ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సొంత పార్టీ నేతల నుంచే పురందేశ్వరికి మద్దతు కొరవడటంతో ఆమెకు బీజేపీలో అంత సీన్ లేదనే సంకేతాలు వెలువడ్డాయి. మరోవైపు పురందేశ్వరికి సంబంధించిన సమాచారాన్ని వైసీపీకి బీజేపీ ఢిల్లీ పెద్దలే చేరవేస్తున్నారని సమాచారం.
విమానయాన సంస్థలో పురందేశ్వరి అవినీతికి పాల్పడిన విషయాన్ని ఢిల్లీ బీజేపీ పెద్దలే ఆధారాలతో సహా వైసీపీ నేతలకు ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పురందేశ్వరిపై వైసీపీ విమర్శల తీవ్రతను రోజురోజుకూ పెంచుతోంది.
మంత్రి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ పురందేశ్వరి, టీడీపీ , జనసేన నేతలపై విరుచుకుపడ్డారు. పురందేశ్వరి చంద్రముఖిగా మారారని విమర్శించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు పోయిన గౌరవం , పురందేశ్వరి కాంగ్రెస్‌లో చేరినప్పుడు వచ్చిందని మంత్రి చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ గౌరవం పోవడంతో పాటు బీజేపీలో కూడా ఆమెకు మద్దతు లేదన్నారు.
సొంత పార్టీలో కూడా మద్దతు కొరవడినప్పుడు ఇంకా ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి కొనసాగడం ఎందుకని మంత్రి ప్రశ్నించారు. టీడీపీలో చేరిపోతుంది కదా అని పురందేశ్వరికి ఆయన ఉచిత సలహా ఇచ్చారు. అలాగే పురందేశ్వరిపై మంత్రి ఘాటు కామెంట్స్ చేశారు. ప్రతిరోజూ పురందేశ్వరి మద్యం బ్రాండ్లను రుచి చూస్తున్నారేమో అని వ్యంగ్యంగా అన్నారు. తనకు మద్యం తాగే అలవాటు లేదని ఆయన అన్నారు. జనసేన కార్యకర్తలకు రేటు కట్టి టీడీపీకి పవన్‌కల్యాణ్ అమ్ముకున్నారని విమర్శించారు.