తెలంగాణలో జనసేన పోటీ చేసే సీట్లపై ముఖ్యంగా టీడీపీలో టెన్షన్ వుండింది. 32 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించిన జనసేనాని పవన్‌కల్యాణ్… చివరికి 8 సీట్లతో సరిపెట్టుకున్నారు. వీటిలో కూడా అప్పటికప్పుడు బీజేపీ నుంచి చేరిన ఇద్దరికి ఇవ్వడం విశేషం. అంటే జనసేన 6 సీట్లలో పోటీ చేస్తున్నట్టైంది. తెలంగాణలో జనసేన అడుగుల్ని, పవన్‌కల్యాణ్ వ్యూహాన్ని టీడీపీ జాగ్రత్తగా గమనిస్తూ వచ్చింది.
జనసేన రాజకీయ పంథాను చూసి టీడీపీ నేతలు మనసుల్లోనే పడిపడి నవ్వుకుంటున్నారు. బహిరంగ సభల్లో పవన్‌కల్యాణ్ పులిలా గాండ్రిస్తుంటారని, కెమెరా , మైకు లేకపోతే ఆయన పిల్లే అని అర్థమవుతోందని టీడీపీ నేతలు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో అనే చర్చ కొన్ని రోజులుగా జరుగుతోంది. గౌరవప్రదమైన సీట్లు ఇవ్వకపోతే జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని పవన్‌కల్యాణ్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే గౌరవప్రదమైన సీట్లు అంటే ఎన్ని అనే ప్రశ్న టీడీపీని సైతం వెంటాడేది. ఇప్పుడు జనసేనకు సంబంధించి టీడీపీలో టెన్షన్ పోయింది. జనసేన పైకి మాత్రం పెద్ద సంఖ్యలో అడిగినట్టు షో చేస్తారని, తాము ఎన్ని ఇచ్చినా తల ఊపుతారనే క్లారిటీకి టీడీపీ నేతలు వచ్చారు. భీమవరంలో తాను, తెనాలిలో నాదెండ్ల మనోహర్ సీట్లకు సంబంధించి టీడీపీ నుంచి పవన్ భరోసా పొందారు. ఇక మిగిలిన సీట్ల సంగతి టీడీపీనే చూసుకుంటుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
ఇంత కాలం పవన్‌కల్యాణ్ కనీసం 40 సీట్లైనా డిమాండ్ చేస్తారనే భయం టీడీపీని వెంటాడేది. 25-30 సీట్లైనా జనసేనకు ఇవ్వాల్సి వస్తుందని, తమ నేతలకు ఎలా సర్ది చెప్పుకోవాలో అని టీడీపీ నేతలు తెగ బాధపడేవారు. ఇప్పుడు అలాంటి బాధ, భయం టీడీపీలో మచ్చుకైనా లేవు. 10 లేదా 15 సీట్లకు మించి జనసేనకు ఇచ్చే ప్రశ్నే లేదని టీడీపీ నేతలు అంటున్నారు.
ఎందుకంటే పవన్‌కల్యాణ్‌కు రాజకీయంగా బేరాలు ఆడడం తెలియదని తెలంగాణలో ఆయన అనుసరించిన విధానం చెప్పకనే చెబుతోందని టీడీపీ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే తమ వాళ్లనే జనసేనలోకి పంపి.. తెలంగాణలో బీజేపీ నేతలకు టికెట్లు ఇప్పించినట్టు ఇస్తామని టీడీపీ నేతలు బాహాటంగానే వెల్లడించడం గమనార్హం.