జాక్సన్విల్లీ సిటీ (ఫ్లోరిడా)లో 6 నెలలు అతిథిగా వున్నాను. డబ్బులు, ఏజ్ ప్రూప్, ఐడీకార్డు వుంటే చాక్లెట్లు కొన్నంత సులభంగా అమెరికాలో గన్ కొనచ్చు. మనకి ఇక్కడ బట్టల షాపుల హోర్డింగులలా గన్స్ యాడ్స్ కనిపిస్తుంటాయి. గన్ని తాకట్టు పెట్టుకునే షాపులు కూడా వుంటాయి. గన్ కల్చర్‌లో అమాయకుల నెత్తుటితో తడవని నగరమే లేదు.
ఒర్లాండ్ సిటీకి వెళితే మా అబ్బాయి ఒక బిల్డింగ్ చూపించాడు. అదో నైట్ క్లబ్. 2016 జూన్ 12వ తేదీ సరిగ్గా ఆరేళ్ల క్రితం ఒక ఉన్మాది 49 మందిని అకారణంగా కాల్చేసాడు. టంపాసిటీలో మేము వెళ్లడానికి కొద్ది రోజుల ముందు గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. జాక్సన్‌విల్లీలో ఒక పబ్ వద్ద ఇద్దరు కుర్రాళ్లు ఒకర్నొకరు కాల్చుకున్నారు.
విషాదం ఏమంటే రెండు దశాబ్దాల కాలంలో తుపాకీ కాల్పులు, సుసైడ్లతో చనిపోయిన పిల్లల (5 నుంచి 18 ఏళ్ల వయసు) సంఖ్య 42507. ఇదే 20 ఏళ్లలో చనిపోయిన డ్యూటీ పోలీస్ ఆఫీసర్ల సంఖ్య కంటే ఇది చాలా ఎక్కువ. 33 కోట్ల జనాభా వుంటే 39 కోట్ల తుపాకులున్నాయి. అంటే ప్రతి వంద మందికి 120 తుపాకులున్నాయి.
అమెరికా రాజ్యాంగంలోని రెండవ సవరణతో తుపాకీ హక్కు లభించింది. ఆ హక్కుపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోడానికి వీలు లేదు. దాంతో గన్ తయారీ చాలా పెద్ద వ్యాపారంగా మారింది. 2019 నుంచి కొత్తగా తుపాకులు కొన్న వాళ్లలో సగానికి పైగా మహిళలే.
తుపాకుల వల్ల 1968 నుంచి 15 లక్షల మందికి పైగా చనిపోయారు. 1775లో జరిగిన అమెరికా స్వాతంత్ర్య యుద్ధం నుంచి ఇప్పటి వరకూ మరణించిన సైనికుల సంఖ్య దీని కంటే చాలా తక్కువ.
గన్ కల్చర్‌ని అరికట్టాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. దీనికి రిపబ్లికన్లు ఒప్పుకోరు. ఇటీవలి సంఘటనలతో అమెరికన్లు రోడ్డెక్కారు. శనివారం 142 నగరాల్లో గన్స్‌కి వ్యతిరేకంగా ర్యాలీలు చేసారు. గన్ వుండడం స్టేటస్ అండ్ సేఫ్టీ సింబల్‌గా మారిన దేశంలో రక్తపాతాన్ని ఆపడం కష్టం.
జీఆర్ మహర్షి