లోక్ సభకు కాస్త ముందుగానే ఎన్నికలను నిర్వహించాలని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సర్కారు ఆలోచిస్తోందనే టాక్ కొన్నాళ్ల నుంచి వినిపిస్తూనే ఉంది. ఈ మేరకు బీజేపీ అన్ని సాధ్యాసాధ్యాలనూ పరిశీలిస్తోందనే ప్రచారం జరుగుతూ ఉంది. కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో.. వాటితో పాటే లోక్ సభకు కూడా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు కేంద్రం సమాయత్తం అవుతోందని ప్రచారం జరుగుతోంది.
ఇలాంటి నేపథ్యంలో… విపక్ష నేతలు కూడా ఇదే విషయాన్ని తమ కార్యకర్తలకు గట్టిగా చెబుతున్నారు. డిసెంబర్ లేదా జనవరి నెలల్లోనే లోక్ సభ ఎన్నికలు జరగడం ఖాయమంటూ వారు చెబుతున్నారు. ఇలా చెబుతున్న వారిలో జేడీయూ నేత నితీష్ కుమార్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ముందు వరసలో ఉన్నారు. ఈ ఏడాది డిసెంబర్ లోనే ఎన్నికలు జరగవచ్చని నితీష్ కుమార్ మరోసారి వ్యాఖ్యానించారు. గత కొన్నాళ్లుగా ఆయన ఈ అంచనాలను వ్యక్తం చేస్తున్నారు.
మమతా బెనర్జీ అయితే.. బీజేపీ ఎన్నికలకు పూర్తి సిద్ధం అయ్యిందని చెబుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్, వచ్చే ఏడాది జనవరి నెలలకు గానూ బీజేపీ ఇప్పటికే హెలీకాప్టర్లను కూడా బుక్ చేసుకుందని మమత అంటున్నారు.
ఎన్నికల ప్రచారానికి హెలీకాప్టర్ల అవసరం దృష్ట్యా.. అందుబాటులో ఉన్న అన్ని హెలీకాప్టర్లనూ బీజేపీ బుక్ చేసుకుంటోందని మమత అంటున్నారు. ఆ నెలల్లో ఎవరికీ హెలీకాప్టర్లు అందుబాటులో లేకుండా బీజేపీ నేతలే అన్నింటినీ బుక్ చేసేసుకుంటున్నారని మమత చెబుతున్నారు. ఇలా బీజేపీ ఎన్నికల ప్రచార ఏర్పాట్లను చేసుకుంటోందని.. కాబట్టి ఎన్నికలను ఎదుర్కొనడానికి రెడీగా ఉండాలంటూ ఆమె తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు!
మరోవైపు ధరల నియంత్రణ అంటూ మోడీ ప్రభుత్వం చర్చను పెడుతోంది. నిత్యావసరాల ధరలను కట్టడి చేయడానికి ప్రయత్నాలు అంటోంది. గ్యాస్ సిలెండర్ రేటును రెండు వందల రూపాయల మేర తగ్గించింది. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలను కూడా స్వల్పంగా తగ్గించబోతున్నారట! ఇదంతా ఎన్నికల ప్రిపరేషన్ అనడంలో అయితే ఆశ్చర్యం లేదు!