ఇంకెన్నాళ్లీ ఫేక్ రాజకీయాలు చంద్రబాబు?

ప్రపంచం ఎంత అప్డేట్ అవుతున్నా తెలుగుదేశం అధినాయకత్వం మాత్రం అస్సలు అప్డేట్ కావట్లేదు. తనకు తెలిసిందే రాజకీయం, తాను వేసేదే ఎత్తు అనుకుని ఎప్పటికప్పుడు బురదగుంటలో పడడం తప్ప ఒక్కటంటే ఒక్కసారి కూడా తెలివైనవాడిగా…

ప్రపంచం ఎంత అప్డేట్ అవుతున్నా తెలుగుదేశం అధినాయకత్వం మాత్రం అస్సలు అప్డేట్ కావట్లేదు. తనకు తెలిసిందే రాజకీయం, తాను వేసేదే ఎత్తు అనుకుని ఎప్పటికప్పుడు బురదగుంటలో పడడం తప్ప ఒక్కటంటే ఒక్కసారి కూడా తెలివైనవాడిగా కనిపించలేకపోతున్నారు చంద్రబాబు. 

ఈయన సంగతి ఎలా ఉన్నా అమితమైన ఆత్రంతో తెదేపాని భ్రష్టు పట్టించడానికి సానుకూల మీడియా నిర్విరామంగా కృషి చేస్తోంది. ఈ అనుకూల మీడియాకి త్వరగా చంద్రబాబుని మళ్లీ సీయం పీఠంపై చూసేసుకోవాలి. అది తప్ప మరొక యావ లేదు. తప్పులేదు. ఎవరి అవసరాలు వారివి. 

అయితే ఆ యావలో భయంకరమైన ట్రోలింగ్ కి గురయ్యే పనులే ఎక్కువగా చేస్తున్నారు. జనం వెర్రిగొర్రెలన్న చందాన వార్తలు చెప్పుకుపోతున్నారు. అయితే ఆ వార్తలకి చంద్రబాబు వంత పాడడం లేదా ఆయన ఏదైనా పిట్టలదొర కబురు చెబితే దానికి ఈ పచ్చ మీడియా వంత పాడడం..ఇదే తంతు. 

మొన్నటికి మొన్న ఇండియా టుడే సి-వోటర్ సర్వేలో ఏపీలో తెదేపా 16 ఎంపీ స్థానాలు గెలుస్తుందని చెప్పారంటూ తెదేపా అనుకూల మీడియా టముకు వేసింది. వెతికితే ఎక్కడా ఆ వార్త స్పష్టంగా కనపడలేదు. సీ వోటర్ ని నేరుగా సంప్రదిస్తే అసలు తాము ఏపీలో సర్వే చేయనేలేదని, ప్రచారమవుతున్నదంతా ఫేక్ అని తేల్చారు. 

ఇంతకీ సీ వోటర్ ఏ సర్వే చేయకుండా కేవలం డ్రాయింగ్ రూం లెక్కల ప్రకారం అనుకున్నదేమిటో చెప్పారు. పొత్తుల్ని బట్టి 10-15 సీట్లు అటు ఇటు అవ్వొచ్చు అన్న విషయం మాత్రమే చెప్పారు. ఎవరెవరి మధ్యన పొత్తులు? సీట్లు అటు ఇటు అయ్యేదీ ఎవరి మధ్యన..వంటివేమీ వెల్లడించలేదు. ఏ పార్టీ పేరు ప్రస్తావించలేదు కూడా. అంతే ఈ గ్యాపులో పచ్చమీడియాలు వార్త వండి వార్చేసాయి. 

పాపం నిజమనుకున్న చంద్రబాబు దీనినే పట్టుకుని చాటింపేస్తున్నారు. ఆఖరికి స్వయానా సీ-వోటర్ సర్వే వాళ్లే అదంతా ఫేక్ వార్త అని పక్క దేశానికి వినిపించేటంత గట్టిగా అరుస్తున్నా కూడా చంద్రబాబు చెవులకి వినిపించడంలేదు. 

ఒక అబద్ధాన్ని నిజమని మనసా వాచా నమ్మి, దానినే వందసార్లు చెప్పి జనాన్ని నమ్మించడమనే పద్ధతి తెదేపాది. చంద్రబాబు హయాములో జరుగుతున్నదే అది. ఇప్పటికీ అదే. అప్పుడంటే మీడియా విస్తృతంగా లేక చెల్లింది. ఇప్పుడలా కాదు కదా. బట్టబయలవుతోంది. 

బట్టబయలంటే గుర్తొచ్చింది. చినబాబు లోకేష్ మాట్లాడితే బట్టలూడదీస్తా, కడ్రాయర్ మీద నిలబెడతా అంటున్నాడు. అతని లాంగ్వేజ్ కి, బాడీ లాంగ్వేజ్ కి, ఉన్న పొస్జిషన్ కి ఆ డైలాగులు అస్సలు సూటవ్వట్లేదు. అందుకే అధికార పార్టీ మనుషులు జోకులేస్తున్నారు….బట్టలిప్పి చూడాలని అంత సరదా ఏంటని. 

ఈ తరహా అరుపులు “తాట తీస్తా” అంటూ పవన్ కళ్యాణ్ కూడా అరుస్తుంటాడు. వీళ్లని చూసి చంద్రబాబు కూడా ఈ మధ్యన మొదలు పెట్టారు. పార్టీ అధ్యక్షులయ్యుండి ఈ భాష ఏమిటో అర్ధం కాదు. అధికార పక్షంలో కూడా ఇలాంటి భాష మాట్లాడే నాయకులున్నారు. కానీ పార్టీ అధ్యక్షుడు ఆ భాషకి దిగజారలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. 

లోకేషైనా, చంద్రబాబైనా, పవనైనా తమ వ్యక్తిగత ప్రత్యర్థి జగన్ మోహన్ రెడ్డి అన్నట్టుగా బిహేవ్ చెయ్యాలి కానీ దిగజారుడు భాషతో తమ ప్రత్యర్థి కొడాలి నానీ అన్నట్టుగా ఉండకూడదు కదా! అయినా నానిని కడ్రాయర్ మీద ఊరేగిస్తా అని అన్నాక అతను ఊరుకుంటాడా? బూతుపంచాంగం విప్పి తుప్పొదలకొడతాడు. ఆ స్థాయి నేలబారు భాషలో లోకేషైనా, చంద్రాబాబైనా, పవనైనా నానీతో పోటీబడి నెగ్గలేరు. నెగ్గాలని అనుకోకూడదు కూడా. అది వాళ్ల స్థాయి కాదు. ఈ విషయం ముందు వాళ్లు నమ్మినప్పుడే జనం కూడా నమ్ముతారు. లేకపోతే ఈ ముగ్గురిదీ కొడాలి నానీ స్థాయే అని మానసికంగా ఫిక్స్ అయిపోతారు. 

అదలా ఉంచి ఫేక్ సర్వేల విషయానికొస్తే, అసలు నెషనల్ సర్వేలన్నీ ఒకరకంగా అనుమానించాల్సినవే. ఎందుకంటే వీళ్ల ఫోకస్ ఎక్కువగా నగరాల మీదే ఉంటుంది. శాంపిల్ సైజ్ అక్కడే తీసుకుంటారు. కానీ ఎక్కువ సంఖ్యలో ఓటర్స్ గ్రామాల్లో ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రౌండ్ రియాలిటీ ఏంటని తెలుసుకోవాలంటే ఆ గ్రాస్ రూట్ లెవిల్ కి వెళ్లి సర్వే చెయ్యాలి. అదంత ఈజీ కాదు. అందుకే 2019లో కూడా జాతీయ స్థాయి సర్వేల్లో ఎక్కడా కూడా వైకాపాకి 151 వస్తాయని చెప్పలేదు. ఆమాటకొస్తే రాష్ట్ర స్థాయి సర్వేల్లో కూడా ఆ సంఖ్యకి అటు ఇటుగా ఒక్కరు కూడా చెప్పలేదు. దానికి కారణం గ్రాస్ రూట్ లెవెల్లో సర్వె చేయలేకపోవడమే. 

ప్రస్తుతానికి ప్రభుత్వ వ్యతిరేకత ఆ.ప్ర లో ఏమన్నా ఉందా అంటే ఒక స్థాయిలో నగరాల్లోనూ, పట్టణాల్లోనూ ఉన్నమాట వాస్తవం. అయితే అది ఎంత వరకు ఉంది? ఓట్ల వరకే ప్రభావం చూపుతుందా లేక సీట్ల వరకు వెళుతుందా అనేది వేరే విషయం. ఇదిలా ఉంటే గ్రామాల్లోనూ, కుగ్రామాల్లోనూ వైకాపాపై ఓటర్ల అభిప్రాయమెలా ఉందని చూస్తే ఇప్పటికీ ఆ పార్టీ యొక్క కంచుకోట చెదరలేదనే అనిపిస్తుంది. 

కనుక కళ్లు మూసుకుని సర్వేల్ని నమ్మేయాల్సిన అవసరం లేదు. కానీ తెదేపా మరో మార్గం లేదన్నట్టుగా ఎప్పటికప్పుడు తిమ్మిని బమ్మి చేయడానికే ఆసక్తి చూపుతోంది. 

ఫేక్ సర్వేల్ని అడ్డం పెటుకుని కాలక్షేపం చేయడం, వ్యక్తిగతమైన ఎన్.టి.ఆర్ కాయిన్ లాంచింగ్ వేడుకని అదేదో కేంద్ర ప్రభుత్వం జరుపున్న వేడుకగా బిల్డప్ ఇచ్చి ఏమార్చడం, భాజపా అధ్యక్షుడు నడ్డాతో చంద్రబాబు ఫొటోల్ని మీడియాకి విడుదల చేసి ఏదో జరిగిపోతోందని చెప్పి మోసం చేయడం…ఇవన్నీ పార్టీకి డ్యామేజ్ చేసేవే తప్ప బలం చేకూర్చేవి కానే కావు. 

అన్నట్టు రాష్ట్రపతి భవనంలో జరిగిన ఒక సంగతి చూడండి. స్వయంగా సీయం రమేష్ చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. రాష్ట్రపతి భవనంలో తాము కూర్చున్న హాలుకి సెల్ ఫోన్స్ అనుమతి లేదని, తాను మాత్రం తెచ్చానని, దాంతోటే నడ్డాతో చంద్రబాబు కూర్చున్న రెండు మూడు ఫోటోలు తీయించానని, తన గ్రూపులో ఒక పెద్దమనిషి సలహా మేరకు తాను ఆ ఫోటోలని మీడియాకు లీక్ చేసానని చెప్పారు రమేష్. 

ఇది నిజమైతే ఎంత పెద్ద నేరం? ఈ చేష్టలు ఏ తెదేపా కార్యాలయంలోనో అయితే పర్వాలేదు. ఏకంగా రాష్ట్రపతి భవన్ లో ఇలాంటి అనుమతి లేని పనులు చేయొచ్చా? చేసి మళ్లీ సిగ్గు లేకుండా మీడియాలో అదేదో ఘనకార్యం కింద చాటుకోవచ్చా? 

ఈ ఫోటోల్ని లీకు చేసి ఏం సాధిద్దామని? తెదేపాకి, భాజపాకి మధ్యన పొత్తు ఖారారైపోతోందని జనాన్ని నమ్మించడానికే కదా! గతంలో సొంత మీడియా ఒక్కటే ఉండేది కాబట్టి జనం చచ్చినట్టు నమ్మేవాళ్లు. ఇప్పుడెన్ని మీడియాలున్నాయి బాబుగారు? సోషల్ మీడియాల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే లెక్కేయడం ఎవరి తరం కాదు. 

అయినా ఈ పనులన్నీ క్యాడర్ ని బలోపేతం చేయడానికే అనుకుందాం. కానీ ఎక్కడ? మరుసటి రోజే అంతా ఫేక్ అని తేలిపోతోంది కదా? కనుక ఈ చర్యలవల్ల క్యాడర్ ఉత్సాహం పొందడం మాట అటుంచి పూర్తి అపనమ్మకంతో చతికలపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. 

ఎంత ప్రయత్నించినా భాజపా తెదేపాతో కలవదని చిన్నపిల్లవాడికి కూడా తెలుసు. అయినప్పటికీ అదే మాడిపోయిన మసాలా దోశని అటు ఇటు తిప్పడం అమాయకత్వం తప్ప మరొకటి కాదు. 

ఇక్కడ తెలీకుండా మరో పెద్ద తప్పు జరిగిపోతోంది. ఎంత సేపూ “భాజపాతో పొత్తు- భాజపాతో పొత్తు” అని ఆ పార్టీ చుట్టూ తిరుగుతుంటే తెదేపాని అంటిపెట్టుకుని ఉన్న కొద్దిపాటి మైనారిటీలు, దళితులు కూడా దూరమౌతున్నారు. అసలా దిశగా ఆలోచనే లేదేమిటో! కురవని మేఘం కోసం జపం చేస్తూ, సగం నీళ్లున్న బిందెకి చిల్లుపడిందన్న విషయాన్ని గ్రహించడంలేదు తెదేపా వాళ్లు.  

ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని రానున్న 9 నెలల్లో సత్యాన్ని పట్టుకుని కూర్చుంటే ఆశించిన ఫలితానికి దగ్గరగా వెళ్లొచ్చు. లేకపోతే అంతే సంగతులు. 

హరగోపాల్ సూరపనేని