ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు నీతులు కోటలు దాటుతున్నాయి. ఎదుటి వాళ్లకి చెప్పడానికే తప్ప, తనకు ఏవీ వర్తించవని ఆయన ఒక అభిప్రాయానికి వచ్చినట్టున్నారు. అందుకే నిస్సిగ్గుగా ఇతరుల గురించి దుష్ప్రచారం చేస్తుంటారని నెటిజన్లు మండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ నేతలకైతే ఒక నీతి, వైసీపీ నాయకులకు మరో నీతి అన్నట్టుగా రామోజీ పత్రిక రాస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇవాళ్టి పత్రికలో “వాసుపల్లికి విలువైన భూమి నజరానా” శీర్షికతో కథనాన్ని రామోజీ పత్రిక రాసింది. ఇలాంటి కథనం రాయడానికి రామోజీకి ఉన్న నైతికత ఎంత? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. విలువైన భూములను విద్యా సంస్థల ముసుగులో వైసీపీ నాయకుడికి ప్రభుత్వం కట్టబెడుతోందని ఈనాడు పత్రిక తెగ బాధపడుతోంది.
విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ టీడీపీ తరపున గెలుపొంది, ఆ తర్వాత జగన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఆయనకు సంబంధించిన వైజాగ్ ఢిపెన్స్ అకాడమీ విద్యాసంస్థకు కుసులవాడ పరిధిలోని సర్వే నంబర్ 59లో 7.60 ఎకరాల భూమి ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూమి ఎకరం మార్కెట్ విలువ రూ.17 లక్షలని, బహిరంగ మార్కెట్‌లో రూ.1-2 కోట్ల వరకూ పలుకుతోందని ఈనాడులో రాసుకొచ్చారు. మంత్రి వర్గం ఆమోదం తర్వాత కేటాయింపు ఉత్తర్వులు వెలువడుతాయి.
అప్పనంగా ప్రభుత్వ భూమిని కట్టబెట్టడాన్ని ఎవరైనా ప్రశ్నించాల్సిందే. అయితే నైతికతే ఇప్పుడు ప్రధాన సమస్య. సామాన్య ప్రజలు ప్రశ్నిస్తే ఒక అర్థం వుంది. రామోజీరావు తన ఫిల్మ్ సిటీకి వేలాది ఎకరాలను కొల్లగొట్టి, ఇప్పుడు ధర్మోపన్యాసాలు చేయడం విమర్శలకు దారి తీసింది.
రామోజీ ఫిలింసిటీ 2000 ఎకరాలలో విస్తరించింది. హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్లే 65వ నెంబరు జాతీయ రహదారి పక్కన హైదరాబాద్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1996లో ఈ ఫిల్మ్ సిటీని రామోజీరావు నెలకొల్పారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలో ఉన్నారు. 1995లో ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి కూలగట్టడంలో అతిపెద్ద సహాయ మీడియాగా నిలిచినందుకు రామోజీకి చంద్రబాబు నజరానాగా వేలాది ఎకరాలు కట్టబెట్టారని అప్పట్లో తీవ్ర విమర్శలొచ్చాయి.
ఆ తర్వాత 2017లో కేసీఆర్ ప్రభుత్వం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ విస్తరణకు 295 ఎకరాలు చౌకధరకు తీసుకున్నది వాస్తవం కాదా? ఇబ్రహీంపట్నం మండలంలోని నాగన్‌పల్లిలో 250.13 ఎకరాలు, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్‌లో 125.24 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఇందులో 295 ఎకరాలు కావాలని ఫిల్మ్ సిటీ యాజమాన్యమే తన దరఖాస్తులో పేర్కొన్నది నిజం కాదా? అయితే రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం సూచించిన కొన్ని సర్వే నంబర్ల భూమిలో కొండలు, గుట్టలు ఉండడంతో విభజించడం సాధ్యం కాదని, కాబట్టి మొత్తం 376 ఎకరాలను అప్పగిస్తామని పర్యాటక శాఖకు రెవెన్యూ అధికారులు రాశారు. దీంతో 376.32 ఎకరాలకు రూ.37.65 కోట్లు డిపాజిట్ చేయాలని ఫిల్మ్ సిటీ యాజమాన్యాన్నిఅప్పట్లో కేసీఆర్ సర్కార్ కోరింది. ఈ లెక్కన వేలాది ఎకరాలు తీసుకున్న రామోజీకి సంబంధించిన పత్రిక కూడా విద్యా సంస్థకు ఏడు ఎకరాలు తీసుకుంటుంటే గగ్గోలు పెట్టడం ఆ మీడియా సంస్థకే చెల్లింది.
ఇదే విశాఖలో నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్‌కు సంబంధించిన గీతం విద్యాసంస్థకు ప్రభుత్వం ఇచ్చిన నజరానా గురించి కూడా ఈనాడు రాస్తే జనం తెలుసుకుని సంతోషిస్తారు. వేలాది ఎకరాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించి, ముక్కు పిండి మరీ జనం నుంచి వసూలు చేస్తున్న సంగతి ఎవరికి తెలియదు రామోజీ అని నెటిజన్లు నిలదీస్తున్నారు.