తెలంగాణలో బీజేపీ మరింత భ్రష్టు పట్టేలా ఆ పార్టీ చర్యలున్నాయి. తెలంగాణలో అధికారం చెలాయిస్తున్న బీఆర్ఎస్ నేతల ఇళ్లపై కాకుండా ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు చేయడం కలకలం రేపుతోంది. గురువారం తెల్లవారుజామున ఖమ్మంలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి నివాసంలో ఐటీ దాడులకు తెగబడింది.
మూడు రోజుల క్రితం పొంగులేటి ఆందోళన వెల్లడించినట్టే జరుగుతోంది. హైదరాబాద్‌తో పాటు ఖమ్మంలో పొంగులేటి నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం పొంగులేటి నామినేషన్ వేయనున్నారు. ఈ విషయం తెలిసే ఐటీ అధికారులు ఆయన్ను డిస్ట్రబ్ చేయడానికి ఐటీ దాడులు చేస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
తనపై కూడా ఐటీ అధికారులు దాడులు చేసే అవకాశం వుందని, అయితే ఇలాంటి వాటికి భయపడేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. పొంగులేటి ప్రకటించినట్టుగానే అధికార పార్టీ నేతల్ని విడిచి, వరుసగా కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనేందుకు ఐటీ, సీబీఐ దాడులే నిదర్శనమనే ప్రచారానికి ఇలాంటివి మరింత బలం కలిగిస్తున్నాయి.
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ సాగుతోంది. బీజేపీ ఉనికిలో లేకుండా పోయింది. ఏదో మొక్కుబడిగా పోటీలో ఉందంటే ఉందనే రీతిలో ఉనికి కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల్ని భయకంపితుల్ని చేయడానికి కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
ఇలాంటి చర్యలు బీఆర్ఎస్, బీజేపీకి రాజకీయంగా నష్టం తెచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా వుండగా నామినేషన్‌కు సిద్ధమవుతున్న పొంగులేటి కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.