Japan Review: మూవీ రివ్యూ: జపాన్

చిత్రం: జపాన్ రేటింగ్: 2/5 తారాగణం: కార్తి, అను ఇమ్మాన్యుయేల్‌, జితన్ రమేష్, సునీల్, కె.ఎస్.రవికుమార్, విజయ్ మిల్టన్ తదితరులు కెమెరా: రవి వరన్ ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్ సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్…

చిత్రం: జపాన్
రేటింగ్: 2/5
తారాగణం:
కార్తి, అను ఇమ్మాన్యుయేల్‌, జితన్ రమేష్, సునీల్, కె.ఎస్.రవికుమార్, విజయ్ మిల్టన్ తదితరులు
కెమెరా: రవి వరన్
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాత: ఎస్.ఆర్.ప్రభు
దర్శకత్వం: రాజు మురుగన్
విడుదల: 10 నవంబర్ 2023

కార్తీ అంటే తెలుగునాట కూడా ఫాలోయింగ్ ఉన్న నటుడు. అతని సినిమా వస్తోందంటే డబ్బిగైనా డబ్బు ఖర్చుపెట్టి చూడ్డానికి యంగ్ ఆడియన్స్ రెడీగా ఉంటారు. “జపాన్” అనే చిత్రమైన క్యాచీ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చెప్పుకుందాం. 

ఒక నగల దుకాణం దొంగతనంతో కథ మొదలవుతుంది. ఇన్వెష్టిగేషన్ ఆఫీసర్ (సునీల్) తన పద్ధతిలో నేరపరిశోధన చేస్తుండగా ఆ దొంగతనానికి, జపాన్ (కార్తి)కి లింకుందని అర్ధమవుతుంది. ఇంటెర్వల్ వరకు ఇదే కథ. అక్కడే ఒక ట్విస్టు. అసలా దొంగతనం జపాన్ చేసింది కాదని, మరొకరెవరో ఉన్నారని! సెకండాఫులో ఆ మరొకరు ఫలానా జపాన్ శిష్యుడు అని ఒక అనుమానం. కానీ క్లైమాక్సులో ఈ ఇద్దరూ కాకుండా వేరే వాడని కంక్లూజన్. సింపుల్గా చెప్పుకోవాలంటే ఇదే కథ. 

కథ ఉల్లిపొరంత సింపుల్ గా ఉన్నా, సరైన రచన తోడైతే కథనాన్ని చాలా ఆసక్తిగా నడపొచ్చు నిజానికి. కానీ ఆ శక్తిని చూపలేకపోయాడు దర్శక రచయిత. సీరియస్ కథని లైటర్ టోన్ లో చెప్పాలని కంగాళీ చేసేసాడు. 

ఇంతకీ ఇందులో హీరోకి జపాన్ అనే పేరేంటి? దీనికో జస్టిఫికేషన్ చెప్తాడు ఒక సీన్లో. జపాన్ మీద ఎన్ని బాంబులు పడి నాశనమైనా మళ్లీ లేచినిలబడింది కనుక ఆ దేశం పేరునే తనకి పేరుగా పెట్టిందట తన తల్లి. అయితే దానికి తగ్గ కథాంశం కానీ, అంతటి స్ఫూర్తిదాయకమైన పాత్ర కానీ కాదు కార్తిది. 

ఏ సినిమా అయినా ప్రేక్షకులకి హీరో పాత్రతో ఒక ఎమోషనల్ బాండ్ ఏర్పడాలి. అతను చేసే పోరాటాల్లో వీరత్వం, సెంటిమెంటులో పటుత్వం, ప్రేమలో సున్నితత్వం ఇవన్నీ ప్రేక్షకుడు ఫీలవ్వాలి. కానీ అవేవీ లేకుండా, నవరసాల్లోని ఏరసమూ అందకుండా కేవలం నీరసం మాత్రమే కమ్మేసే సినిమా ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పరమ నాశిరకం కథనం. 

అసలీ చిత్రాన్నీ కార్తి లాంటి వాడు ఎందుకు ఓకేచేసాడో అతనికే తెలియాలి. బహుశా తన ప్రెజెన్స్ ఉంటే చాలు…కథతో సంబంధం లేకుండా కాసులు కురుస్తాయని తన స్టార్డం ని నిరూపించుకోవాలని అనుకున్నాడో ఏమో! అదే నిజమైతే ఈయనగారి కెరీర్ పెడదారిపట్టినట్టే. 

సినిమా మొదలయ్యి గంటైనా కథ ముందరికెళ్లకుండా అక్కడే ఉన్న ఫీలింగొచ్చిందంటే స్క్రీన్ ప్లే ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దొంగ కోసం పోలీసుల వెదుకులాట, దొంగ తప్పించుకోవడం, అర్ధం లేని షూటింగ్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్లో ఏదో విశేషం ఉందేమో అనిపించే ట్విస్టు, సెకండాఫులో తుస్సుమనిపించే ట్విస్టు, క్లైమాక్స్ లో సింపతీ ఎండింగ్. ఇదే సినిమా!

సింపతీ ఏంటో అనుకునేరు!! ఈ సినిమాకొచ్చినందుకు ప్రేక్షకులు తమ మీద తాము చూపించుకునే సింపతీ ఎండింగ్ అది! 

సెకండాఫులో ఒక చోట- “ఈ కేసెందుకో రాంగ్ గా పోతోందనిపిస్తోంది” అనే డైలాగ్ వినిపిస్తుంది. కథలో కేస్ మాత్రమే కాదు, మొత్తం సినిమానే పట్టాలు తప్పిన రైలులా ఎటో పోతోందనే ఫీలింగ్ ప్రేక్షకుడిది. 

అను ఇమ్మాన్యుయేల్‌ తో కార్తి, “అయ్యో సీరియలు” అంటాడు ఆమె చెప్పే మెలోడ్రామా డైలాగ్ కి బదులుగా. కానీ ఆడియన్స్ కి అప్పటివరకు చూస్తున్న సినిమా సీరియల్లా అనిపించడానికి సింబాలిజంలా పనిచేసింది ఆ డైలాగ్. 

సమాధిని తవ్వించి తల్లి అస్తిపంజరం పక్కన కూర్చుని హీరో చెప్పే సెంటిమెంటల్ కామెడీ డైలాగుల సీన్ పరమ రోతగా ఉంది. లైటర్ వీన్ లో కథనం గురించి తెలుసు కానీ, మరీ ఇలాంటి సీన్లు పెడితే చిరాకుగానే ఉంటుంది. 

కథలో పట్టు, కథనంలో పటుత్వం లేనప్పుడు కాపాడాల్సింది సంగీతమే. అది మరింత నీచంగా ఉంది. తెర మీద నడుస్తున్న సీన్ కి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జానర్ కి సంబంధం లేని విధంగా కొన్ని సన్నివేశాలున్నాయి. 

పాటల్లో “మార్పు అంటే ఉన్న ఒక్క జన్మలోనె మళ్లి పుట్టడం” అనేది బాగున్నా, దాని సందర్భం, ముందు-వెనుక బ్యాడ్ గా ఉండడం వల్ల దానిని ఆస్వాదించే పరిస్థితి లేకుండా పోయింది. అయితే ఈ పాటలో సంగీతం వీకే. మిగిలిన పాటల్లో సాహిత్యం, సంగీతం రెండూ డౌనే. ఆ విధంగా ఇటు పాటలు, అటు నేపథ్యసంగీతం ఈ చిత్రాన్ని నిలబెట్టలేకపోయాయి. 

కెమెరా, ఎడిటింగ్ లాంటి మిగిలిన సాంకేతిక అంశాలు ఓకే. 

హీరోగా కార్తి పర్ఫార్మెన్స్ ఎలా చేసినా.. క్యారెక్టరైజేషన్లో తడి లేకపోవడం వల్ల అతని ప్రతిభని కూడా పెద్దగా మెచ్చుకోవాలనిపించదు. 

అను ఇమ్మాన్యుయేల్‌ క్యారెక్టర్ ఐటెమ్మో, వ్యాంపో తెలీని గెష్ట్ హీరోయిన్ లా ఉంది. 

టఫ్ కాప్ గా సునీల్ సరిపోయాడు. మిగిలిన నటీ నటులంతా ఓకే. 

విషయం లేని కథ, విశేషం లేని మేకింగ్ తో దీపావళి సీజన్లో రిలీజైన ఈ “జపాన్” బాక్సాఫీసు దగ్గర కాకుండా ప్రేక్షకుల తలలో పేలింది. కేవలం కార్తీ ఉన్నాడని థియేటర్లకు వెళ్తే మాత్రం గూబ గుయ్యిమంటుంది. 

అల్రెడీ జపాన్ మీద రెండో ప్రపంచ యుద్ధంలో రెండు ఏటం బాంబులు పడ్డాయి. ఇప్పుడు ఆ దేశాన్ని సినిమా టైటిల్ గా పెట్టి దర్శకుడు ప్రేక్షకుల నెత్తి మీద బాంబుని పేల్చాడు. 

బాటం లైన్: నెత్తిమీద బాంబు