మనసులో ఏదీ దాచుకోని మనస్తత్వం జేసీ బ్రదర్స్‌ది. ఇదే వారికి బలమూ, బలహీనత. రాజకీయాల్లో హూందాతనం ముఖ్యం. పాత తరానికి చెందిన జేసీ బ్రదర్స్‌కు ఎందుకో నోటి దురుసు ఎక్కువ. అందుకే జేసీ బ్రదర్స్ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి జనంలో పలుచన అయ్యారు. అధికారం వారి చేతిలో వుంటే, ఆగడాల గురించి మాటల్లో చెప్పలేం. జేసీ బ్రదర్స్ దౌర్జన్యాలు శ్రుతిమించడంతో గత ఎన్నికల్లో తాడిపత్రి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు.
రాజకీయాల నుంచి జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన తమ్ముడు ప్రభాకర్‌రెడ్డి నిష్క్రమించి తనయులైన పవన్‌ను అనంతపురం పార్లమెంట్, అస్మిత్‌రెడ్డిని తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. అయినా ఇద్దరూ గెలవలేకపోయారు. దీంతో పవన్ పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అస్మిత్ మాత్రం తన తండ్రితో పాటు రాజకీయంగా తిరుగుతున్నారు. తాడిపత్రి మున్సిపాల్టీ చైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన అనంతపురం ఎస్పీని కలిసి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకిప్పుడు 73 ఏళ్ల వయసు అని అన్నారు. తనపై నమోదైన కేసులన్నీ పూర్తి కావాలంటే మూడు జన్మలు కావాలని వ్యంగ్యంగా అన్నారు. ఎల్లనూరు, పుట్లూరు మండలాల్లో భారీగా దొంగ ఓట్లు చేర్చుతున్నారని ఆయన అన్నారు.
ఆ రెండు మండలాల తహశీల్దార్లు జాగ్రత్తగా వుండాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. ఈ ఎన్నికలు తమకు లైఫ్ అండ్ డెత్ సమస్యగా ఆయన అభివర్ణించారు. అందుకే ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేదే లేదని ఆయన అన్నారు.