పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో అక్కడి ప్రభుత్వం ఆటాడుకుంటోంది! ఒక కేసులో ఆయనకు కోర్టు ఊరటను ఇచ్చి, జైలు నుంచి విడుదల చేసిన కొన్ని గంటల్లోనే మరో కేసులో ఇమ్రాన్ ను అరెస్టు చేసి జైలుకు తరలించడం గమనార్హం!
ప్రధానిగా ఉన్న రోజుల్లో తనకు వచ్చిన కానుకలను అమ్ముకున్నారనే ఆరోపణలతో ఇమ్రాన్ ఖాన్ పై పాక్ ప్రభుత్వం కేసులు పెట్టింది. ఆ కేసుల్లో అతడికి మూడేళ్ల జైలు శిక్షను విధించింది కింది కోర్టు. అంతే కాదు.. ఐదేళ్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వీల్లేదుపో అంటూ ఈ పాక్ అలనాటి ధిగ్గజ క్రికెటర్ కు శిక్ష విధించింది! ఆ కేసులో ఇమ్రాన్ ఖాన్ ను ఆగస్టు ఐదో తేదీన అరెస్టు చేశారు.
అయితే ట్రయల్ కోర్టు తీర్పుపై పై కోర్టును ఆశ్రయించాడు ఇమ్రాన్ ఖాన్. అక్కడ అతడికి ఊరట లభించింది. అతడి మూడేళ్ల జైలు శిక్షను కోర్టు రద్దు చేసింది. అయితే ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిషేధంపై కోర్టు ఇంకా స్పందించలేదు. జైలు శిక్ష రద్దు కావడంతో ఇమ్రాన్ విడుదలయ్యాడు. అయితే పదవీ కాలంలోనే దుర్వినియోగం అంటూ మరో కేసులో ఇమ్రాన్ ను ప్రభుత్వం అరెస్టు చేయించింది.
ఇది కూడా కానుకల తరహా కేసే. ప్రధానిగా ఉన్న రోజుల్లో ఇమ్రాన్ ఖాన్ కాన్ఫిడెన్షియల్ డిప్లొమాటిక్ కేబుల్ ను దుర్వినియోగ పరిచాడట. ప్రభుత్వ పనుల మీద వాడాల్సిన దీన్ని పార్టీ పనుల మీద వాడాడట. ఈ మేరకు కేసు నమోదు చేసి ఇమ్రాన్ ను అరెస్టు చేశారు. మరి ఒక కేసులో అలా బయటకు రాగానే మరో కేసులో ఇమ్రాన్ ను అరెస్టు చేసిన వైనం.. అతడికి పాక్ ప్రభుత్వం, సైన్యం ఊరటను ఇవ్వదని స్పష్టం అవుతోంది. ఈ సారి విడుదల అయినప్పుడు ఏ దుబాయ్ కో, లండన్ కు పారిపోతే తప్ప 70 యేళ్ల ఇమ్రాన్ కు సుఖముండదేమో!