బీజేపీ సీనియర్ నేత, అనధికార సీఎం అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. వేములవాడ టికెట్‌ను ఈటల తన వర్గానికి చెందిన తుల ఉమకు మొదట ఇప్పించుకోగలిగారు. అయితే ఇదే సీటును బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు తనయుడు వికాస్‌రావు ఆశించారు. వికాస్‌రావుకు బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ మద్దతు వుంది. బీజేపీ అధిష్టానం వద్ద సీహెచ్ విద్యాసాగర్‌రావు తన పలుకుబడి ఉపయోగించినా, ఈటల మాటే నెగ్గిందనే ప్రచారం విస్తృతంగా సాగింది.
నాలుగు రోజుల క్రితం తుల ఉమకు వేములవాడ టికెట్‌ను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. అయితే టికెట్ కోసం వికాస్‌రావు పట్టువీడలేదు. ఉమకు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ వికాస్‌రావు అనుచరులు హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో తుల ఉమ శుక్రవారం మహిళలతో భారీ ర్యాలీ చేపట్టి నామినేషన్ కూడా వేశారు. ఇదే సందర్భంలో వికాస్‌రావు తరపున కూడా నామినేషన్ దాఖలైంది. శుక్రవారం రాత్రికి వేములవాడ అభ్యర్థి మారిపోయారు.
తుల ఉమకు బదులు వికాస్‌రావుకు ఖరారు చేశారు. బీ ఫామ్‌ను వికాస్‌రావుకు అందజేశారు. మరోవైపు తుల ఉమ బీజేపీ అధిష్టానంపై నిప్పులు చెరిగారు. బీజేపీలో బీసీ, మహిళా నినాదాలు ఉత్తుత్తివే అని తప్పు పట్టారు. దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్లే తన టికెట్‌ను రద్దు చేశారని మండిపడ్డారు.
వేములవాడ బరిలో నిలుస్తానని ఆమె ప్రకటించారు. తుల ఉమకు టికెట్ రద్దు చేయడం అంటే… ఈటల రాజేందర్‌ను అవమానించినట్టే అనే చర్చకు తెరలేచింది. ఉమకు చివరి నిమిషంలో టికెట్ రద్దు చేయడంపై ఈటల రాజేందర్ ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది.