గతంలో సాక్షిలో ప్రతి సోమవారం సాహిత్యం పేజీ వచ్చేది. సాహిత్యానికి పెద్దగా పాఠకులు లేకపోయినా అదో సాంప్రదాయం. ఈనాడులో సాహిత్య మర్యాద ఎన్నడూ లేదు. విపుల, చతురలు కూడా మూతపడ్డాయి. కారణాలు తెలియదు కానీ సాక్షిలో సాహిత్యం పేజి తీసేశారు. రాజకీయాల్లోనే బోలెడన్నీ కథలు, పిట్ట కథలు వుండగా సాహిత్యాన్ని ఎవడు చదువుతాడనే అభిప్రాయం కూడా కావచ్చు.
ఆ ప్లేస్‌లో ఇవాళ అరపేజి ఏది నిజం? అని వేశారు. ఈనాడు మీద కౌంటర్ అది. ఈనాడులో వచ్చిన వార్తలు నిజం కాదని అపుడపుడు ఏది నిజం అని అరపేజి వాస్తవాలు చెబుతుంటారు. డిజిటల్ యుగంలో పేజీలకి పేజీలు ఎవరూ చదవరు. కొత్త విషయాలు చెబుతారా అంటే పావు పేజి రకరకాల అలంకారాలు, విశ్లేషణలు వుంటాయి. బాబు అధికారంలో వుంటే ఈనాడు నోరు మెదపదని, జగన్ చేసే మంచిని ఓర్వలేదని చెప్పిందే చెబుతూ అనేక వాక్యాలు వుంటాయి.
టిడిపి అధికారంలో వున్నపుడు ఇవే ప్రశ్నలు ఎందుకు వేయలేదని, బాబు చేస్తే అద్భుతం, జగన్ చేస్తే అప్పులు అని అంటారా? అని ఏది నిజం ప్రశ్నిస్తూ వుంటుంది. ఇది తప్పదు కూడా.
తమాషా ఏమంటే ఈనాడు ప్రశ్నల్లో న్యాయముంది. సాక్షి జవాబుల్లోనూ న్యాయముంది. చంద్రబాబు హయాంలో మద్యం అమ్మకాలు పెరిగినపుడు ఈనాడు ఎందుకు ప్రశ్నించలేదని సాక్షి అడిగింది. నిషేధం విధిస్తానని బాబు చెప్పలేదు. పైగా నిషేధం ఎత్తివేసిన ఘనత ఆయనది. బాబుని ప్రశ్నించే పాయింట్ ఒకవేళ వున్నా ఈనాడు ప్రశ్నించదు.
మద్య నియంత్రణకు కట్టుబడి, షాపులు తగ్గించి, బెల్టు షాపులు తీసేసి అమ్మకాలు తగ్గిస్తూ పకడ్బందిగా జగన్ ప్రభుత్వం ముందుకి వెళుతోందట. ఈనాడు సంగతి పక్కన పెడితే సామాన్యులు కూడా మద్యం విషయంలో ప్రభుత్వాన్ని నమ్మరు. ధరలు పెంచితే తాగుడు మానరు.
పాయింట్ బ్లాంక్‌లో కౌంటర్ చేయకుండా ఎల్లో మీడియా అని తిడుతూ, అపుడెపుడో జరిగిన సారా ఉద్యమంపై ఈనాడుని దూషిస్తూ గత టిడిపి హయాం అంటూ పేజీలు పేజీలు రాస్తే పాఠకులు ఏది నిజం పేజీని Skip చేస్తారు.