టికెట్ కోసం ఎన్ని పార్టీలు మారాడంటే…!

రాజ‌కీయ నేత‌ల‌కు సిద్ధాంతాలు, విధానాలంటూ ఏవీ లేవు. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి బీ ఫామ్ ఇచ్చే పార్టీనే త‌మ‌ పార్టీ అని చివ‌రికి నిరూపిస్తున్నారు. టికెట్ కోసం ఒక‌దాని వెంట మ‌రొక‌టి పార్టీలు మారి,…

రాజ‌కీయ నేత‌ల‌కు సిద్ధాంతాలు, విధానాలంటూ ఏవీ లేవు. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి బీ ఫామ్ ఇచ్చే పార్టీనే త‌మ‌ పార్టీ అని చివ‌రికి నిరూపిస్తున్నారు. టికెట్ కోసం ఒక‌దాని వెంట మ‌రొక‌టి పార్టీలు మారి, చివ‌రికి బీఎస్పీలో టికెట్ ద‌క్కించుకున్నాడో నాయ‌కుడు. ఆయ‌నే నీలం మ‌ధు.

సంగారెడ్డి జిల్లా ప‌టాన్‌చెరు టికెట్‌ను నీలం మ‌ధు ఆశించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్‌రెడ్డి వైపే బీఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూపింది. దీంతో బీఆర్ఎస్‌లో ఆయ‌న అసంతృప్తితో ర‌గిలిపోయారు. కాంగ్రెస్ నాయ‌కులు టికెట్ ఆశ చూపించి, పార్టీలో ఆయ‌న్ను చేర్చుకున్నారు. ఇచ్చిన మాట ప్ర‌కార‌మే నీలం మ‌ధుకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఖ‌రారు చేసింది. టికెట్ వ‌చ్చింద‌న్న సంతోషం ఎన్నో రోజులు నిల‌వ‌లేదు.

కేవ‌లం రాజ‌కీయ స్వార్థంతో పార్టీలోకి కొత్త‌గా వ‌చ్చిన వారికి టికెట్ ఇవ్వ‌డాన్ని సీనియ‌ర్ నాయ‌కులు తీవ్రంగా వ్య‌తిరేకించారు. ప‌టాన్‌చెరు టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేత కాటా శ్రీ‌నివాస్ త‌న‌కే ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. గాంధీభ‌వ‌న్ వ‌ద్ద కాటా శ్రీ‌నివాస్ అనుచ‌రులు గొడ‌వ చేశారు. కాంగ్రెస్ పెద్ద‌ల‌ను నిలదీశారు. దీంతో కాంగ్రెస్ పున‌రాలోచ‌న‌లో ప‌డింది. దీంతో ప‌టాన్‌చెరు అభ్య‌ర్థి నీలం మ‌ధుకు బీ ఫామ్ ఇవ్వ‌కుండా పెండింగ్‌లో పెట్టారు.

గురువారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన తుది జాబితాలో మ‌ధుకు బ‌దులు కాటా శ్రీ‌నివాస్ పేరు చోటు చేసుకుంది. దీన్ని అవ‌మానంగా భావించిన నీలం చివ‌రికి బీఎస్పీలో చేరి ఆ పార్టీ బీ ఫామ్‌ను ద‌క్కించుకున్నారు. ఎట్ట‌కేల‌కు ప‌టాన్‌చెరు నుంచి అనూహ్యంగా బీఎస్పీ త‌ర‌పున నీలం మ‌ధు బ‌రిలో నిలిచారు. త‌న అనుచ‌రుల‌తో క‌లిసి భారీ ర్యాలీగా వెళ్లి ఆయ‌న శుక్ర‌వారం నామినేష‌న్ వేశారు.