ఈమధ్య కాలంలో ఇలాంటి ప్రచారాలు బాగా చేస్తున్నారు బీజేపీ నాయకులు. వచ్చే సారి ఏపీ సీఎం పవన్ కల్యాణేనని అంటున్నారు. రత్నప్రభ గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఇస్తామని చెబుతున్నారు. అసలు ఇలా సీఎం పదవి, కేంద్ర మంత్రి పదవి ఇస్తామని చెప్పే నాయకుల స్థాయి ఏంటో ఎవరికీ తెలియదు. సోము వీర్రాజు చెబితే పవన్ కల్యాణ్ సీఎం అయిపోతారా? అలా అయిపోతే.. ఆయన తన పేరే చెప్పుకునేవారు కదా. పోనీ రత్నప్రభ ఏ లెక్కన కేంద్రమంత్రి అవుతారు.
కేంద్ర మంత్రి పదవి అంటే పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టా..? పక్క రాష్ట్ర ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం రత్నప్రభ గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. అసలు కేంద్ర మంత్రి పదవి గురించి మాట్లాడేంత స్థాయి రఘునందన్ రావుకి ఎక్కడిది.
దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన, ఏపీలో కూడా హిస్టరీ రిపీట్ అవుతుందనే భ్రమల్లో ఉన్నారా..? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు చోట్లా దెబ్బతిన్నా కూడా ఇంకా బీజేపీ దుబ్బాక భ్రమల్లోనే ఉండటం అవివేకం.
తిరుపతి ప్రచారానికి బీజేపీ తెలంగాణ నేతల్ని పిలవడమే పెద్ద మైనస్, అలాంటిది పక్క రాష్ట్ర ఎమ్మెల్యే ఈ రాష్ట్ర ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఇప్పిస్తామని చెప్పడం మరీ విడ్డూరం. ఏపీపై బీజేపీకి అంత దయ, జాలి ఉంటే.. ఈపాటికే ప్రత్యేక హోదా ఇచ్చి ఉండేది. విభజన చట్టాన్ని సైతం అపహాస్యం చేసిన బీజేపీకి ఏపీలో స్థానం ఉందనుకోవడం ఆ పార్టీ నేతల భ్రమ.
జనాలు మరీ అంత వెర్రివాళ్లా..? ప్రత్యేక హోదా అనే మాట నమ్మి 2014 ఎన్నికల్లో ఆల్రడీ ఓసారి ఏపీ ప్రజలు దారుణంగా మోసపోయారు. టీడీపీకి మెజార్టీ ఇచ్చి, బీజేపీని సపోర్ట్ చేసి నిండా మునిగారు. రెండోసారి ఆ తప్పు ఎందుకు చేస్తారు, అసలు బీజేపీని ఎందుకు నమ్ముతారు.
గతంలో టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని వచ్చినా, ఇప్పుడు కేవలం జనసేనని అడ్డం పెట్టుకుని రాజకీయ డ్రామాలాడుతున్నా.. బీజేపీ నిజ స్వరూపం ఎప్పుడో ఏపీ ప్రజలకు తెలిసిపోయింది. కాంగ్రెస్ కి పట్టినగతే ఏపీలో బీజేపీకి కూడా పట్టింది. కానీ ఇంకా ఆ పార్టీ నాయకులు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. కేంద్రంలో పవర్ ఉంది కదా అంటూ.. రాష్ట్రంలో కూడా రెచ్చిపోతున్నారు.
పవన్ సీఎం, రత్నప్రభ కేంద్ర మంత్రి అనే ప్రచారాలతో బీజేపీ నేతలు తమ పరువు తామే తీసుకుంటున్నారనేమాట మాత్రం వాస్తవం. ఎన్నికల్లో కొన్ని ట్రిక్స్ కొంతమేరకు పనిచేస్తాయి కానీ, ఇలాంటి చీప్ ట్రిక్స్ మాత్రం ఎప్పటికీ పనిచేయవు.