీల్ రావిపూడి.