తమ సినిమాను తాము ముందుగా చూసుకునే అవకాశాన్ని కోల్పోయారు తమిళ ప్రేక్షకులు. తమిళ హీరోతో, తమిళనాడులో, తమిళ మేకర్స్ తో తీసిన ఓ ఫక్తు తమిళ సినిమాను ముందుగా చూసేది తమిళ ప్రేక్షకుడు కాదు. ఏ కన్నడ వాడో లేక తెలుగువాడో చూస్తాడు. ఆ తర్వాత మాత్రమే తమిళ ప్రేక్షకుడు తన అభిమాన హీరో నటించిన తమిళ సినిమాను చూడగలడు. ప్రస్తుతం కోలీవుడ్ లో పరిస్థితి ఇదే.
ఈరోజు జపాన్ సినిమా రిలీజైంది. కార్తి హీరోగా నటించిన ఈ సినిమా బెంగళూరులో ముందుగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత హైదరాబాద్ లో మొదలైంది. మెల్లగా చెన్నైలో షోలు ప్రారంభమయ్యాయి.
ఇంకా చెప్పాలంటే బెంగళూరులో జపాన్ సినిమాకు 7 గంటల షోలు పడ్డాయి. ఆ తర్వాత హైదరాబాద్ లో కూడా షోలు పడ్డాయి. కానీ చెన్నైతో పాటు, తమిళనాడు అంతటా ఉదయం 9 తర్వాత షోలు మొదలయ్యాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ ఫలితమిది.
ఈరోజు రిలీజైంది కాబట్టి జపాన్ గురించి చెప్పుకున్నాం. ఇంతకుముందు రిలీజైన లియోది కూడా ఇదే పరిస్థితి. విజయ్ కు తమిళనాట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. కానీ అతడి సినిమాను అందరికంటే ముందు చూసే భాగ్యానికి ఇళయదళపతి అభిమానులు నోచుకోలేకపోయారు.
అజిత్ నటించిన ఓ సినిమా రిలీజ్ సందర్భంగా ఎర్లీ మార్నింగ్ షో లో బ్యానర్ కడుతూ ఓ అభిమాని చనిపోయాడు. అప్పట్నుంచి తమిళనాట ఎర్లీ మార్నింగ్ షోలు రద్దు చేసింది ప్రభుత్వం. రజనీకాంత్, విజయ్ లాంటి సినిమాలకు ప్రత్యేక అనుమతులు కూడా ఇవ్వడం లేదు. ఫలితంగా తమిళ స్టార్ హీరోల సినిమాలు కోలీవుడ్ లో కంటే, పొరుగు రాష్ట్రాల్లో ఎర్లీ షోలు పడుతున్నాయి. దీంతో సదరు హీరోల అభిమానులు తెగ ఇదైపోతున్నారు.