చంద్రయాన్ సక్సెస్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో నెటిజన్లు కూడా స్పందిస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు.
ప్రత్యేకించి చంద్రయాన్ 3 మూన్ మీద ల్యాండ్ అయిన వేళ ఒకవైపు ల్యాండర్ వీడియోలు, మరోవైపు మోడీ వీడియోను పెట్టి ప్రసారం చేసిన వైనం భక్తులకు కనువిందులా ఉన్నా, సామాన్య జనం మాత్రం ఓవర్ అయ్యిందనే అంటున్నారు. ఒకవేళ 2011 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ సమయంలో మోడీ ప్రధానిగా ఉంటే, ధోనీ విన్నింగ్ షాట్ కొట్టే సమయానికి లైవ్ లో క్రికెట్ సగం, మోడీ ని సగం చూపే వాళ్లు అని నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
ఆ సంగతలా ఉంటే.. చంద్రయాన్ 3 విజయవంతంపై ఇస్రో సైంటిస్ట్ లను అభినందించడానికి బెంగళూరు వెళ్లిన మోడీ ప్రొటోకాల్ ను విస్మరించారని కాంగ్రెస్ అంటోంది. బెంగళూరుకు వెళ్లిన మోడీ ఆ సమయంలో కావాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను, డిప్యూటీ సీఎం డికే శివకుమార్‌ను అవాయిడ్ చేశారని కాంగ్రెస్ అంటోంది.
ప్రొటోకాల్ ప్రకారం.. పీఎంను రిసీవ్ చేసుకోవడానికి వారికి సమాచారం ఇవ్వాలి. అయితే మోడీ వారు తనను రిసీవ్ చేసుకుంటే.. ఎక్కడ వారు తనతో పాటు సైంటిస్టుల వద్దకు వస్తారో అని గవర్నర్ కు మాత్రమే సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
గతంలో ఎస్ఎల్వీ-3-డీ2 విజయవంతం అయినప్పుడు శాస్త్రవేత్తలను అభినందించడానికి నాటి ప్రధాని ఇందిర వెళ్లారు. ఆ సమయంలో ఆమెతో పాటు శ్రీహరి కోటకు నాటి ఏపీ సీఎం ఎన్టీఆర్ కు కూడా ఆహ్వానం అందిందని జైరాం పాత ఫొటోలను షేర్ చేశారు.
పొలిటికల్ రైవలరీ అయినప్పటికీ.. ప్రొటోకాల్ ప్రకారం ఎన్టీఆర్ తో కలిసి ఇందిర శ్రీహరికోటకు వెళ్లారని అందుకు సంబంధించిన ఫొటోలను జైరాం పోస్ట్ చేశారు. అయితే మోడీ మాత్రం.. తన తీరును చాటుకున్నారన్నట్టుగా కాంగ్రెస్ నేత ధ్వజమెత్తారు!