స్కిల్ స్కామ్‌పై విచారణ బాధ్యతల్ని సీబీఐకి అప్పగించాలని సీనియర్ పొలిటీషియన్ ఉండవల్లి అరుణ్‌కుమార్ వేసిన పిటిషన్‌పై ఆశ్చర్యపోయే ట్విస్ట్ నెలకుంది. స్కిల్ స్కామ్‌లో ఏపీ సీఐడీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిన సంగతి తెలిసిందే. 50 రోజులు గడిచిన తర్వాత అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ దొరికింది.
ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసు కొట్టివేయాలని ఒక వైపు చంద్రబాబునాయుడు న్యాయ పోరాటం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసు ఇతర రాష్ట్రాలతో కూడా ముడిపడి వుండడం వల్ల సీబీఐతో విచారించడమే సరైందని, అవినీతికి సంబంధించిన తగిన ఆధారాలున్నాయని ఏపీ హైకోర్టును ఉండవల్లి ఆశ్రయించారు. దీంతో చంద్రబాబు కేసులో ఏం జరుగుతుందో అనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో నెలకుంది.
ఉండవల్లి తన పిటిషన్‌లో చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తదితరులతో కలిపి 44 మందిని చేర్చారు. ఈ పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు స్వీకరించి, ప్రతివాదులందరికీ నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. దాదాపు నెల రోజులకు మరోసారి హైకోర్టులో కేసు విచారణకు వచ్చింది. అయితే హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రతివాదులందరికీ నోటీసులు అందని విషయాన్ని కోర్టు దృష్టికి న్యాయవాదులు తీసుకెళ్లారు.
దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. నోటీసులు అందజేయడంలో నిర్లక్ష్యం వహించిన వారిని గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించడం విశేషం. చంద్రబాబు కేసును సీబీఐకి అప్పగించాలనే కీలకమైన కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశించినా ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది.
కోర్టు ఆదేశాలనే పాటించనంతగా ఎవరైనా మేనేజ్ చేసి వుంటారనే చర్చకు తెరలేచింది. దీన్ని అంత సులువుగా తీసుకోవద్దని, నోటీసులు అందజేయడంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా వుండగా ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. గతంలో కూడా ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి ఏజీ తెలిపారు. గతంలో ప్రభుత్వమే సీబీఐతో విచారించాలని కేంద్రాన్ని కోరిన విషయాన్ని ఏజీ గుర్తు చేశారు. ఉండవల్లి పిటిషన్‌పై ప్రతివాదులందరికీ నోటీసులు అందజేయాలంటూ విచారణను ఈ నెల 29కి న్యాయ స్థానం వాయిదా వేసింది.