కేసీఆర్-బీఆర్ఎస్.. ‘కాపురం చేసే కళ..’

తెలంగాణ రాష్ట్రం ఒక్కటే తన ప్రాణనాడి అని చెప్పుకుని, పోరాటాలు సాగించి, తెలంగాణ కోసం దీక్షలు చేసి రాష్ట్రం సాధించుకున్న కేసీఆర్, ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయి.. తెలంగాణ జాతి పిత గా…

తెలంగాణ రాష్ట్రం ఒక్కటే తన ప్రాణనాడి అని చెప్పుకుని, పోరాటాలు సాగించి, తెలంగాణ కోసం దీక్షలు చేసి రాష్ట్రం సాధించుకున్న కేసీఆర్, ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయి.. తెలంగాణ జాతి పిత గా తనను కీర్తింపజేసుకుంటున్న కేసీఆర్.. ఇప్పుడు యావత్ భారతదేశం మీద కన్నేశారు. భారత రాష్ట్రీయ సమితి పార్టీ (బీఆర్ఎస్)ను స్థాపించబోతున్నారు. 

కేసీఆర్ సారథ్యంలో జాతీయ పార్టీ ప్రారంభానికి సన్నాహాలు చురుగ్గానే జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కార్యవర్గం కూర్పు గురించి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలనుంచి అనేక మంది రాజకీయ నాయకులు ఫోనులో ఆయనను సంప్రదిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. 

‘కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలుస్తుం’దనేది సామెత. ఆ సామెత ప్రకారం గమనించినట్లయితే.. కేసీఆర్ తలపెడుతున్న జాతీయ పార్టీ ఎలా పనిచేస్తుంది, ఏ ప్రయోజనాలను ఆశించి పనిచేస్తుంది? అనే సంగతి ఈ కార్యవర్గం కూర్పుతోనే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసలు కేసీఆర్‌ను ఎందరు నాయకులు నమ్ముతున్నారు? ఎందరు నమ్మడం లేదు. జాతీయ స్థాయిలో ఆయన పెట్టబోయే పార్టీకి ఉన్న విశ్వసనీయత ఎంత అనేది కూడా కార్యవర్గం కూర్పులోనే అర్థమైపోతుంది. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంలోని బీజెపీ మీద అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి.. టీఆర్ఎస్ కు గుబులు పుట్టించగల స్థాయిలో బలం పుంజుకుంటున్న కొద్దీ.. ఆయన కేంద్రంలోని మోడీ మీద దాడి చేయడం కూడా పెరుగుతోంది. మోడీకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను జట్టుగా మార్చడానికి కేసీఆర్ తన వంతు ప్రయత్నాలన్నీ చేశారు. అనేక రాష్ట్రాలు తిరిగారు విందులు ఆరగించారు. 

కానీ.. వారితో ఎంత మేర ఏకాభిప్రాయం సాధించారన్నది మాత్రం తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో.. మూడో కూటమి కోసం సుదీర్ఘ ప్రయత్నం సాగించిన తర్వాత.. సొంత జాతీయ పార్టీ పెట్టడానికి సిద్ధం కావడం అనేది.. ఆయన మూడోకూటమికి ఎవ్వరి ఆదరణా దక్కలేదనే అభిప్రాయం కూడా కలిగిస్తుంది. 

కాగా.. జాతీయ పార్టీ స్వరూపస్వభావాలు ఎలా ఉండబోతున్నాయి. ఏయే రాష్ట్రాలనుంచి ప్రాతినిధ్యం, ఏయే స్థాయి నాయకుల భాగస్వామ్యం ఉండబోతున్నది.. అనే అంశాలు కూడా ప్రధానమైనవే. ఎందుకంటే.. కేసీఆర్ నిజంగానే దేశ విశాలప్రయోజనాలను లక్ష్యించి జాతీయ పార్టీ పెడుతున్నారా? కేవలం తన రాష్ట్రంలో బీజేపీని తట్టుకోలేక జాతీయ స్థాయి లో వారిని బెదిరించడానికి పార్టీ పెడుతున్నారా? రాష్ట్రాన్ని స్వయంగా వారసుడి చేతిలో పెట్టేయడం ఒక్కటే లక్ష్యంగా ఈ కసరత్తు చేస్తున్నారా?? అనే అంశాలన్నీ తెమిలిపోతాయి. 

ముందే చెప్పుకున్నట్టు.. కార్యవర్గం ఏర్పాటు చేసే సమయానికి ఆ పార్టీ చిత్తశుద్ధి, విశ్వసనీయత తేటతెల్లం అవుతాయి. అవును, కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడేతెలిసిపోతుంది!!