ఇటీవల గచ్చిబౌలిలో సీబీఎన్ కృతజ్ఞత సభను విజయవంతం చేయడాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్-చంద్రబాబు కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో గెట్ టు గెదర్ నిర్వహించారు. సీబీఎన్ కృతజ్ఞత సభకు లక్ష మంది వస్తారని నిర్వాహకులు ప్రచారం చేసినప్పటికీ, ఆ స్థాయిలో రాకపోయినా, సభ మాత్రం సక్సెస్ అయ్యింది. ఈ సభ సక్సెస్ కావడానికి ప్రత్యేకంగా చంద్రబాబు సామాజిక వర్గీయులే కారణం కాదు.
అన్ని కులాలు, మతాలకు చెందిన ఐటీ నిపుణులు, టీడీపీ సానుభూతిపరులు సభకు హాజరు కావడం వల్లే నిండుదనం కనిపించింది. అలాగే సభలో దళిత నాయకులైన కొలికపూడి శ్రీనివాస్‌రావు, బాలకోటయ్య, రాజేశ్ తదితరులు ప్రసంగిస్తూ చంద్రబాబు గొప్పతనం గురించి చెప్పారు. చంద్రబాబుకు రాజకీయంగా ప్రయోజనం కలిగించాలంటే ఇలాంటి సభల్లో పాల్గొనడం ముఖ్యం కాదని, పల్లెలకు వెళ్లి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని కొలికపూడి ఆవేశంగా విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబుపై ఇంతగా ప్రేమాభిమానులను కురిపించిన దళిత, బీసీ నాయకులను చంద్రబాబు సామాజిక వర్గం కేవలం కరివేపాకులా వాడుకుంటుందనే చర్చకు దారితీసిన ఘటన ఇది. సీబీఎన్ కృతజ్ఞత సభ విజయవంతంలో కేవలం బాబు సామాజిక వర్గం పాత్ర లేదని, అందరూ కృషి చేయడం వల్లే టీడీపీలో జోష్ నింపిందని …దళిత, బీసీ నాయకులు అంటున్నారు. కానీ సబ్ సక్సెస్ చేసిన వారితో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మినహా మరే ఇతర కులాలు, మతాల వారిని పిలవలేదని దళిత, బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేవలం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే నారా-నందమూరి కుటుంబ సభ్యులు ఆహ్వానించి, సంతోషాన్ని పంచుకున్నారని వారు మండిపడుతున్నారు. అంటే అధికారాన్ని అనుభవించడానికి మాత్రం కమ్మ వాళ్లు, వారి పల్లకీలు మోయడానికి మాత్రమే తాము పనికి వస్తామా? అని వారు నిలదీస్తున్నారు. అధికారం రాకనే ఇట్లా వుంటే, రేపు వస్తే ఎలా వుంటుందో అప్పుటే ట్రైలర్ చూపుతున్నారని దళిత, బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ కోసం కేవలం కమ్మ వాళ్లు మాత్రమే కాదని, బోలెడంత మంది రెడ్డి, దళిత, బీసీ, ముస్లిం నాయకులు మీడియా, ఇతరత్రా వేదికపై గొంతు చించుకుంటున్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటి వారిలో ఏ ఒక్కరినీ గచ్చిబౌలి సభ సక్సెస్ మీట్‌కు ఆహ్వానించకపోవడంపై టీడీపీ సానుభూతిపరులైన బహుజన నేతలు ఆగ్రహంగా ఉన్నారు.