చంద్రబాబునాయుడిని మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపాలని ఎల్లో మీడియా అనుకుంటోందా? అంటే..ఔననే సమాధానం వస్తోంది. ఇందుకు నిదర్శనంగా ఈనాడులో సింగిల్ కాలమ్‌లో ప్రచురితమైన వార్తను పలువురు చూపుతున్నారు. స్కిల్ స్కామ్‌లో అరెస్టయిన చంద్రబాబునాయుడికి న్యాయ స్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కంటికి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు న్యాయ స్థానం మానవతా దృక్పథంతో ఆయనకు జైలు నుంచి విముక్తి కల్పించింది.
మధ్యంతర బెయిల్ ఇచ్చిన సందర్భంలో షరతులు విధించింది. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని, మీడియాతో కేసు గురించి మాట్లాడొద్దని , కేవలం ఆరోగ్యపరమైన అంశాలకు మాత్రం బెయిల్‌ను సద్వినియోగం చేసుకోవాలని న్యాయ స్థానం స్పష్టం చేసింది. కనీసం పైకి కనిపించేందుకైనా షరతులను పాటించాలి.
చంద్రబాబు నివాసంలో ప్రతి రోజూ రాజకీయ కార్యకలాపాలు సాగుతున్న సంగతి అందరికీ తెలుసు. అలాగని మాంసం తింటున్నామని ఎముకలు మెడలో వేసుకోరు కదా! చంద్రబాబును కలిసిన అత్యుత్సాహంలో ఒక టీడీపీ అభిమాని, అందుకు సంబంధించిన ప్రకటన ఇచ్చారు. ముందూవెనుకా ఆలోచించకుండా ఈనాడు పత్రిక దాన్ని ప్రచురించడం చర్చనీయాంశమైంది.
చంద్రబాబు అరెస్టయిన తర్వాత ఆయనకు సంఘీభావంగా ఒక సంస్థ తెలుగువీర లేవరా -బాబు కోసం కదలిరా అనే పాటను తీసుకొచ్చారు. ఈ పాట విజయోత్సవ సభను 11వ తేదీన విశాఖలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చంద్రబాబుతో ఆయన నివాసంలో ఆవిష్కరింపజేశారు. ఇంత వరకూ ఓకే. ఈ సమాచారాన్ని బయటికి పంపడం ద్వారా.. చంద్రబాబును తిరిగి జైల్లోపలకి పంపాలనేనా అని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.