తెలంగాణలో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. జనసేన గ్లాస్ గుర్తును ఆ పార్టీకి కేటాయించలేదు. గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్‌గా ఎన్నికల సంఘం ఉంచడం గమనార్హం. దీంతో పవన్‌కల్యాణ్ ఏం చేస్తారనేది చర్చనీయాంశమైంది. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. 8 స్థానాల్లో జనసేన బరిలో వుంది.
ఈ నేపథ్యంలో జనసేన అభ్యర్థులంతా గ్లాస్ గుర్తుతో ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అయితే ఎన్నికల సంఘం అనూహ్యంగా గ్లాస్ గుర్తును రిజర్వ్‌లో పెట్టడంతో జనసేన అభ్యర్థులు షాక్‌కు గురయ్యారు. తెలంగాణలో జనసేన గుర్తింపు పొందిన పార్టీ కాకపోవడంతోనే సమస్య తలెత్తింది. అందువల్లే ఆ పార్టీ గుర్తును తెలంగాణలో జనసేనకు మాత్రమే కేటాయిస్తూ రిజర్వ్‌లో పెట్టలేదు.
గ్లాస్ గుర్తు జనసేనకు దక్కని పరిస్థితిలో ఆ పార్టీ అభ్యర్థులను స్వతంత్రులుగా పరిగణిస్తారనే చర్చకు తెరలేచింది. దీంతో జనసేన అభ్యర్థులకు ఒక్కొక్కరికి ఒక్కో గుర్తు కేటాయిస్తారా? లేక తాత్కాలికంగా 8 మందికి ఒకటే కోరుకుంటారా? అనేది తేలాల్సి వుంది.
ఏది ఏమైనా తెలంగాణలో జనసేనకు కనీసం ప్రాంతీయ పార్టీగా కూడా గుర్తింపు లేదని ప్రత్యర్థులు దెప్పి పొడుస్తున్నారు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీ కనీసం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందని జనసేనతో పొత్తు పెట్టుకుందని, దీన్ని బట్టి జాతీయ పార్టీ దుస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు దెప్పి పొడుస్తున్నారు.