ట్రైలర్‌లో లేనిది చాలా వుంది

తన సినిమాల ట్రైలర్‌లు అన్నీ స్టార్టింగ్.. మిడ్.. ఎండ్ అన్నట్లే వుంటాయని, కానీ దాని వెనుక ఎమోషన్లు, ఇంకా చాలా వుంటాయని ద‌ర్శ‌కుడు శివనిర్వాణ అన్నారు. ఈవారం విడుదల కాబోతున్న ఖుషీ సినిమాలో కూడా…

తన సినిమాల ట్రైలర్‌లు అన్నీ స్టార్టింగ్.. మిడ్.. ఎండ్ అన్నట్లే వుంటాయని, కానీ దాని వెనుక ఎమోషన్లు, ఇంకా చాలా వుంటాయని ద‌ర్శ‌కుడు శివనిర్వాణ అన్నారు. ఈవారం విడుదల కాబోతున్న ఖుషీ సినిమాలో కూడా ట్రైలర్‌లో చూపించని లేయర్లు చాలా వున్నాయన్నారు. కేవలం ఎమోషన్లు మాత్రమే కాకుండా, ఎంటర్ టైన్ మెంట్ కీలకంగా వుంటుందన్నారు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణలతో విజయ్ దేవరకొండ కాంబినేషన్ సీన్లు చాలా బాగా అలరిస్తాయన్నారు.

సమంత-విజయల జోడీ చాలా పెర్ ఫెక్ట్ గా వుంటుందని, సినిమాలో కాశ్మీర్ ఎపిసోడ్ తొలి సగంలో మూడు వంతులు వుంటుందన్నారు. కేవలం తన స్టయిల్ ఎమోషన్లు మాత్రమే కాదు, ఫన్ కూడా వుంటుందన్నారు. ఈ సినిమాలోకి సమంతను తీసుకోవాలన్న ఐడియా నిర్మాత నవీన్ గారిది అని చెప్పారు. అదే ఇప్పుడు సినిమాకు పెద్ద అసెట్ అయిందన్నారు.

ఖుషీ సినిమాకు మరే సినిమా కథతోనూ పోలిక లేదని, ఆ మాటకు వస్తే ప్రతి సినిమాకు, ప్రతి సీన్ కు ఏదో ఒక రిఫరెన్స్ గుర్తుకు రావడం అన్నది కామన్ అన్నారు. ట్రీట్ మెంట్ కొత్తగా వుందా లేదా అన్నది చూడాలన్నారు. ఆ ట్రీట్ మెంట్ తోనే ఆడియన్స్ ను ఆకట్టుకుంటామన్నారు. ఈ సినిమా గురించి సమంత చాలా తపన పడ్డారని, తరువాత ఏమవుతుందో తెలియదు కానీ ఈ సినిమా మాత్రం పూర్తి చేసి తీరుతా అని పదే పదే సమంత అన్నారని శివ చెప్పారు.

సినిమా ఫైనల్ కాపీ తనతో పాటు నిర్మాతలు కూడా చూసారని, ఫుల్ హ్యాపీగా వున్నారని శివనిర్వాణ తెలిపారు. మైత్రీ మూవీస్ తో సినిమా చేయడం చాలా కంఫర్ట్ గా వుంటుందని అన్నారు. చైతన్యతో సినిమా సెట్ అయిందని, ఇంకా స్క్రిప్ట్ రెడీ కావాలని వెల్లడించారు. ఈసారి ఇప్పటి వరకు చేసిన లవ్, రోమ్ కామ్ జానర్లు కాకుండా కొత్తగా ట్రయ్ చేయబోతున్నా అన్నారు.